
పంచతంత్రం కథలు తెలియని వాళ్లంటూ ఉండరు. ఇవి అనేక రూపాలుగా జనాదరణ పొందాయి. ప్రజల నాలుకలలో నిలిచాయి. క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో వీటిని విష్ణు శర్మ చెప్పాడు. పాటలీ పుత్ర రాజు ముగ్గురు కొడుకులను రాజ్య పాలనలో సమర్థులు, విజ్ఞులుగా తయారు చేయటానికి జంతువులతో కూడిన ఈ కథలను విష్ణు శర్మ చెప్పాడు. పంచతంత్రంలో అయిదు భాగాలు ఉన్నాయి. సంస్కృతంలో ఉన్న ఈ కథలను మొదట పరవస్తు చిన్నయ సూరి (1809-1862) 'నీతి చంద్రిక' పేరుతో తెలుగు లోకి అనువదించారు. ఆ తర్వాత ఎందరో వీటిని తిరిగి రాశారు. తరాలు గడిచినా వన్నె తగ్గని ఈ కథలను 'మిత్ర భేదం', 'మిత్ర లాభం' పేరిట రెండు పుస్తకాలను బుజ్జాయి వేసిన బొమ్మలతో పిల్లల పుస్తక ప్రచురణ సంస్థ 'పాల పిట్ట' ప్రచురించింది.
బుజ్జాయి పుస్తకాలలో 'పంచ తంత్రం' కలికితురాయి వంటిది. 1960 లో 'ద ఇలస్ట్రేటెడ్ వీక్లీ'లో ధారావాహికంగా పంచతంత్రం ప్రచురితమైనప్పుడు లక్షలాది పాఠకులను అలరించింది. ఇప్పుడు తెలుగుతో సహా ఇది అనేక భాషలలోకి అనువాదమయ్యింది.
బుజ్జాయిగా పేరు పొందిన దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి ప్రఖ్యాత కవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి కుమారుడు. బుజ్జాయి తన 17 వ ఏటనే 'బానిస పిల్ల' అన్న బొమ్మల పుస్తకం ప్రచురించారు. ఆ విధంగా 'కామిక్ స్ట్రిప్' పుస్తకాలకు భారత దేశంలో ఆద్యుడిగా నిలిచారు. మిత్ర భేదం పుస్తకం వెల 75 రూపాయలు కాగా మిత్ర లాభం పుస్తకం వెల 40 రూపాయలు.