బాల చెలిమి, స్కూల్ రేడియోల
ఆధ్వర్యంలో హైదరాబాద్, హిమాయత్ నగర్ లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ లో నిర్వహించిన స్కూల్
రేడియో శిక్షణా కార్యక్రమం 25 జనవరి 2018వ తేదీతో ముగిసింది. ఈ మూడు రోజుల శిక్షణా
కార్యక్రమాలను యునెస్కో కమ్యూనిటీ మీడియా విభాగాధిపతి ప్రొఫెసర్ వినోద్ పావరాల
23వ తేదీన ప్రారంభించారు. ఈ శిక్షణా కార్యక్రమాలలో ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్
తో పాటు ప్రగతి విద్యా నికేతన్ స్కూల్, పీపుల్స్ హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు
పాల్గొన్నారు. శిక్షణా కార్యక్రమాలలో భాగంగా ఈ పాఠశాలల్లో స్కూల్ రేడియో క్లబ్‌లు
ఏర్పాటయ్యాయి.ఈ స్కూల్ రేడియో క్లబ్‌లు సంవత్సరం
పొడవునా రేడియో కార్యక్రమాలను రూపొందిస్తాయి. రేడియోలో ఏయే అంశాలలో మాట్లాడాలనేది
నిర్ణయించటం మొదలు, స్క్రిప్ట్‌లను వ్రాయటం, వ్రాసిన స్ర్కిప్ట్లలో తప్పొప్పులను
సరిదిద్దటం, రేడియో కార్యక్రమాలను రికార్డు చేయటం, ఆడియో ఫైల్స్‌ను ఎడిట్ చేయటం
వంటి పనులన్నిటినీ విద్యార్థులే స్వయంగా చేస్తారు. విద్యార్థులు రూపొందించిన రేడియో
కార్యక్రమాలను స్కూల్ రేడియోలో ప్రతి నెలా ప్రసారం చేయటం జరుగుతుంది.
మూడు రోజుల పాటు జరిగిన
శిక్షణా కార్యక్రమాలలో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రోగ్రామ్ హెడ్ శ్రీ సుమనస్పతి
రెడ్డి, బాల చెలిమి పత్రిక ఛీఫ్ ఎడిటర్ శ్రీ ఎం.వేదకుమార్, ఆక్స్ఫర్డ్ గ్రామర్
స్కూల్ వైస్ ఛైర్పర్సన్ శ్రీమతి ఎం. ప్రార్థన, స్కూల్ రేడియో వ్యవస్థాపకురాలు
శ్రీమతి కాట్రగడ్డ అరుణ, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం న్యూస్ కరస్పాండెంట్
శ్రీమతి లక్ష్మి, పర్యావరణ విద్యా విషయ నిపుణురాలు ఇందిరా ప్రకాశ్, శ్రీ బొల్లిముంత
వెంకట రమణారావు, డాక్టర్ నోరి రాజేశ్వర రావు, స్కూల్ రేడియో శిక్షణా కార్యక్రమాల
డైరెక్టర్ శ్రీ గాలి ఉదయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
 |
ఆన్లైన్ రేడియోతో విద్యార్థులకు వినోదంతో
పాటు విజ్ఞానం |
స్కూల్
రేడియో
ఎందుకు? :
" మీ
పాఠశాలలో వినూత్న
కార్యక్రమాలకు చోటిస్తారా?
మీ
విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తారా?
వారిలో
భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంచేందుకు కాస్తంత
సమయం కేటాయిస్తారా?
అయితే రండి .. మనమంతా
కలిసి మీ పాఠశాలలో స్కూల్
రేడియో క్లబ్‌ను మొదలు పెడదాం"
అంటూ ఓ వినూత్నమైన కార్యక్రమానికి
శ్రీకారం చుట్టింది స్కూల్
రేడియో. యువ భారత్‌గా మారిపోయిన మన దేశంలో బాలలు, యువకుల
శాతం 70 కి పైగానే ఉంది.
కానీ యువత, బాలల సమస్యలను మనం ఎంతగానో
నిర్లక్ష్యం చేస్తున్నాం. వారి ప్రాధాన్యతలేమిటో,
వారేం కోరుకుంటున్నారో మనం తెలుసుకోవటం లేదు. ఈ
పరిస్థితిలో మార్పు తీసుకురావాలంటూ ప్రత్యేకంగా యువత కోసం,
బాలల కోసం ఆన్లైన్ స్కూల్ రేడియోను
ప్రారంభించటం జరిగింది.
ఇప్పటివరకు శ్రోతలుగా,
ప్రేక్షకులుగా మిగిలిపోయిన యువతకే పట్టం కడుతూ,
వారే వక్తలుగా, కార్యక్రమ
నిర్వాహకులుగా. వాళ్లకేం కావాలో వాళ్ళే నిర్ణయించుకునేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను స్కూల్ రేడియో
మొదలు పెట్టింది.
స్కూల్
రేడియో
శిక్షణా
కార్యక్రమాలు
స్కూల్ రేడియో శిక్షణా కార్యక్రమాలలో చెప్పదలిచిన సమాచారాన్ని
ఒక పద్ధతి ప్రకారం
వ్రాయటం, కథలను చెప్పగలగటం,
భావవ్యక్తీకరణ నైపుణ్యాలను పెంచటం,
బహిరంగ సభలు,
సమావేశాలలో ప్రసంగించటం
వంటి విషయాల్లో యువతను సిద్ధం
చేయటంతో పాటు వాయిస్
రికార్డింగ్, ఆడియో ఫైల్స్ ఎడిటింగ్
వంటి సాంకేతిక అంశాలలో విద్యార్థులకు శిక్షణ లభిస్తుంది. టాక్ షోలు, రేడియో
నాటికలు, చర్చా
కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు, పాటలు,
పద్యాలతో పాఠశాల విద్యార్థులు
తామే స్వయంగా రేడియో కార్యక్రమాలను రూపొందించేలా వారికి
చేయూతనిస్తారు. పాఠ్యాంశాలకూ ఈ రేడియో
కార్యక్రమాలలో చోటు వుంటుంది.
నిరక్షరాస్యత, బాల కార్మికులు, పర్యావరణ
పరిరక్షణ, స్వచ్ఛ
భారత్, లింగ వివక్ష వంటి పలు సామాజిక అంశాల
మీద తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా
వ్యక్తం చేసేలా తర్ఫీదు ఇస్తోంది
స్కూల్ రేడియో. శిక్షణా కార్యక్రమాలలో భాగంగా పాఠశాలలో పది మంది సభ్యులతో స్కూల్
రేడియో క్లబ్‌లను
ప్రారంభించటం జరుగుతుంది.
వినోదంతో పాటు విజ్ఞానాన్ని ఇస్తూ
యువతలో సామాజిక
స్ఫూర్తిని నింపే లక్ష్యంతో
స్కూల్ రేడియో క్లబ్‌లను నిర్వహించటం జరుగుతుంది.
ఈ స్కూల్ రేడియో క్లబ్‌లు ప్రతి
నెలా రూపొందించే రేడియో కార్యక్రమాలను స్కూల్ రేడియోలో
ప్రసారం చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమాలను
www.schoolradio.in వెబ్‌సైట్‌ను సందర్శించి వినవచ్చు.
భయం
పోయింది!
"అప్పట్లో నలుగురి ముందు
మాట్లాడటానికే సిగ్గు వేసేది. మైక్ పట్టుకోవాలంటే
చెమటలే పట్టేసేవి. వేదిక మీద నిలబడాల్సి వస్తే వళ్ళంతా
వణికిపోయేది. ఇపుడు వేదికల మీద నిర్భయంగా
మాట్లాడగలుగుతున్నాను" స్కూల్ రేడియో
శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థుల్లో ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్న
అభిప్రాయం ఇది.
స్కూల్
రేడియోతో
వ్యక్తిత్వ
వికాసం
"ఇప్పటికే పిల్లల మీద ఎంతో వత్తిడి వుంటోంది. మళ్ళీ ఇటువంటి
కార్యక్రమాలా" అంటూ ముందు సందేహంగా
చూసిన తల్లిదండ్రులూ ఉపాధ్యాయులూ
"భావ వ్యక్తీకరణ నైపుణ్యాలే
కాదు, వ్యక్తిత్వ వికాసానికి కూడ స్కూల్ రేడియో
ఉపయోగపడుతుందని" ఇపుడు ఒప్పుకుంటున్నారు.
ఆన్లైన్
పాఠాలు
స్కూల్ రేడియోలో ఉపాధ్యాయులు ఇపుడు పాఠాలు కూడ
చెప్పవచ్చు. ఉపాధ్యాయులు తమకు నచ్చిన అంశాలను
ఎంపిక చేసుకొని, తమ పాఠం
ఆడియో ఫైల్‌ను స్కూల్
రేడియోకు పంపవచ్చు.
ప్రత్యేక సమయాలలో ఆన్లైన్
పాఠాలను స్కూల్ రేడియోలో
ప్రసారం చేయటం జరుగుతుంది.
కెరీర్‌కూ
దోహదం
విద్యార్థులు అత్యధిక మార్కులు సాధిస్తూ, ఉన్నత ర్యాంకులను
సాధిస్తున్నప్పటికీ, వారిలో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు మాత్రం
చాలా నిరాశాజనకంగా వుంటున్నాయి. వారిలో
ఆత్మ విశ్వాసం కొరవడటం, నలుగురి
ముందు మాట్లాడేందుకు భయపడటం ఇందుకు
ప్రధాన కారణమవుతోంది.
ఫలితంగా వారు ఉద్యోగాలు సాధించటంలో వెనుకబడుతున్నారు. కనుక వారిలో
కమ్యూనికేషన్ స్కిల్స్ తో
పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడ స్కూల్ రేడియో
కార్యక్రమం ద్వారా పెంపొందించటం జరుగుతుంది.