Flash News
Powered by Blogger.

Popular Posts

Blog Archive

Popular Posts

Bala Chelimi

Editor:
Manikonda Veda Kumar

Executive Editor:

Gali Udaya Kumar
---- ----
Bala Chelimi
Chandram, 490, Street No.11,
Himayat Nagar, Hyderabad 500 029
www.balachelimi.com

Mail Instagram Pinterest RSS

బాలసాహిత్యం - ముందడుగు

పిల్లల కోసం పెద్దవాళ్లు రచనలు చేసినా... పిల్లల కోసం పిల్లలే రచనలు చేసినా... వాటిని చదివినపుడు బాలలు సరికొత్త ఊహాప్రపంచంలోకి వెళ్లగలగాలి. అలాంటి రచనలే పిల్లల్లో సృజనాత్మకతను, ఊహాశక్తిని పెంచుతాయని... సెప్టెంబర్‌ 8న హిమాయత్‌నగర్‌లోని ఆక్స్‌ఫొర్డ్‌ గ్రామర్‌ స్కూల్‌లో జరిగిన 6వ 'బాలచెలిమి ముచ్చట్లు' కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు. ప్రతినెల రెండోశనివారం నిర్వహించే బాలచెలిమి ముచ్చట్లలో ఈ సారి 'బాలసాహిత్యం-ముందడుగు' అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది.
చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆ సంస్థ చైర్మన్‌ ఎం.వేదకుమార్‌ అధ్యక్షత వహించారు. బాలసాహిత్య రంగంలో నిష్ణాతులైన ప్రముఖులను ఆహ్వానించి ప్రతినెలా ఉపయోగకరమైన చర్చలను నిర్వహిస్తున్నట్టు వేదకుమార్‌ తెలిపారు.

ఎం. వేదకుమార్‌, చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ చైర్మన్‌
చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ గత నాలుగు దశాబ్దాలుగా పిల్లల చదువు, వారి సృజనాత్మకత గురించి ఆలోచిస్తూ పనిచేస్తోంది. 1986-87 ప్రాంతంలో పిల్లల పుస్తకాలపై రెండేళ్లపాటు పరిశోధనలు చేశాం. ఇతర దేశాల్లో పిల్లల పుస్తకాలు, వాటి భాష ఎలా వస్తున్నాయో పరిశీలించాం. మనదేశంలోనూ అనేక భాషల్లో పిల్లల పుస్తకాలపై కూడా పరిశోధన చేయడం జరిగింది. తెలుగులో ఎలాంటి పత్రికలు వస్తున్నాయి. .. ..ఎలాంటి రచయితలున్నారు.. వారి రచనలు ఎలా ఉన్నాయి... రష్యన్‌, ఫోక్‌, చైనీస్‌ పౌరాణికాలు... ఇలా రకరకాలు చక్కటి ప్రచురణలు వస్తున్న క్రమంలో... ఈ దేశంలో కూడా బెంగాలీ గానీ, హిందీ గానీ... 80వ దశకంలోని సమకాలీన రచనలపై పరిశోధనలు చేశాం. అప్పట్లో దేశంలో వెలువడే 18 పత్రికలు ప్రతినెల తెప్పించేవాళ్లం. భాష తెలియనప్పటికీ... పుస్తకం సైజ్‌, పత్రిక ఫార్మాట్‌, ఇల్లస్ట్రేషన్స్‌, కథల సైజ్‌ ఎలా ఉంది, సైన్స్‌, కవితలు, పర్యావరణం వంటి అన్ని విషయాలకు ఎంతటి ప్రాముఖ్యతను ఆ పత్రికలు ఇచ్చేవో పరిశీలించాం. రచనలు ఎలా ఉండాలి, పిల్లలకు అసలు ఏం చెప్పాలి... ఏది చెప్పొద్దు... అలా అనేక వర్క్‌ షాప్‌లు నిర్వహించి... అవగాహనకు వచ్చాక.. అందుబాటులో ఉన్న మంచి రచయితలతో, ఇల్లస్ట్రేటర్స్‌తో స్టడీ చేసి... అక్షరాల స్ట్రోక్స్‌ ఎలా ఉండాలనేదానిపై కూడా చర్చలు జరిపాం. అనేక వర్క్‌షాప్‌లు నిర్వహించి 1990 ఆక్టోబర్‌లో 'బాల చెలిమి' పత్రికను తీసుకొచ్చాం. 1991లో అనివార్యకారణాల వల్ల తేలేకపోయాం. ఆ తర్వాత.. కొన్ని సంవత్సరాలపాటు 16 పేజీలు, 8 పేజీలు, 4 పేజీలు కూడా నిర్వహించాం. వెబ్‌సైట్‌లు మొదలయ్యాక... బాలచెలిమి వెబ్‌ ప్రారంభించాం. ఆ రచనలన్ని... 'షషష.పaశ్రీaషష్ట్రవశ్రీఱఎఱ.షశీఎ' వెబ్‌సైట్‌లో ఇప్పటికీ చూడవచ్చు.. 2017లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు.. బాల చెలిమిని మళ్లీ తేవడానికి ఉత్సాహాన్ని ఇచ్చాయి. ప్రపంచ తెలుగు మహాసభల్లో 'బాల సాహిత్యం'పై కూడా చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఆహ్వానం అందడంతో నేను కూడా అందులో పాల్గొన్నాను. తెలుగు మహాసభల్లో బాల సాహిత్యంపై చర్చ జరగడం కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ వేదికపైనే మళ్లీ బాల చెలిమిని తీసుకొద్దామని... పిల్లలకు మంచి రచనలు అందిస్తామని తెలపడం జరిగింది. ముఖ్యంగా ఇంగ్లిష్‌లో తెస్తే ఎన్నడూ ఫెయిల్‌ కాం.. పదివేల కాపీలైనా మాలాంటి చిన్న సంస్థ ద్వారా వాటిని మార్కెట్‌ చేయవచ్చు. కానీ తెలుగులో అది కష్టమవుతుంది. ఎంతో పెద్ద నెట్‌వర్క్‌ ఉంటే తప్ప వెయ్యి కాపీలు కూడా తెలుగు పత్రిక సర్క్యులేట్‌ చేయలేం. అయితే ఇంగ్లిష్‌లో ఇప్పటికే చాలా విరివిగా బాల రచనలు వస్తున్నాయి... అందుకే తెలుగును ఇష్టపడేవారిగా.. మరియు గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళే పిల్లలకు అందివ్వాలన్నది ఉద్దేశం. వారికి మంచి రచనలు ఇవ్వగలిగితే... కొత్త ప్రపంచాన్ని వాళ్లు చూడగలుగుతారు. అలా మంచి బాల సాహిత్యం అందించాలన్న లక్ష్యంతోనే బాల సాహిత్యంలో పనిచేసే వారురు మరియు చయితలను ఆహ్వానించింది. గత 6 నెలలుగా చర్చలు నిర్వహిస్తున్నాం... అ క్రమంలోనే ' బాలసాహిత్యం - ముందడుగు' అంశంపై చర్చ నిర్వహిస్తున్నాం. పిల్లలకు రాసే వాళ్లనే కాకుండా..., పెద్దలకు రచనలు చేసే నిష్ణాతులు, సైంటిస్టులు, ఆర్టిస్టులు, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీతలు , ... ఇలా అందరి నుంచి పిల్లల రచనలు ఎలా ఉండాలనేదానిపై... అభిప్రాయాలు, ఆలోచనలు తీసుకోవడం కొనసాగుతున్నది.
రేడియో కార్యక్రమాల ద్వారా సైన్స్‌ మావయ్యగా అందరికీ సుపరిచితులు, రచయిత కె.బి.గోపాలం... బాలల రచనలపై తన మనోభావాలను వేదికపై పంచుకున్నారు. ప్రత్యేకంగా బాలసాహిత్యమంటూ లేదని చెప్పారు. పిల్లలకు అందించే ప్రతి రచనా బాలసాహిత్యమే అన్నారు.
నందిని సిధా రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌
సాహిత్యమనేది ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని... మొత్తం మనుషుల కోసం.. సమాజం కోసం.. మనసౌలభ్యం కోసం అంటూ... నిబంధనలు పెట్టుకుంటాం. స్త్రీల సాహిత్యం అంటే పురుషులు చదవకూడదని ఎక్కడా లేదు. స్త్రీల సాహిత్యాన్ని చదవాల్సింది పురుషులే. బాలల్ని ఎలా పెంచాలో తెలియాలంటే...పెద్దలు కచ్చితంగా బాల సాహిత్యం చదవాలి. కథలు విన్నపుడు పిల్లలతోపాటు పెద్దలు కూడా సంతోషపడకుండా ఉండలేరు. పెద్దవాళ్లలోనూ బాలహృదయం ఉంటుంది. ఈ రోజున్న సాంకేతిక పరిజ్ఞానం బాలల్ని చాలా దూరం తీసుకెళుతోంది. పుస్తకాలు చదవాలా వద్దా...సాంకేతిక పరిజ్ఞానమే వాడాల్నా... అనే చర్చ జరుగుతోంది. బాలల సాహిత్యం విడిగా ఉంటుందా... ఉండదా అన్నపుడు... బాలల స్థాయికి తగ్గట్టు చిన్నపుడు అభిరుచులు ఉంటాయి. వాళ్ల అభిరుచులకు అనుగుణంగా బాల సాహిత్యాన్ని రాయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనం సాంకేతికపరికరాలు వాడినా.. గత కాలం నుంచి ఇప్పటి వరకు వచ్చిన పుస్తకాల రూపంలో వెళ్లినా.. మంచి బొమ్మలు, ఆకర్షణీయంగా కథలు వంటివన్నీ... బాలల్ని చేరుకునే ప్రయత్నాలే. వాళ్లను చేరుకోలేనపుడు, బాలలు రాసినాకూడా... అది బాల సాహిత్యం కాదు. పిల్లలకు కథలు వెళ్లినంత సులువుగా సంప్రదాయాలు, పద్యాలు వెళ్లలేకపోవచ్చు. కథల తర్వాతి స్థానంలో గేయాలు, పాటలుంటాయి. అయితే... పాటలు అర్థంకాక... పిల్లలను పెద్దగా ఆకర్షించవు. రెండేళ్ల పిల్లల చేతిలో ఫోన్‌లు పెట్టి పాటలు వినిపిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో... అందులోపాటలకంటే... శబ్దం బాగా ఆకర్షిస్తుంది. నేను పదోతరగతి వచ్చాకే పుస్తకాలకు రచయితలు ఉంటారని తెలిసింది. 6, 7 తరగతుల్లో మా పంచాయితీ లైబ్రరీలో ఉన్న వందల పుస్తకాలు చదివాను కానీ రచయితల పేర్లు ఉంటాయని తెలియదు.
ఉదాహరణకు సైన్స్‌ కథలు కె.బి.గోపాలం రాస్తే చదువుతాం... అదే మరొకరు రాస్తే చూడం. స్వచ్ఛమైన బాల రుచి ఎలా ఉంటుందంటే... కేవలం కథల్ని మాత్రమే గుర్తుంచుకునే వయసు అది. బాలల స్థాయి ఉండే అభిరుచులకు, యువత స్థాయిలో అభిరుచులకు, పరిణతి చెందిన స్థాయి అభిరుచులకు తేడా ఉంటుంది. బాలల రచనలు చేయాలంటే... వారిస్థాయికి దిగి... వారి మనోభావాలు, అభిరుచులు తెలసుకుని రాయాలి. నేను స్కూళ్లకు వెళ్లినపుడు అలంకారాల గురించి చెప్పాను... కథలు చెప్పినపుడు మాతమ్రే వారికి చేరుతుంది. బాలలు మన పాఠకులు అయినపుడు మనం రాసే భాష మారుతుంది. పండితులు పాఠకులు అయినపుడు రాసే భాష... బాలలు పాఠకులు అయినపుడు రాసే భాష ఒకటి కాదు.

సాంకేతిపరికరాల వల్ల పిల్లల ఉహాశక్తి, కాల్పనిక శక్తి తగ్గుతోందన్నది నిజం. పిల్లలు చిన్న వస్తువుల్లో తమ కాలక్షేపాన్ని వినోదాన్ని వెతుక్కోవడం మొదలైందో... వారి ఊహాశక్తి పెరిగే అవకాశం లేకుండా పోయింది. అందుకే బాలల రచనలు... వారి ఊహాశక్తిని పెంచగలిగే పరిస్థితి ఉండాలి. చిన్నపుడు ఎన్నో నాటకాలు, వీధి భాగవాతాలు, చిందు భాగవాతాలు చూసినప్పటికీ... వాటిలో బాల నాగమ్మ కథ బాగా నచ్చేది. ఎందుకంటే... మాయల ఫకీరు లాంటి పెద్దవాడిని పిల్లవాడు ఎలా జయిస్తాడనే ఆసక్తి ఉండేది. ప్రస్తుతం బాలచెలిమి పత్రిక తేవాలనుకోవడం చాలా సంతోషం. ఇంగ్లిష్‌లో తెస్తే ఎక్కువ కాపీలు వెళతాయా... రచనలు ఏ భాషలో వచ్చినప్పటికీ... పిల్లల్ని విముక్తి చేయగలగాలి.బిగ్‌బాస్‌ లాంటి కార్యక్రమాలను పిల్లలు గంటల తరబడి చూస్తున్నారు. వాటివల్ల పిల్లల ఊహాశక్తిి, భాష, అభిరుచి, జ్ఞానం పెంచేదిగా లేనపుడు మనం బాధపడటం తప్ప చేయగలిగింది ఏమీలేదు. వాళ్లను అలాంటి కార్యక్రమాల నుంచి విముక్తం చేయాల్సిన బాద్యత వేదకుమార్‌ గారిపైఉందని భావిస్తున్నా.. ఇలాంటి అనేక చర్చలు జరగాలని... ఆశిస్తున్నా. .. అన్ని ప్రక్రియల్లో కృషి జరగాల్సిన అవసరం ఉంది.
బొమ్మలు ఒక వయసులో చాలా ఆకర్షిస్తాయి. కాబట్టి బొమ్మలు, చిన్న వాక్యాలతో ఉన్న పుస్తకాలు మొదలు పెట్టి... చందమామ కథలు చెప్పాలి. కొడవటిగంటి కుటుంబరావు.. చందమామను పెద్దవాళ్లకు, పిల్లలకు అర్థమయ్యే భాష తీసుకొచ్చారు. అలాంటి పుస్తకం నేడు లేదు. అయితే డిజిటల్‌ రూపంలో అందుబాటులో ఉంది. వాటిని ప్రింట్‌ చేసి పిల్లలచే చదివించగలిగితే... వారి ఊహాశక్తి పెరుగుతుంది. భేతాళ కథలు, పరోపకారి పాపన్న కథలు, రామాయణం, భారతం, భాగవతం కథలన్నీ అందరికీ నచ్చేవే. నందిని సిధారెడ్డిగారు చెప్పినట్టు, హేతువాదాన్ని పిల్లలకు బలవంతంగా చెప్పనక్కర్లేదు. చందమామలో దెయ్యాల కథలుండేవి. ఒకసారి కుటుంబరావుగారిని అడిగారు.... మీరు భౌతికవాదులు, సైంటిస్టులు, సైన్స్‌ పుస్తకాలు రాస్తారు.... మీరు రాసే కథల్లోదెయ్యాలుంటాయంటే.. మా దెయ్యాలు చాలా మంచి దెయ్యాలు, అవి ఎవరికి అపకారం చేయవు, అందరికీ మంచి చేస్తాయాన్నరు. దెయ్యాల్లో కూడా మంచితనాన్ని చూడగలిగే మనసును పిల్లల్లో కలిగించగలగాలి.
పంచతంత్ర కథలు సరళమైన భాషలో ఉంటాయి. అవన్నీ ఎవరో పూర్వీకులు రాశారు, ఇప్పుడు పనికిరావు అనుకోవడం మూర్ఖత్వం... కొత్త కాలంలో కొత్త కథలు రాసుకోవాల్సిందే... రాయాలంటే నేర్పరితనం కావాలి.. అపుడు పాత కథలు కూడా తప్పసిసరిగా చదవాలి. స్కూలు వార్షికోత్సవాల్లో.. నేను చిన్నపుడు చూసిన నాటికల్నే ఇప్పటికీ వేస్తున్నారు. కొత్తనాటికలు రాయాలంటే ఎలా రాయాలి... అప్పుడు మళ్లీ పాతవాటి దగ్గరకే వెళ్లాల్సి ఉంటుంది. పిల్లలకు మాట్లాడుకునే పరిస్థితి కల్పించాలి. కాసేపైనా వాళ్లంతటవాళ్లు మాట్లాడుకోగల అవకాశం కల్పిస్తే... వారిలో చాలా సృజనాత్మకత పెరుగుతుంది. మేము చిన్నపుడు కథలు చదువుకుని.. వాటి గురించి చాలా సేపు మాట్లాడుకునేవాళ్లం. అలా మాట్లాడుకోవడానికి స్కూల్‌కు తొందరగా వెళ్లేవాళ్లం. ఇక్కడ 'మల్లి' సినిమా చూపించాక... మీకు ఇంకా ఏ సినిమాలు ఇష్టమని అడిగినపుడు... బాహుబలి సినిమా కావాలన్నారు. టెక్నాలజీ వాడుకోవడం, మీడియా హైప్‌వల్ల బాహుబలి సినిమాలు గొప్పగా నడిచినప్పటికీ... చందమామలో వచ్చిన కథలు, బొమ్మల కంటే గొప్పగా అనిపించదు. దర్శకుడు రాజమౌళి కూడా చందమామ బొమ్మలు చూసి ప్రేరణ పొంది ఉంటారు. కాబట్టి మనం బొమ్మలు, పాటలు, కథలు ఇవి మన సంపదలు. ప్రతీ భాషలోనూ ఉండే అపూర్వ సంపదలు. వాటిని పెద్దవాళ్లు పిల్లలకు అందించాలి. కొత్తగా సృష్టించడంతోపాటు పాతవాటిని వెలికితీసి పిల్లలకు ఇవ్వాలి. బంగారం లాంటి బాల సాహిత్యాన్ని పిల్లల చేతికి అందించగలగాలి. ఏ రూపంలోనైనా పిల్లలకు మంచి విలువల్ని, మంచితనాన్ని, అద్భుతమైన ఊహాశక్తిని, కల్పనాశక్తిని అందించే సాహిత్యాన్ని ఇవ్వాలి.
ఇంట్లో ఉండే అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలే.. పిల్లలకు తొలి బాలసాహితీవేత్తలని ప్రముఖ రచయిత ఓల్గా అన్నారు. బాలసాహిత్యం పాత రచనలు చదివినపుడే... కొత్త రచనలకు అవకాశం ఉంటుందని... ఆమె తెలిపారు. పాతకాలం రచనలు ఇప్పటికి పనికిరావని చెప్పడం సరికాదన్నారు.
ఓల్గా, ప్రముఖ రచయిత
'పాతనగరంలో పసివాడు, గులాబీలు, అమూల్యం' అనే మూడు పిల్లల సినిమాలకు కథలు, మాటలు రాశాను. పిల్లలు ఇష్టంగా చూసిన ఈ సినిమాలకు పలు అంతర్జాతీయ చిత్ర ప్రదర్శనల్లో అవార్డులు కూడా వచ్చాయి. నెలల పిల్లల దగ్గర్నుంచి కూడా.. బాల సాహిత్యం అవసరమే. పెద్దవాళ్లకైయితే చాలా అవసరమని నేను నమ్ముతాను. 'ట్వింకిల్‌- ట్వింకిల్‌ లిటిల్‌ స్టార్‌'.... మనకు అసవరంలేదు... 'చిట్టి చిలకమ్మ' లాంటి పాటలు చాలా మంది పెద్ద రచయితలు చిన్న పిల్లల కోసం రాశారు. నా దృష్టిలో అందరికంటే పెద్ద బాలసాహితీవేత్తలు మా అమ్మమ్మ, నాయనమ్మ. వాళ్లు చెప్పిన కథలు నన్ను రచయితగా మార్చాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. బాలసాహిత్యం ముందు మౌఖిక సాహిత్యంగా మొదలవుతుంది. ఇంట్లో పెద్దలు చెప్పే కథలతో బాల సాహిత్యం ప్రారంభమవుతుంది. మళ్లీ ఆ కథల్ని మేము మా పిల్లలకు చెప్పాలన్నా... సమయం దొరకడంలేదు.. పిల్లలు కూడా చిక్కడంలేదు. రెండున్నరేళ్లకే వాళ్లను ప్లే స్కూళ్లలో వేయడంతో హోంవర్క్‌లతో వాళ్లు బిజీగా మారుతున్నారు. చాలా సందర్భాల్లో అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతాయ్యలు పిల్లలతో కలిసి ఒకే కప్పు కింద ఉండే పరిస్థితులు కూడా లేవు. కొత్త కాలానికి కొత్త సమస్యలు వచ్చినపుడు సాహిత్యం మరో కొత్త రూపాన్ని ఎలా తీసుకోవాలి. ఇది మనముందున్న పెద్ద సవాల్‌.

కె. బి.గోపాలం, పిల్లల రచయిత
దశాబ్దాల క్రితం ప్రకాశం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంటల్‌ సైన్సెస్‌ అనే సంస్థ హైదరాబాద్‌లోని అయోధ్య హోటల్‌ పక్కన ఉండేది. వాళ్లు పదిరోజుల రచయితల వర్క్‌షాప్‌ నిర్వహించారు. నేను అందులో పాల్గొనకపోయినప్పటికీ... చివరి రోజున ఉపన్యసించమని ఆహ్వానించారు. అక్కడ వరదాచారి కనిపించారు. ఆయన ముందుగా మాట్లాడుతారేమో... మిగిలినవి ఏమైనా ఉంటే ఆ తర్వాత మాట్లాడదామనుకున్నా... కానీ నన్నే ముందు మాట్లాడమన్నారు. నేను ఆ రోజు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఇక్కడ కూడా ప్రస్తావిస్తున్నా... నా దృష్టిలో అసలు బాల సాహిత్యమంటూ ప్రత్యేకంగా ఏదీలేదు. ఎందుకంటే...చిన్నపుడు మనసు నిర్మలంగా ఉంటుంది. ఏమి చెప్పినా... ఓహో నిజమే కదా అని నేర్చుకునే మంచితనం ఉంటుంది. నేను ఆ పద్ధతిలో ఆలోచించాను... ఆలోచిస్తున్నాను..
సైన్స్‌కు సంబంధించి పిల్లల అనుమానాలకు జవాబులు చెప్పే కార్యక్రమం రేడియో లో మొదలుపెట్టాం. తెలంగాణ వచ్చాక... విశాలాంధ్ర రెండు భాగాలుగా విడిపోయింది. మనకు నవ చేతన మిగిలింది. నవచేతనకు చైర్మన్‌గా... తెలుగు యూనివర్సిటీ వీసీగా పనిచేస్తున్న ఎస్‌.వి. సత్యనారాయణ నియమితులయ్యారు. అలా ఒకసారి హలో అందామని వెళ్లాను. నేను లోపలికి వెళ్లగానే వెనక నుంచి అక్కడ పనిచేసే స్టాఫ్‌ వచ్చారు. వాళ్లునన్ను చూడటానికి వాచ్చారని తెలియగానే... ఒప్పొంగిపోయింది. నేను రాసిన పుస్తకాల ప్రభావం విశాలాంధ్ర సిబ్బందిమీదనే అంతగా ఉందంటే... ఇక పాఠకుల మీద ఎంత ఉందో తెలియదు. 'నిత్యజీవితంలో భౌతికశాస్త్రం' మళ్లీ వేయొచ్చుగా అని... ఆ సందర్భంలో ఎస్వీగారు అడిగారు. అయితే... అప్పుడు నా పరికత్వత తక్కువ... దాన్నే మళ్లీ ప్రింట్‌ చేయకండి... దాన్ని మళ్లీ రాస్తాను అనిచెప్పా... అలాగే దీన్ని రాశాను. ఇప్పటికీ... ఈ పుస్తకం బాగా అమ్ముడుపోతోంది. మరిదీన్ని ఎవరూ బాలసాహిత్యం అనడంలేదు. అంతరిక్షం అనే ఒక బొమ్మల పుస్తకం రాశాను... పదేళ్లకంటే తక్కువ వయసుగలవారికి కూడా అర్థమవుతుంది. ఇదే సైజ్‌లో సైన్స్‌ చరిత్ర అనే పుస్తకం రాసిన. ఇది ప్రింటింగ్‌ దశలో ఉంది. అందరికీ సైన్స్‌ పేరుతో మరో పుస్తకం తెచ్చాను. సైన్స్‌ గురించి ఏ మాత్రం అవగాహనలేనివారికి ఇది చదివితే... అర్థమవుతుందని రాశాను. మరి ఇది బాలసాహిత్యం కాదా... నేను రాసిన మరో పుస్తకం '100 ప్రశ్నలు'.... ఇందులో రకరకాల ప్రశ్నలుంటాయి.... అసలు ప్రశ్నతోనే ఈ ప్రపంచం ముందుకుసాగిందని సైన్స్‌, తత్వశాస్త్రవేత్తలు, సాహిత్యంవాళ్లు ఒప్పుకున్న విషయం. 'మినుగురు పురుగుల్లో వెలుగు ఎలా వస్తుంది' , 'పక్షులు ఎలా ఎగురుతాయి', 'పూలకు రంగులు ఎందుకు', 'సైన్స్‌ పద్ధతి' లాంటి పుస్తకాలు రాశాను...
'సైన్స్‌ పద్ధతి' పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 11 వేల కాపీలు తీసుకుని ప్రతిబడికి పంపింది. అయితే దీన్ని ఎవరూ బాలసాహిత్యం అనలేదు... ఇది బాల సాహిత్యమా కాదా.. మీరే తేల్చుకోండి... మోటివేషనల్‌ కూడా ఉండాలన్న ఉద్దేశంతో... మరొక రకమైన పుస్తకాలను రాయడం మొదలు పెట్టాను. 'కొత్తదారులు', 'నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌' 'జేన్‌ గుడాల్‌' 'ఐజాక్‌ న్యూటన్‌' లాంటి పుస్తకాలు రాయడం జరిగింది. సైన్స్‌తోపాటు...పురాణాలు, కథలు, కవిత్వాలు గురించి కూడా రాస్తాను... బాలలకుగానీ... లేదా వారిలాంటి మనసున్నవారికిగానీ.. చెప్పాలంటే... అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలన్నదే నా తపన.. జానపదకథలు అంటే పిల్లల కథలు అనే అపోహ ఉంది.... అయితే జ్ఞాపకం వచ్చింది కాబట్టి ఒక విషయం చెబుతాను... అప్పట్లో చందమామ పత్రికపైన... పిల్లల మాస పత్రిక అనే ట్యాగ్‌లైన్‌ ఉండేది. అనేకమంది పెద్దవాళ్లు ఉత్తరాలు రాసి... ఆ ట్యాగ్‌లైన్‌ను తీసేయించారు. అది పిల్లల మాసపత్రిక మాత్రమే కాదు.. మేముకూడా చదువుతామనేవారు.. అదేపద్ధతిలో నేను రాసిన ఈ పుస్తకాలన్నీ బాలసాహిత్యంకాదు.. ఇది అందరికీ కావాల్సిన సాహిత్యం.
బాలల ఊహాశక్తిని పెంపొందించే రచనలు తీసుకునిరావాల్సిన అవసరం చాలా ఉందని... కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరమైన ప్రముఖ రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధా రెడ్డి అన్నారు. సాంకేతిక పరికరాలు పిల్లల ఊహాశక్తిని దెబ్బతీస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
పైడిమర్రి రామకృష్ణ, పిల్లల రచయిత
ఇక్కడున్న నాతోపాటు... చాలా మంది రచయితలు చందమామ చదివి పెరిగినవాళ్లే. దాంతోపాటు బాలజ్యోతి, బాలమిత్ర కూడా చదివాను. బాలజ్యోతిలో సైస్సు మావయ్య కె.బి.గోపాలం గారి వ్యాసాలు వచ్చేవి. అలాంటిది ఈ రోజు ఆయనతో వేదిక పంచుకోవడం సంతోషంగా ఉంది. ఈతరం పిల్లలు తెలుగు బాలసాహిత్యాన్ని చదువుతున్నట్టు అనిపించడంలేదు. తెలుగును అందరూ నేర్చుకోవాలి, అది మన మాతృభాష. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధా రెడ్డిగారికి నాదొక విన్నపం... తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున పిల్లల కోసం పత్రిక ఎందుకు నడపకూడదని నేను ప్రశ్నిస్తున్నాను. వాటిని స్కూళ్లకు చేర్చినపుడు ప్రతి విద్యార్థికి బాలసాహిత్యం చేరే అవకాశం ఉంటుంది. 'పిల్లల కోసం చాలా సైన్స్‌ వ్యాసాలు రాశాను... నేను బాల సాహితీవేత్తను కాదా' అని కె.బి.గోపాలం అడుగుతున్నారు... కచ్చితంగా ఆయన బాలసాహితీవేత్తనే. ఎందుకంటే బాలల కోసం ఏ రచన అయినా... బాల సాహిత్యమే. దాన్ని పెద్దలు కూడా చదువుతారు. అందులో కథలు పిల్లలకు ఎక్కువగా దగ్గరవుతాయి. కథలతోపాటు గేయాలు, కవితలు ఇతర ప్రక్రియలుంటాయి. అలాగే కె.బి.గోపాలం గారు తీసుకున్న ప్రక్రియ సైన్సు వ్యాసాలు. అయితే ప్రభుత్వం తరపును అవార్డుల కోసం... సైన్స్‌ వ్యాసాలను ఇతర ప్రక్రియలు అనే కోటాలో తీసుకుంటున్నారు. దాన్ని బాల సాహిత్యంగా పరిగణించడంలేదు. పిల్లల కోసం చేసిన ఏరచన అయినా... అది బాల సాహిత్యమే.. దీని ప్రకారం కె.బి.గోపాలం గారు రాసినవి బాల సాహిత్యమే. సైన్సు వ్యాసాలతోపాటు బాలల కోసం రాసినవి పరిగణలోకి తీసుకోవాలని నందిని సిధారెడ్డి గారిని నేను కోరుతున్నా.
ప్రస్తుత బాలచెలిమి ముచ్చట్టు అంశం... 'బాలసాహిత్యం- ముందడుగు' గురించి చెప్పుకోవాలంటే... నేటి పిల్లలు బాల సాహిత్యాన్ని చదవగలిగితేనే... భవిష్యత్తులో రాయగలరు. భూపాల్‌, రఘు, నేను ఇంకా ఇతర బాలసాహితీవేత్తలు కలిసి సిరిసిల్లలో రంగినేని ట్రస్టు ద్వారా వర్క్‌షాప్‌ నిర్వహించాం. అందులో వారికి బాల రచనలు చేయడమెలాగో నేర్పించాం... ఓ కథా వస్తువుతో కథను ఎలా మొదలు పెట్టాలి... ఎలా రాయాలి... ఎలా మలుపు తిప్పాలి.. ఎలా ముగించాలి.... అనే అంశాలపై శిక్షణ ఇచ్చాం... వాళ్లు నేర్చుకున్నాక... సొంతంగా అద్భుతమైన కథలు రాశారు. వారి రచనలను అచ్చువేశారు... బాల చెలిమిలోనూ ఒక జానపద కథ, ఒక సైన్సు వ్యాసం, క్రియేటివ్‌ కథలు, ప్రస్తుత సాంఘిక సూత్రాలతో కథలు. గేయాలు వంటి అన్ని ప్రక్రియలతోపాటు పిల్లలు రాసిన కథలు కూడా ఉండేలా చూడాలని వేదకుమార్‌ గారికి విజ్ఞప్తి చేస్తున్నా.

రోహిణి చింత, పిల్లల రచయిత
నాలుగు నుంచి ఏడేళ్ల పిల్లలను దృష్టిలో పెట్టుకుని రచనలు చేస్తాను. నేను సైన్స్‌ కమ్యూనికేటర్‌ను. హ్యూమన్‌ బయాలజీ- జెనెటిక్స్‌లో పీహెచ్‌డి జెనెటిక్స్‌లో చేశాను. అయితే నేను చేసిన పీహెచ్‌డీ పిల్లలకు పనికిరానపుడు వృధా అని మా గురువులు చెప్పేవారు.. నా ఉద్దేశంలో పిల్లలకోసం పిల్లలు చేసిన రచనలను ముందుకు తీసుకెళ్లాలి. మిస్టరీ, థ్రిల్లర్స్‌, అడ్వెంచర్‌, హ్యూమరస్‌ కథలకు ప్రాధాన్యత ఇస్తాను. పిల్లల స్థాయిలో వారు ఏమి అర్థం చేసుకోగలరో అలాంటి రచనలే చేపట్టాలి. బాల సాహిత్యంలో నాకు బాగా నచ్చిన రచనలు చందమామలో వచ్చేవి. మా అమ్మమ్మ, తాతయ్యలే వాటిని నాకు పరిచయం చేశారు. వాటితోనే తెలుగు రచనలపై ఆసక్తి కలిగింది. బాల సాహిత్య రచనల్లో వచ్చిన పుస్తకాల్లో చందమామలో ఎక్కువగా బొమ్మలుంటాయి. నా కొడుకుకి కథ చెప్పాలంటే.. ముందుగా బొమ్మలు చూపిస్తాను. వాటిని అర్థం చేసుకోవడానికి సమయం ఇస్తాను. ఆ తర్వాత కథ మొదలు పెడతాను. అప్పుడు కథను తాను ఊహించుకునే అవకాశం ఉంటుంది.
తెలుగులో బొమ్మలతో ఉన్న కథల పుస్తకాలు చాలా తక్కువ. నా కొడుకు వయసులో ఉన్న పిల్లలకు బొమ్మలతో ఉన్న కథలు, పుస్తకాలు ఎక్కువగా ఆకట్టుకుంటాయి. కథలు సుదీర్ఘంగా ఉండకుండా.. బొమ్మలతో మంచిగా ఉండి మొదటి పేజీ ఆకర్షణీయంగా ఉండాలి. అప్పుడే పుస్తకం చూడాలన్న ఆసక్తిని పెరుగుతుంది. నేను నా 150 పేజీల పరిశోధనా పత్రాలను 6 పేజీల కథ కింద రాసి బొమ్మలతో అచ్చు వేయించాను. ప్రైమరీ స్కూల్స్‌కు సైన్స్‌ పుస్తకాలను ముద్రించే 'ఐ వండర్‌' అనే మ్యాగజైన్‌ నా పుస్తకాన్ని విడుదల చేసింది. అపుడు నా కొడుకు క్లాస్‌మేట్‌ వచ్చి.... ఆంటీ నాకు ఒక కాపీ దొరుకుతుందా అని అడిగాడు. ఆ పుస్తకం నీకు అర్థమవుతుందా అని అడిగాను. అయితే మా అమ్మ పుస్తకం చదువుతుంది... నేను ఆబొమ్మలు చూస్తాను అని ఆ బాబు చెప్పాడు. ముందుగా మనం పిల్లవాడి కోణం నుంచి చూడాలన్నది నా ఉద్దేశం.
భూపాల్‌, నటుడు- రచయిత
సభలో పాల్గొన్న బాలసాహిత్యంంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అయిన భూపాల్‌, నటుడు- రచయిత
ఈ మధ్యే తెలంగాణ పాఠశాల పిల్లలు అని వచ్చిన 306 కథలు చదివాను. వాటిలో 51 మాత్రమే ఎన్నుకోబడ్డాయి. 250 కథలు పక్కనబెట్టారు. దీని అర్థం పిల్లల్లో లోపం ఉందని కాదు. వారిలో సృజనాత్మకత ఉంది. అయితే దాన్ని పెంచిపోషించే సత్తా ఎవరూ ఇవ్వడంలేదు. కచ్చితంగా ఇది పెద్దల పొరపొటే.. కథలు రాసే, చెప్పే విధానాలు మనమే పిల్లలకు చెప్పాలి. వారికి మనం అలవాటు చేయకపోవటమే అసలు సమస్య. వారికి చెబితే... అద్భుతంగా కథలు రాయగలరు.

బాలచెలిమి 6వ ముచ్చట -'బాలసాహిత్యం-ముందడుగు' కార్యక్రమంలో... తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ ముఖ్య అతిథిగా పాల్గొనగా... రచయితలు ఓల్గా, కె.బి.గోపాలం, పైడిమర్రి రామకృష్ణ, రోహిణి చింత, వడ్డేపల్లి కృష్ణ, భూపాల్‌ రెడ్డి, ఎస్‌.రఘులతోపాటు అక్కినేని కుటుంబారావు, శ్రీనివాస్‌, శ్యాంసుందర్‌, ధనుంజయ్‌, బొట్ల పరమేశ్వర్‌, సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్‌ సంతోష్‌ శివన్‌ దర్శకత్వం వహించిన 'మల్లి' హిందీ షార్ట్‌ ఫిల్మ్‌ను ఈ సందర్భంగా ప్రదర్శించారు.




0 comments:

Post a Comment