Flash News
Powered by Blogger.

Popular Posts

Blog Archive

Popular Posts

Bala Chelimi

Editor:
Manikonda Veda Kumar

Executive Editor:

Gali Udaya Kumar
---- ----
Bala Chelimi
Chandram, 490, Street No.11,
Himayat Nagar, Hyderabad 500 029
www.balachelimi.com

Mail Instagram Pinterest RSS

బాల సాహిత్య వికాసం- మనం, మన ఆలోచనలు

తరం మారుతోంది... స్మార్ట్‌ తరం దూసుకొస్తోంది... వారి ఆలోచనా విధానం కూడా శరవేగంగా మారుతోంది... మరి ఇలాంటి పరిస్థితుల్లో... బాల సాహిత్యం కూడా మారాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో మానసిక పరిణతిని పెంపొందించే స్థాయిలో... నేటితరానికి తగ్గట్టుగా బాల సాహిత్యం రావాల్సిన ఆవశ్యకత ఉందని... బాల చెలిమి నాల్గవ ముచ్చట్లలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. జులై 14న హిమాయత్‌నగర్‌లోని ఆక్స్‌ఫొర్డ్‌ గ్రామర్‌ స్కూల్‌లో ' బాల సాహిత్య వికాసం - మనం, మన ఆలోచనలు' అంశంపై.. చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీ ఆధ్వర్యంలో బాల చెలిమి ముచ్చట్లు కార్యక్రమం జరిగింది. అకాడమీ చైర్మన్‌ అధ్యక్షత వహించిన ఎం.వేదకుమార్‌ ... బాల చెలిమి ముచ్చట్లకు వచ్చిన రచయితలను పరిచయం చేస్తూ... వేదికపై ఆహ్వానించారు. ఎం.వేదకుమార్‌, చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీ చైర్మన్‌
బాల్యాన్ని ప్రతిబింబించే రచనలు కనుమరుగవకుండా... పిల్లల హృదయాలను తాకే సాహిత్యాన్ని అందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత రచయితలపై ఉంది. పిల్లల రచయితలే బాలల కోసం రాయడంకంటే ... పెద్దల రచయితలు కూడా ప్రయత్నించాలి. మనందరిలోనూ ఒక పిల్లవాడు దాగి ఉంటాడు. పెద్దల రచయితలకు ఒక అవకాశం ఇవ్వాలి. పిల్లల గురించి, విద్యావిధానం గురించి ఈ రచయితలే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. సమాజంలో మార్పు కోరుతున్న రచయితలు వీళ్లు. వారి రచనలు బాలలకు అందాలి. ఒక వేళ రాయకపోయినా... బాల సాహిత్య రచయితలకు దశ, దిశ చూపగలిగే వేదిక ఉన్నపుడు మంచి రచనలు వస్తాయని భావిస్తున్నా. కేవలం పుస్తక రూపంలోనే కాకుండా... సినిమాకు రేడియో కార్యక్రమాలకు, టీవీలకు రచనలు కావాలి. ఈ నాలుగు మాధ్యమాల్లో ఆలోచించగలిగినపుడే పిల్లలకు మంచి రచనలు అందివ్వగలం. గతంలో రేడియో అన్నయ్య లాంటి కార్యక్రమాలు చాలా పరిమిత సంఖ్యలో అవకాశం ఉండేది. మాతరం వాళ్లు ఆ కార్యక్రమాలు విని స్ఫూర్తి పొందినవాళ్లమే. బాలానంద సంఘంతోపాటు చిన్నచిన్న కల్చరల్‌ క్లబ్స్‌ వాటివల్ల నాటికలు నేర్చుకుని పెద్ద కళాకారులుగా ఎదగడానికి తోడ్పడ్డాయి. అయితే ఇప్పుడు పరిధి ఎక్కువై అవకాశాలు అధికంగా ఉన్నాయి... పిల్లల ప్రపంచం చాలా పెద్దది... ప్రతి వీధిలోని పిల్లలకు కూడా బాలసాహిత్యం చేరే అవకాశం ఉండాలి. బాల చెలిమి ముచ్చట్లు ఇది నాల్గవ సెషన్‌. ఇక్కడికి వచ్చిన రచయితల్లో కొందరు బాల సాహిత్యం రాయకపోయినప్పటికీ... పిల్లల కోసం ఎలా రచనలు ఎలా ఉండాలి అన్నది వారికి ఒక ఆలోచన, ధృక్పథం ఉంటాయి. అలాంటివి బాల చెలిమి ముచ్చట్లలో అందరు రచయితలతో పంచుకునే అవకాశం ఉంటుంది.
గోగు శ్యామల, రచయిత
స్త్రీల జీవిత చరిత్రలు రాయడంలో బిజీగా ఉన్న సమయంలో బాల చెలిమి ముచ్చట్లకు రావడం కొంత ఉపశమనం కలిగించింది. బాల సాహిత్యం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందనే ఇక్కడికి వచ్చాను. ఈ తరం పిల్లలు మాట వినరూ అనే నెగెటివ్‌ ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి. కానీ సాహిత్య కోణంలో అలోచించినపుడు...ఆ పరిమితి నుంచి బయటికి వచ్చి ఆలోచించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతమున్న సాహిత్యాన్ని మార్కెట్‌ శాసిస్తోంది. మనం చిన్నపుడు విన్న.. ..చిట్టి చిలకమ్మా వంటివి టీవీల్లో కనిపించడంలేదు. భయంకర శబ్దాలతో యుద్ధం కథలతో వచ్చే టీవీ షోలు పసి హృదయాలను కలుషితం చేస్తున్నాయి. పిల్లల్లో యుద్ధం మైండ్‌ సెట్‌ను తయారు చేసి... హింసను జీర్ణించుకునే పరిస్థితులు కల్పిస్తున్నారు. మనం ఇంకా రాసే దగ్గరే ఉన్నాం... ఈ జనరేషన్‌ పిల్లలు విజువలైజేషన్‌కు దగ్గరయ్యారు. ఈ పరిస్థితుల్లో వారికి మనకు మధ్య అంతరం పెరుగుతోంది. ఇది మనకు సవాల్‌ వంటిది. స్మార్ట్‌ ఫోన్లు పిల్లల ఆటవస్తువులైన ఈ రోజుల్లో... వారి వేగాన్ని మనమే అందుకోవాలి. తెలుగు సినిమా మోడల్‌తో... హీరోయిజంపైన మన దగ్గర సాహిత్యం ఎక్కువగా ఉంది. నా ఉద్దేశంలో పిల్లల జీవితాల్లో ఒక ఊరు, ఒక సమాజం కనిపించాలి. ప్రస్తుతం మనం... మూసధోరణిలో వెళుతున్నాం. అసలు ముందుగా పిల్లల కోసం ఆలోచించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. బాల చెలిమి లాంటి వేదికల ద్వారా పిల్లలకు దగ్గరయ్యే రచనలు చేపట్టినపుడు ఫలితాలు బాగుంటాయని ఆశిస్తున్నా...

ఆనంద్‌, చిత్రకారుడు
వయసు ఎగసితేనేమి.. మనసు మాత్రం యవ్వనం.. ఎన్ని వత్సరాలైతేనేమి... పరిమళించదా చందనం అన్న రీతిలో... తాను అనుకున్న లక్ష్యంవైపు అడుగులు వేస్తున్న వేదకుమార్‌ గారికి.. కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, రచయితలకు నమస్కారం. ఈనాడు పత్రికలో చీఫ్‌ ఆర్టిస్ట్‌గా పదేళ్లు పనిచేసినప్పటికీ... పిల్లలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో బాలల అకాడమీలో చేరాను. బొమ్మలతోపాటు బాలచంద్రిక పత్రికకు కథలు, కవితలు, గేయాలు రాసేవాడిని. 1986లో వేదకుమార్‌గారితో ఏర్పడ్డ పరిచయం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాలచెలిమి ఒక బ్రోచర్‌తో ప్రారంభించాం. తర్వాత 16 పేజీల పుస్తకాన్ని తయారు చేశాం. ఆ తర్వాత దాన్ని 32 పేజీలకు పెంచాం. బాల భవన్‌లో ఉన్నపుడు... పిల్లల కోసం బాలలే రచనలు చేయడంపై కథలు ఎలా రాయాలో వారికి ప్రయోగాత్మకంగా తర్ఫీదు ఇచ్చాను. ఇంట్లో న్యూనతా భావాన్ని, కుల, మతాల వల్ల జరిగే అంశాంతి, సమాజంలో ఇబ్బందుల గురించి కథలు రాశారు. వర్క్‌షాప్‌లో పిల్లలు రాసిన కథలు చూసి చలించిపోయాను. బాలలు అర్థం చేసుకునే స్థాయికి రచనలు చేయాలా... లేదా మనకు తోచింది మనం రాసి ఇదే బాలసాహిత్యం అనుకోవాలా అన్నది రచయితలు ఆలోచించాలి.
పిల్లల తరగతి, వారి శారీరక-మానసిక పరిస్థితులు, అవగాహనాస్థాయిలను పరిగణలోకి తీసుకుని వారికి జ్ఞానాన్ని పెంచే విధంగా రచనలు సాగాలి. పిల్లలను స్కూలు పుస్తకాలకే పరిమితం చేయకూడదు. బాల సాహిత్యంలో బొమ్మలు కూడా తగ్గట్టుగా ఉండాలి. భావ సౌందర్యం ఉట్టిపడేలా... పిల్లల హృదయాలు స్పందించేలా రచనలు జరగాలి. రేడియోల్లో నాటికలు వచ్చినపుడు మనకు ఊహించుకునే అవకాశం ఉండేది. కానీ టీవీలు స్మార్ట్‌ ఫోన్లు చూసే నేటి తరానికి ఊహించుకునే అవకాశం లేదు. అరేబియన్‌ నైట్స్‌ కథలతో స్ఫూర్తి పొంది పిల్లలకు చాలా తక్కువ మాటల్లో ఎలా కథలు చెప్పవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకున్నా... ఆ క్రమంలోనే 'పిల్లలు బొమ్మలు వేయడం ఎలా' అనే పుస్తకాన్ని రచించాను. పిల్లలకు కథలు రాసినపుడు.. చాలా పరిశోధనలు చేసిన రచనలు చేపట్టాలి.. అప్పుడే ప్రయోజనం ఉంటుంది.
దాసరి శ్రీనివాసులు, రచయిత- రిటైర్డ్‌ ఐఏఎస్‌
పిల్లలు తమను గుర్తించాలని ఆరాటపడతారు. వాళ్లవైపు చూడకపోతే ఏదో అల్లరి చేసి తమవైపు తిప్పుకుంటారు. ఇవన్నీ పిల్లల లక్షణాలు. ఇవి పెద్దవాళ్లలో ఉంటే చైల్డిష్‌ అంటాం. బాలలకు ఉండే ఈ లక్షణాలను కలిపితేనే అది బాలసాహిత్యం అవుతుంది. పిల్లల రచనల్లో అవన్నీ లేకపోతే బాల సాహిత్యం కాదు. బాంబేలో ఒక ఫౌండేషన్‌ వారు దేశావ్యాప్తంగా అన్ని భాషల్లో బాల సాహితీ రచనల పోటీ నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది తెలుగు బాల సాహితీ రచయితలను ఆహ్వానించారు. కథల ఎంపిక జ్యూరీ చైర్మన్‌గా నేను వెళ్లాను. జ్యూరీకి 108 కథలు వచ్చాయి. అందులో 13 ఏళ్ల అమ్మాయి ఒక కథ పంపింది. వచ్చిన ఎంట్రీల్లో ఆ అమ్మాయి అతిపిన్న వయస్కురాలు. వారిలో అతిపెద్ద వయస్కులు 94 ఏళ్ల రచయిత. వారిలో రెడ్డి రాఘవయ్యగారు అనే రచయితకు పురస్కారం లభించింది. ఇక్కడ కూడా అలాంటి కథల పోటీ పెడితే బాగుటుందని నా కోరిక. వైజాగ్‌లో మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న రోజుల్లో... పురాతన లైట్‌ హౌస్‌ వద్ద ఒక పార్క్‌ను అభివృద్ధి చేశాం. నిర్మాణ సమయంలో విదేశాల్లో మాదిరిగా.. స్థానికుల సలహాలు, సూచనలు తీసుకున్నాం. స్థానిక మానసిక వికలాంగుల పాఠశాల పిల్లలను ఆహ్వానించాం. అక్కడి ఒక ద్వారాన్ని శంఖు ఆకారంలో ఏర్పాటు చేశాం. అందులోంచి ఒక పిల్లవాడు అటు ఇటు తిరుగుతున్నాడు. నన్ను చూసిన 14 ఏళ్ల పిల్లవాడు... 'గురువుగారూ శంఖం అద్భుతంగా ఉంది. లోపలికి వస్తూ పోతే బాగుంది. కానీ వీళ్లు చిన్న విషయం మరచిపోయారు. ఇక్కడ శంఖునాదం కూడా ఉంటే బాగుండేది' అన్నాడు. అలాంటి అమూల్యమైన సలహా ఇచ్చిన పిల్లవాడిని మానసిక వికలాంగుడు అనగలమా... వెంటనే శంఖునాదం ఏర్పాటు చేశాం. తెలివి ఒకడి సొత్తుకాదు. మనం నివసిస్తున్న సమాజాన్ని అర్థం చేసుకోవాలి. పిల్లలకు కథలు చెబితే సృజనాత్మకశక్తి రాదు. వారికి ఆలోచనలు కల్పించలేని స్కూళ్లు, టీచర్లు మనకు ఎందుకు..

ఎస్‌.శివరామ ప్రసాద్‌, ప్రముఖ రచయిత ( కలం పేరు వాణిశ్రీ)

సాహిత్యమంతా మదించి పి.హెచ్‌.డి.లు చేస్తే రచయితలు కాలేరు. కొత్త ఆలోచనలతో సృజనాత్మక శక్తి ఉన్నవాళ్లే రచయితలు అవుతారు. తెలుగు బాల సాహిత్యంలో చక్రపాణిని ఆద్యుడుగా చెప్పుకోవచ్చు.. ఆ రోజుల్లో ఒక రూపాయి ఖరీదు చేసే చిన్న నవలలను ముద్రించి అమ్మేవారు. వాటిని మద్రాసులోని నాగిరెడ్డి ప్రెస్‌లో ముద్రించేవారు. అలా వారిద్దరి అనుబంధం ఉండేది. నాగిరెడ్డి బాల అనే పత్రిక నడిపేవారు. అయితే పిల్లల పత్రిక ఇలాకాకుండా... ప్రతి పేజీలోనూ బొమ్మలుంటే వారిని ఆకట్టుకోగలమని చక్రపాణి సలహా ఇచ్చారు. అలా 1947లో చందమామ పత్రిక మొదలైంది. నేను కూడా చందమామ కథలు చదివే రచయిత అయ్యాను.
ఏలూరులో చదువుకునే రోజుల్లో చందమామ కథల ఏజెంట్‌ వచ్చి స్కూల్లో పుస్తకాలు పంచేవారు. ఇప్పటికీ ఆ కథలు గుర్తున్నాయి. కథ చదివాక ఆనందించాలి... లేదా ఆలోచన రావాలి.. అప్పుడే కథలు హత్తుకుంటాయని చక్రపాణి చెప్పేవారు. 1956లో పాఠశాలలో చదివే రోజుల్లో ఒకసారి మంగళగిరి విహారయాత్రకు మమ్మల్ని తీసుకెళ్లారు. దానిపై రాసిన వ్యాసం మా స్కూల్‌ పత్రిక ఉజ్వల భారతిలో అచ్చయింది... అదే నా తొలి రచన. అలా మొదలైన నా ప్రయాణంలో దాదాపు వెయ్యి కథలు రాశాను. 40 ఏళ్లు పైబడినవారే పుస్తకాలు చదువుతున్నారు. యవత చదవడంలేదు... పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం వల్ల తెలుగు పుస్తకాలు చదవడంలేదు. పుస్తకాలను ప్రింట్‌ చేసుకుంటున్నాం... కానీ మార్కెటింగ్‌ చేసుకోవడం ఎలా.. ఎవరూ కొనడంలేదు. అటకలపై దాచిపెట్టుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం కూడా రచయితలను ప్రోత్సహించాలి.
వేదాంత సూరి, బాల సాహితీవేత్త
చిన్నప్పటి నుంచి రేడియో వినే అలవాటు ఉంది. ఒక పత్రిక నడపాలని అప్పట్లోనే అనుకునేవాడిని. మూడేళ్ల వయసులోనే రేడియోలో ఒక పద్యం పాడాను. ఇక ఆ తర్వాత నుంచి కథలు రాయడం మొదలు పెట్టాను. పెద్దయ్యాక... కరీంనగర్‌లో బాలలోకం అనే పత్రికలో చేరాను. ఆ తర్వాత ఉదయం పత్రికలో చేరాను. పిల్లల కోసం ఉదయబాల అని పేజీ పెట్టారు. అక్కడి నుంచి 'మొగ్గ' పేజీ కోసం.. ప్రతిరోజు బాల సాహిత్యం రాశాను. మాస పత్రికలుండే రోజుల్లో ప్రతిరోజు పిల్లల కోసం రాయడం కష్టమైన పనే. అయినప్పటికీ...బాల సాహిత్యానికి ఒక వెలుగు వస్తుందని కష్పపడ్డాను. బాల సాహిత్యం రాసేపుడు... నా మనసు బాల్యంలోకి మారిపోతుంది. అప్పుడే అది సాధ్యమవుతుంది. అలా పదేళ్లపాటు 'మొగ్గ'తో అనుబంధం కొనసాగింది. పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ మొగ్గ కోసం ఆసక్తిగా ఎదురుచూసేవారు. కొన్నేళ్ల తర్వాత బాలల కోసం సొంత పత్రిక 'మొలక' స్థాపించాను. అది నడిపించే పరిస్థితి లేక మరో ఉద్యోగం చూసుకుంటూ నడిపిస్తున్నా. బాల సాహితీవేత్తలకు ప్రభుత్వం చేయూతనిస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి..ముందుగా పెద్దవాళ్లలో మార్పు తీసుకుని రావాలి... అప్పుడు పిల్లల్లో మార్పు కచ్చితంగా వస్తుంది. ప్రస్తుత జనరేషన్‌ తగ్గ కథలు రాసే రచయితలు లేకపోవడం బాధగా అనిపిస్తోంది..
అవార్డుల కోసమే కథలు రాస్తున్నారు... పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఎవరు రాయడం లేదు. మన అభిప్రాయాలను పిల్లలపై రుద్దుతున్నాం... వారి అభిప్రాయాలను తెలుసుకోవడంలేదు. ఆ పరిస్థితి మారాలి...
దేశపతి శ్రీనివాస్‌, రచయిత, తెలంగాణ రాష్ట్ర సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి (ఓ.ఎస్‌.డి)
వేదకుమార్‌గారితో చాలా కాలంగా ఆత్మీయ అనుబంధం ఉంది. మేము ఇద్దరం కలిసి జైబోలో తెలంగాణ సినిమాలో కూడా నటించాం. ఆక్స్‌ఫొర్డ్‌ స్కూల్‌ వేదికగా ఆయన నిరంతరం చర్చలు కొనసాగిస్తున్నారు. అందరం గుమిగూడి ఒకచోట చర్చించుకోవడం మంచి విలువగా భావిస్తా.. ఆలోచనలు ఎప్పుడు కూడా చాలా చిన్న పాయగానే మొదలవుతాయి. నోటి నుంచి వెలువడిన మాట... రాసిన అక్షరం వట్టిగనే పోవు. మనం దళితులు, స్త్రీల గురించి ఆలోచిస్తున్నాం... వాళ్ల మాదిరిగానే పిల్లల ప్రపంచం గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడిక్కడ మాట్లాడిన వక్తలందరూ చిన్నపుడు బాలసాహిత్యం చదివినవాళ్లే. చందమామ, బాలచంద్రిక లాంటి పుస్తకాల్లో చూసిన భేతాళుడు లాంటి బొమ్మలు ఇప్పటికీ మనసుల్లో ముద్రపడిఉన్నాయి. కథలు, పాటల్ని మాత్రమే పిల్లలు ఇష్టపడతారు. బాలసాహిత్యమంటే ఎక్కువగా ఈ రెండే. ఎప్పుడైనా స్కూల్‌ డే ప్రోగ్రామ్స్‌కి వెళ్లినపుడు ఆటల మీద ఉన్న పాటలు పాడే... వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తా..
..... వన్నె వన్నె పురుగు జింగన్న దొరికింది...
అగ్గిపెట్టలో దాచి ఆడుకుంటారంట...
బంతి ఆకును తెచ్చిరీ... దానికి బువ్వాని తినిపిచ్చిరీ...
పుంగిర్లు పూయంగా పూబంతులాడంగా..
ఆటలాడిన పిల్లలూ... వీళ్లు పొడిసేటి నెలపొడుపులూ...
ముక్కు గిల్లే ఆట చక్కని పులిపెర్లు...
చిన్నపుడు మనమంతా ఆడిన ఆటలు ఇంకా గుర్తున్నాయి. ముక్కు గిల్లే ఆటలో పిల్లలను పూలతో పిలుస్తాం. ఇలా పిల్లలను మల్లె పూలతో పిలిచిన పిల్లవాడే.. పెద్దయ్యాక కవి అవుతాడు. పిల్లలు ఆటలు ఆడినపుడే వారిలో పరిశీలనాశక్తి పెరుగుతుంది. ఈ రోజుల్లో విద్య కేవలం మార్కుల కోసం, ధనార్జన కోసం అన్నట్టుగా తయారైంది. విద్య విశాలభావన కోసం లేకపోవడం వల్ల పిల్లలు సంకుచిత భావాల్లో ఉండిపోతున్నారు. నిరాదరణకు గురైన పిల్లలు అసాఘింక శక్తులుగా మారుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కొంతైనా ప్రభావవంతమైన పాత్ర నిర్వహించగలిగానంటే... కొంతైనా బాల సాహిత్యం ప్రభావం కచ్చితంగా ఉంది. అమెరికాలాంటి దేశాల్లోనూ పుస్తకాలు చదవడానికి పిల్లలను ప్రోత్సహిస్తారు. అదే మన స్కూళ్లలో అయితే... చించేస్తారని గ్రంథాలయంలోని పుస్తకాలు పిల్లలకు ఇవ్వరు.
దయ, కరుణ, ప్రేమ, స్నేహం, కలివిడి స్వభావం, సమానత్వ భావన, ధైర్యం, నిజాయితీ లాంటి మౌలిక భావనలు కథల ద్వారా పిల్లలకు కలగాలి. చెడు ఓడిపోతుందన్న విషయం కూడా కథల ద్వారా వారికి అర్థం కావాలి. కనీసం 30 కథలు వచ్చా అని టీచర్లను ఇంటర్వ్యూల్లో అడిగే పరిస్థితి ఉండాలి. టీచర్లకు సబ్జెక్ట్‌ రాకపోయినా.. కనీసం కథలు చెబితే పిల్లలకు విలువలు వస్తాయి. పంచతంత్ర, కథా సరిత్సాగరం, అరేబియన్‌ నైట్స్‌, తెనాలి రామకృష్ణ, అక్బర్‌-బీర్బల్‌ లాంటి కథలు నేడు లేవు. మానవపాత్రలకన్నా... పశు,పక్షాదుల పాత్రల్నే పిల్లలు ఎక్కువ ఇష్టపడతారని పంచతంత్ర కథల ద్వారా తెలుస్తోంది. పిల్లల రచనల్లో వాస్తవికతను ఎక్కువగా ఆలోచించవద్దు. కథల్లో ట్విస్టులు పిల్లలు ఇష్టపడతారు. సింహం-కుందేలు లాంటి కథలు... పిల్లలను ఆస్వాదిస్తారు. ఆ అమాయక కుందేలులో పిల్లలు తమను తాము చూసుకుంటారు. టీవీల్లో డోరేమాన్‌ లాంటివి కాకుండా... దేశీయ సాహిత్యం అందుబాటులోకి రావాలి. యానిమేషన్‌ ఖర్చుతో కూడుకున్నపని... కానీ పుస్తకాలను సులువుగా పిల్లల వద్దకు చేర్చవచ్చు.. బాల సాహిత్యం... మన సంస్కృతిలో భాగంగా మారాలి. విలువలు, తార్కికశక్తి, ఊహాజనిత శక్తులు, శ్రవణశక్తి వంటివి కథలవల్ల పిల్లల్లో పెరుగుతాయి. నేటి తరం పిల్లల్లో ఉన్న అనేక మానసిక రుగ్మతులకు బాలసాహిత్యం ఒకరకమైన ధైర్యాన్ని ఇస్తుంది. మానవుడికి మౌలిక సంవేదనల గురించి చెప్పగలిగింది.. వివరించగలిగింది... వాటినుంచి వారిని కాపాడగలిగింది... అద్భుతమైన సాహిత్యమవుతుంది. అలాంటి సాహిత్యాన్ని పిల్లలకు వారి భాషలో, వారి స్థాయిలో అందించాల్సిన అవసరం ఎంతైన ఉంది...
ద్యావనపల్లి సత్యనారాయణ, చరిత్రకారులు, ట్రైబల్‌ మ్యూజియం క్యూరేటర్‌
మన శరీరంలో ల్యాడ్‌ (లాంగ్వేజ్‌ అక్విజిషన్‌ డివైజ్‌) అనే డివైజ్‌ ఉంటుందని... 20 వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ( లింగ్విస్టిక్‌) భాషావేత్త నోమ్‌ చోమ్‌స్కీ చెప్పాడు. మన శరీరంలో 30 వేల జన్యువులుంటే... తరతరాలుగా మనం మాట్లాడే భాష (తెలుగు)ను కొన్ని జన్యువులు ఆకళింపు చేసుకుని ఉంటాయని ఆయన అన్నాడు. అందుకే మాతృభాషలో ఏది నేర్పించినా అది తొందరగా వస్తుందని నోమ్‌ చోమ్‌స్కీ చెప్పాడు. కాబట్టి రేపటి రోజున ఎలా ఉండాలి విలువలను పిల్లలకు చిన్నప్పటి నుంచే బాలసాహిత్యం ద్వారా నేర్పించాలని అన్నాడు. ప్రపంచంలోని మొట్టమొదటి గ్రంథం రుగ్వేదంలోనూ.. జ్ఞాని సంతోషి అని చెప్పారు. అంటే చిన్పపిల్లలకు జ్ఞానం వచ్చినపుడే సార్థకత ఉంటుంది. వేదాలను అర్థం చేసుకోవడానికి ఆరణ్యకాలు, బ్రాహ్మకాలు, ఉపనిశత్తులు వచ్చాయి. ఉపనిశత్‌ అంటే దగ్గర కూర్చో బెట్టుకుని జ్ఞానం నేర్పడం... అది కూడా పిల్లలను అలరింపజేస్తూ జ్ఞానాన్ని నేర్పాలి.
పంచతంత్రల్లోని మొదటి కథలో.. .ఒక గురువు దక్షిణభారతదేశంలో గోదావరి తీరానా శిష్యులకు నేర్పించాడని ఉంది. గోదావరి మనదగ్గరే ఉందికాబట్టి... బాల సాహిత్యం ఇక్కడే పుట్టిందనే చెప్పవచ్చు. ఈ పంచతంత్రకథలు మన దేవాలయాల శిల్పాల్లోనూ కనిపిస్తాయి.
బాల సాహిత్యం ద్వారానే మన విలువలను, శౌర్యాన్ని. రాజ్యాన్ని, గౌరవాన్ని కాపాడుకోవచ్చని నమ్మిన ఒక గొప్ప స్త్రీ రుద్రమదేవి. తన తదనంతర రాజ్యాధికారాన్ని తన మనమడైన ప్రతాప రుద్రునికి ఇచ్చింది. రుద్రమదేవి స్వయంగా బాలసాహిత్యాన్ని ప్రతాప రుద్రునికి నేర్పించ ేది. రామప్ప దగ్గర కటాక్షిపురంలో ఊర్లో ఈ శిల్పాలు కనిపిస్తాయి. బాల సాహిత్యంవల్ల ప్రతాపరుద్రుడు గొప్ప రాజు అయ్యాడని చెప్పవచ్చు. ఆటలు, పాటల రూపంలో బాల సాహిత్యం ఉంటేనే మంచిది. పిల్లలకు బాలసాహిత్యాన్ని చేర్చడంలో అనేక సమస్యలున్నప్పటికీ... ప్రయత్నం జరుగుతూనే ఉండాలి.
వక్తల ప్రసంగం అయ్యాక, వారు చర్చించిన అనేక విషయాలపై ఎం.వేదకుమార్‌ తన భావాలను పంచుకున్నారు...
ఎం. వేదకుమార్‌, చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీ చైర్మన్‌
రచయితలు మాట్లాడిన కొన్ని విషయాలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టారు. అయితే వీటిలో చాలా విషయాలు ప్రభుత్వానికి తెలిసినవే అయినప్పటికీ... మన కృషి, మన ఆలోచనలతో మనవంతు ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. తెలంగాణ గడ్డపై నుంచి వేల మంది రచయితలు కొన్ని దశాబ్దాలుగా వస్తున్నారు. గడిచిన దశాబ్దంలో చాలా రచనలు వచ్చాయి. చిన్న చిన్న కుగ్రామాల నుంచి యువ రచయితలు వస్తున్నారు. మట్టిమనుషుల... ఆ మట్టి వాసన రచనలు.. తెలంగాణ ఉద్యమానికి అన్వయించి.. తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఎంతోమంది కళాకారులున్నారు. ప్రభుత్వం కూడా వారిని సాంస్కృతిక సారథి ద్వారా ప్రోత్సహిస్తోంది. అయితే మన వక్తలు చెప్పినట్టు... ఎవరూ పట్టించుకోని బాల సాహిత్యాన్ని... ఎవరూ నిరాశ చెందకుండా... సాధ్యమైనంత మంచి సాహిత్యాన్ని తెచ్చే ప్రయత్నం చేద్దాం...
బాల సాహిత్యం - మనం మన ఆలోచనలు అంశంపై జరిగిన బాల చెలిమి ముచ్చట్లలో... రచయిత, సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్‌తోపాటు రచయితలు వాణిశ్రీ, గోగు శ్యామల, దాసరి శ్రీనివాసులు, తిరునగరి వేదాంతసూరి, డాక్టర్‌ నాళ్లేశ్వరం, ఎస్‌.రఘు, డాక్టర్‌ వి.ఆర్‌.శర్మ, సామిడి జగన్‌రెడ్డి చిత్రకారుడు ఆనంద్‌, చరిత్రకారులు ద్యావనపల్లి సత్యనారాయణ, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరితో సహా పలువురు బాల సాహితీ అభిమానులు పాల్గొన్నారు.0 comments:

Post a Comment