-
డాక్టర్ వెలగా వెంకటప్పయ్య సంపాదకుడుగా వెలువడిన పిల్లల జానపద గేయ సర్వస్వం ఈ పుస్తకం. తెలుగు వారి సంస్కృతి విజయ పరంపరకు నిదర్శనమైన ....
- తెలుగు పిల్లలు పాడుకుని ఆనందించే పండుగ పాటలు, ఆటల పాటలు, ఎగతాళి పాటలు, వినోద గేయాలు
- పిల్లలలో పద సంపదను పెంచే తొక్కు పల్కులు
- అభినయ ప్రధానమై, ఆసక్తి కలిగించే నవ రసాల గేయ కథలు
- సంప్రదాయమైన జోల పాటలు, లాలి పాటలు, ఊయల పాటలు
- తెలుగు పలుకుబడిని పెంచే సామెతలు
- అవగాహనా శక్తిని, చురుకుదనాన్ని పెంచే పొడుపు కథలు
డాక్టర్ వెలగా వెంకటప్పయ్య తెలుగు బాలల రచయితల సంఘ ప్రధాన కార్యదర్శిగా దాదాపు నలభై సంవత్సరాల పాటు సాహితీ లోకానికి సేవలను అందించారు.
పుస్తకం వెల: 130 రూపాయలు.
కాపీలకు :
డాక్టర్ వెలగా వెంకటప్పయ్య
4-22-27, ఐతానగరం
తెనాలి 522 201 -
పంచతంత్రం కథలు తెలియని వాళ్లంటూ ఉండరు. ఇవి అనేక రూపాలుగా జనాదరణ పొందాయి. ప్రజల నాలుకలలో నిలిచాయి. క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో వీటిని విష్ణు శర్మ చెప్పాడు. పాటలీ పుత్ర రాజు ముగ్గురు కొడుకులను రాజ్య పాలనలో సమర్థులు, విజ్ఞులుగా తయారు చేయటానికి జంతువులతో కూడిన ఈ కథలను విష్ణు శర్మ చెప్పాడు. పంచతంత్రంలో అయిదు భాగాలు ఉన్నాయి. సంస్కృతంలో ఉన్న ఈ కథలను మొదట పరవస్తు చిన్నయ సూరి (1809-1862) 'నీతి చంద్రిక' పేరుతో తెలుగు లోకి అనువదించారు. ఆ తర్వాత ఎందరో వీటిని తిరిగి రాశారు. తరాలు గడిచినా వన్నె తగ్గని ఈ కథలను 'మిత్ర భేదం', 'మిత్ర లాభం' పేరిట రెండు పుస్తకాలను బుజ్జాయి వేసిన బొమ్మలతో పిల్లల పుస్తక ప్రచురణ సంస్థ 'పాల పిట్ట' ప్రచురించింది.
బుజ్జాయి పుస్తకాలలో 'పంచ తంత్రం' కలికితురాయి వంటిది. 1960 లో 'ద ఇలస్ట్రేటెడ్ వీక్లీ'లో ధారావాహికంగా పంచతంత్రం ప్రచురితమైనప్పుడు లక్షలాది పాఠకులను అలరించింది. ఇప్పుడు తెలుగుతో సహా ఇది అనేక భాషలలోకి అనువాదమయ్యింది.
బుజ్జాయిగా పేరు పొందిన దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి ప్రఖ్యాత కవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి కుమారుడు. బుజ్జాయి తన 17 వ ఏటనే 'బానిస పిల్ల' అన్న బొమ్మల పుస్తకం ప్రచురించారు. ఆ విధంగా 'కామిక్ స్ట్రిప్' పుస్తకాలకు భారత దేశంలో ఆద్యుడిగా నిలిచారు. మిత్ర భేదం పుస్తకం వెల 75 రూపాయలు కాగా మిత్ర లాభం పుస్తకం వెల 40 రూపాయలు. -
చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ ఎకాడమీ బాలల కోసం ముద్రించిన తొలి పుస్తకం 'చెలిమి కథలు'. చింతామణి గారు రచించిన ఈ కథలు చిన్న తరగతుల లోని బడి పిల్లలకోసం ఉద్దేశించినప్పటికీ, పెద్ద వారికి కూడా ఉపయోగకరమే. నిజం చెప్పాలంటే వీటిని విజ్ఞాన గుళికలని చెప్పాలి. ప్రతి కథ వెనుక ఒక సందేశం, నీతి, సంస్కృతికి సంబంధించిన అంశం ఉన్నాయి. కాని ఈ నీతి బోధ బాహాటంగా ప్రచార ధోరణిలో ఉండదు. చదవటానికి ఆసక్తికరమైన రీతిలో విజ్ఞానానికి వినోదం జోడించి ఈ కథలను వ్రాశారు. మానవతా విలువలను కాపీ బుక్కు వరవడుల్లాగా కొట్టొచ్చినట్లు ప్రదర్శించక, చిన్న పిల్లలు వాళ్లంతట వాళ్లు తెలుసుకొనేలా సున్నితంగా ఈ కథల ద్వారా తెలియజేశారు. దీనినే ఆధునిక విద్యా బోధనా విధానంలో తనంతట తానుగా తెలుసుకొనే పద్ధతి (డిస్కవరీ మెథడ్) అంటారు.
ఈ కథలన్నీ సులభమైన భాషలో రచించి, పిల్లల మనోభావాలను విశ్లేషించి, నేర్పుగా చిత్రీకరించిన రచయిత అభినందనీయులు. వ్యంగ్యమైన విమర్శలతో మనసులను నొప్పించకుండా, ఉన్నత విలువలను ప్రతిపాదించటంలో ఆయన ఎంతో కౌశలం ప్రదర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి రచనలు సాంఘిక, నైతిక ప్రయోజనాలను సాధిస్తాయని నా విశ్వాసం.
-- ఐ.వి. చలపతి రావు
చెలిమి కథలు
రచన : చింతామణి
బొమ్మలు: పాతర్ల లక్ష్మణ్
పేజీలు : 82
వెల:12 రూ.
ప్రతులకు: చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ ఎకాడమీ
'చంద్రం', 3-6-712/2, 11 వ వీధి
హిమాయత్‌నగర్, హైదరాబాద్ 500 029 -
సత్యజిత్ రే బెంగాళీలో వ్రాసిన పుస్తకాన్ని లీలా రే ఆంగ్లం లోకి అనువదించారు. హరిపురుషోత్తమ రావు తెలుగులోకి అనువదించిన ఈ పుస్తకాన్ని 1991 లో బాల సాహితి బుక్ ట్రస్ట్ ప్రచురించింది. కాగా 2009వ సంవత్సరంలో పిల్లల పుస్తక ప్రచురణ సంస్థ 'పాల పిట్ట' ఈ పుస్తకాన్ని ప్రచురించింది. -
గ్రహాంతరజీవనం గురించి ఇప్పటి వరకూ కథలు, నవలల్లోనే చదివాం.. ఇంకో రెండు దశాబ్దాల్లో అది నిజం కానుంది. అంగారకునిపై శాశ్వత మానవ నివాసాలను ఏర్పాటు చేసే దిశగా నాసా కసరత్తు మొదలుపెట్టింది. దీని పేరు 'వందేళ్ల స్టార్‌షిప్'. దీంట్లో భాగంగా తొలిదశలో కొద్దిమంది వ్యోమగాములను అరుణగ్రహంపైకి పంపిస్తారు. వాళ్లు అక్కడే శాశ్వతంగా ఉండి జీవనం గడుపుతారు. స్వయంపోషకత్వం దిశగా అడుగులు వేస్తారు. తమ అవసరాలు తామే తీర్చుకొనే స్థాయికి చేరుకుంటారు. అప్పటివరకూ భూమిపై నుంచి ఆహారం తదితర నిత్యావసరాలను పంపిస్తూ ఉంటారు. వ్యోమగాములను తిరిగి భూమ్మీదకు తీసుకురావటం అన్నది ఆర్థికంగా సాధ్యం కాదని, కాబట్టే వాళ్లు అక్కడే ఉండేలా స్టార్‌షిప్‌నకు రూపకల్పన చేస్తున్నామని ఈ ప్రాజెక్టును చేపట్టిన నాసాకు చెందిన ఏమ్స్ పరిశోధన కేంద్రం డైరక్టర్ పీట్ వార్డెన్ తెలిపారు. స్టార్‌షిప్ ప్రాజెక్టు ప్రస్తుత అంచనా వ్యయం రూ.50వేల కోట్లు. ఆచరణలో మరెన్నో రెట్లు పెరిగే వ్యయం కోసం విరాళాలు స్వీకరిస్తామని వార్డెన్ పేర్కొన్నారు. గూగుల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన లారీపేజ్తో కూడా మాట్లాడానని, ఆయన ఆసక్తి చూపారన్నారు.
నీరు ఉండటం వల్లే..: సౌరకుటుంబంలోని గ్రహాల్లో అంగారకునిపైనే నీరు ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అక్కడ మనిషి స్థిరపడటానికి ఇది అనుకూల అంశం. అయితే, ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు, ఆక్సిజన్ లేని వాతావరణం వంటివి మాత్రం ప్రతికూల అంశాలు. వీటిని అధిగమించాల్సి ఉంటుంది. సింథటిక్ బయాలజీ, మనిషి జన్యుక్రమంలో మార్పులు తీసుకురావటం వంటి ఆధునిక టెక్నాలజీల సాయంతో ఇటువంటి సమస్యలను పరిష్కరించవచ్చని వార్డెన్ పేర్కొన్నారు. వ్యోమగాములు మొదట అంగారకుని ఉపగ్రహాలపై స్థిరపడి.. అక్కడి నుంచి అంగారకుని వివరాలు తెలుసుకోవటానికి విస్తృతమైన పరిశోధనలు జరపాల్సి ఉంటుందన్నారు. 2030 నాటికి మనిషి అంగారకుని చందమామలపైకి వెళ్లటం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. -
మొదటిసారి చూసినపుడు చెట్లన్నీ ఒకేలా కనిపిస్తాయి. కాని కాస్త గమనించి చూస్తే ప్రతిచెట్టుకూ ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వీటిని ఆధారంగా చేసుకొనే ఈ చెట్లనే గుర్తించటం జరుగుతుంది. ఈ లక్షణాలలో కొన్ని చెట్ల బెరడు, ఆకులు కొన్ని చెట్ల బెరడు నున్నగా, మరికొన్ని చెట్ల బెరడు గరుకుగా ఉంటుంది.
ఈ బెరళ్లు లేత రంగులో లేదా ముదురు రంగులో ఉండవచ్చు. అలాగే ఆకులు కూడా రకరకాల పరిమాణాల్లో,రూపాల్లో ఉంటాయి. వీటి గురించి తెలుసుకొనేందుకు, చెట్లతో స్నేహం చేసేందుకు ఒక పద్ధతి ఉంది. అదేమంటే చెట్ల ఆటోగ్రాఫ్ తీసుకోవడమే!
బెరడు ముద్రలు
చెట్టు ఆటోగ్రాఫ్ తీసుకొనేందుకు తెల్లని కాగితాన్ని బెరడుకు దగ్గరగా ఆనించి ఉంచండి. ఒక క్రేయాన్ను తీసుకొని కాగితం మీద రుద్దండి. బెరడులో ఉబ్బెత్తుగా ఉన్న ప్రాంతంలో కాగితం మీద రంగులు పడతాయి. బెరడులో పగుళ్లు ఉన్న ప్రాంతంలో కాగితం మీద తెల్లగానే ఉండిపోతుంది. సాధ్యమైనంత వరకు బెరడు ఏ రంగులో ఉందో అదే రంగు క్రేయాన్ను ఉపయోగించండి. అలా సాధ్యం కానపుడు ముద్ర పక్కనే బెరడు రంగును సూచించండి. ఇలా రకరకాల చెట్ల సంతకాలను సేకరించండి. బెరడుల మధ్య వ్యత్యాసాన్ని పోల్చి చూడండి.
ఆకుల ముద్రలు
ఆకుల ఈనెలు పైకి ఉండేలా ఆకును ఏదైనా నున్నని ఉపరితలంపైన ఉంచండి. ఆకుపైన తెల్లని కాగితాన్ని ఉంచండి. క్రేయాన్‌తో కాగితంపైన రుద్దండి. ఆకు రూపం కాగితం మీద ఏర్పడుతుంది. ఇలా సేకరించిన ఆటోగ్రాఫ్‌తో పాటు ఆ చెట్టు పేరును రాయడం మరచిపోకండి. ఇలా ఒక చెట్టు ఆల్బమ్‌ను తయారు చేయవచ్చు? ఇలా చేస్తే చెట్ల గురించి ఎక్కువగా తెలుసుకొనే అవకాశం అభిస్తుంది. తెలుగులో ఆ చెట్టును ఏమని పిలుస్తారు? అది ఎటువంటి పూలనూ, పళ్లను ఇస్తుంది? దీనిలో ఏ భాగమైనా ఔషధ లక్షణాలను కలిగివుంది? ఈ చెట్టుకు సంబంధించి ఏమైనా పురాణ కథలు కానీ, ప్రత్యేక మైన కథలు కానీ ప్రచారంలో ఉన్నాయా? ఈ సమాచారాన్నంతా సేకరిస్తే చెట్ల సమాచార నిధి మీ సొంతమైనట్లే! -
ఈ భూమి మీది చెట్లుపోతే, వాతావరణం మారిపోతుంది. నీరు పూర్తిగా అదృశ్యమౌతుంది. నేల గట్టిపడిపోతుంది. ఎటుచూసినా ఎడారి వాతావరణం ప్రత్యక్షమౌతుంది. ఈ కథలో జరిగింది ఇదే! అయితే తగిన సమయంలో ఈ విషయాన్ని ప్రజలు గుర్తిస్తే ఏమౌతుంది? చెట్ల విలువను తెలుసుకొని, వాటిని సంరక్షిస్తే ఏం జరుగుతుంది? ఈ కథకు వాస్తవంగా జరిగిన సంఘటనలే ఆధారం. ఆ ప్రాంత ప్రజలు శతాబ్దాలుగా తమ సాంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా ఇప్పటికి పాటిస్తూనే ఉన్నారు.
ఇది అయిదు వందల సంవత్సరాల క్రితం సంగతి. పశ్చిమ భారతదేశంలో భయంకరమైన కరువు వచ్చింది. వానలు పడలేదు. చెట్ల ఎండిపోయాయి. గడ్డి పూర్తిగా మాయమైపోయింది. ఆకలి దప్పులతో జంతువులు చనిపోయాయి. ఆహారాన్ని సంపాందించేందుకు ప్రజలు కెన్నో కష్టనష్టాలు పడవలసి వచ్చింది. మూడు సంవత్సరాల పాటు ఒక్క చుక్క నీరు కూడా నేలకు రాలలేదు. ఒక్క గడ్డి పరక కూడా మొలకెత్తలేదు. కరవు కొనసాగుతూనే ఉంది.
అలా కరవు కోరల్లో చిక్కుకున్న ఒకానొక గ్రామంలో జంబాజీ అనే యువకుడు నివసిస్తూ ఉండేవాడు. ఎండిపోయినా బావులను చూసి అతడి గుండె తరుక్కుపోయింది. తన కుటుంబ సభ్యులు పస్తులు ఉండటం చూసి అతడిలో ఆగ్రహం పెల్లుబిక్కింది. చుట్టూ చూస్తే ఎండి బీటలు వారిన పంట భూములు కనిపించాయి. తన రాత ఎప్పుడూ చెబుతూవుండే పాత కాలపు రోజుల గురించి జంబాజీ ఆలోచించ సాగాడు. అప్పట్లో ఊళ్లన్నీ చెట్లతో నిండి పచ్చగా కళకళలాడుతూ ఉండేవి. నేల సారవంతంగా ఉండి, పంటలు చక్కగా పండేవి. నీటి కొరత అంటే ఏమిటో ఆ కాలంలో ఎవరికీ తెలియదు.
జంబాజీ ఎంతగానో ఆలోచించాడు. ఈ భూమినీ,భూమి మీద జీవులనూ కాపాడుతున్నది చెట్టేనని అతడికి అవగతమైంది. చెట్లే భూమిని కాపాడి, నీళ్లని పరిరక్షించాయన్న వాస్తవం అతడికి బోధపడింది. వానలు పడకపోయినా,నీటి కొరత రాకుండా కాపాడింది చెట్లేనని అతడు తెలుసుకొన్నాడు. ప్రజలు కూడా ఈ వాస్తవాలను గ్రహించకపోతే ముప్పు తప్పదని తలిచాడు జంబాజీ. మనజీవనానికి, పర్యావరణానికి సంబంధం ఉంది. పర్యావరణం ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లు ఉండి తీరాలి.
ఆ యువకుడు తనకు తెలసినా సత్యాన్ని ప్రజలకు తెలియజేయటమే తన జీవిత పరమార్థమని భావించాడు. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని గురించి తెలియజేయటం మొదలు పెట్టాడు.
ఆరోగ్యకరమైన పర్యావరణ కోసం ప్రజలు తమ జీవిన విధానంలో మార్పును తెచ్చుకోవాలని అతడు బోధించనారంభించాడు.
జంబాజీ ఒక ఊరి నుంచి ఒక ఊరికి పయనిస్తే తన సిద్ధాంతాలను వివరించేవాడు. పచ్చని చెట్టును నరకవద్దు. జంతువును కానీ పక్షినీ కానీ చంపవద్దు. మనిషిలానే ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది. కనుక ప్రతి ప్రాణినీ గౌరవించుదాం. ఇవీ ఆయన చెప్పే సూత్రాలు.
ఆ యువకుడు ఇలాంటి 29 సూత్రాలను రూపొందించి ప్రచారం చేయసాగాడు. అనతికాలంలోనే ఆయనకు అనుయాయులు కూడా తయారయ్యారు. వారంతా కలిసి తమను బిషనోయ్లు లేదా 29 సూత్రాల వారుగా ప్రకటించుకొన్నారు. కొంతకాలం గడిచే సరికి ఊళ్లోని ప్రవచించిన 29 సూత్రాల ప్రకారం నడుచుకోవటం ప్రారంభించారు. దాంతో ఆ గ్రామాల్లో జీవన విధానమే మారిపోయింది. గ్రామాలన్నీ పచ్చగా కళకళలాడ సాగాయి. వాతావరణంలోని మార్పుల వల్ల ప్రతికూల ప్రభావాలేవీ ఆ గ్రామాలను చేరకుండా చెట్లు కాపాడుతుండేవి. జంతువులు, పక్షులు, సమస్త ప్రాణుల హాయిగా, సుఖంగా జీవించే సాగాయి.ఇలా దాదాపు మూడు వందల సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ ప్రాంతపు రాజు ఒక పెద్ద రాజసౌధాన్ని కట్టాలని సంకల్పించాడు. ఆ పరిసర ప్రాంతాల గ్రామాల్లో పచ్చని చెట్లు ఉంటాయన్నది అందరికీ తెలుసు. రాజమందిరాన్ని కట్టేందుకు రాజు తన భటులను ఆదేశించాడు. రాజ భటులు గొడ్డళ్లు భుజాన వేసుకొని గ్రామాలకు వచ్చారు. కానీ అవి బిషనోయ్ల గ్రామాలు. తరతరాలుగా ఈ గ్రామాల ప్రజలు పచ్చదనాన్నీ, వన్య ప్రాణులనూ, ఆ నేలనూ కాపాడుకొంటూ వస్తున్నారు. జంబాజీ ప్రవచించిన 29 సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు వాళ్లు. ఎంత గొప్ప రాజైనా సరే వాళ్ల నమ్మకాలలో మార్పు తీసుకు రాలేడు.
రాజభటులు గొడ్డళ్లతో పచ్చారన్న వార్త తెలిసి గ్రామంలో అలజడి చెటరేగింది. ఆ సమయానికి అమృతాదేవి అనే ఆమె చల్ల చిలుకుతోంది. గొడ్డళ్లకు పదును పెట్టుకుంటున్న రాజ భటులను ఆమె చూసింది. వెంటనే ఆమెకు తన చిన్నతనంలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.
జంబాజీ ప్రవచనాలను ఆమె తల్లి పాటిస్తుండేది. చెట్లను ఎలా ప్రేమించాలో అమృతకు నేర్పింది ఆమె తల్లే. ప్రతిరోజూ ఉదయాన్నే ఆమె అన్ని చెట్లకు నమస్కరించి, వాటిలో ఒక చెట్టును ఎంపిక చేసుకొనేది. ఆ చెట్టు చుట్టూ తన రెండు చేతులు వేసి కౌగింలిచుకొని ఆ చెట్టు బెరడుతో గుసగుసగా ఇలా చెప్పేది. '' ఓ చెట్టూ నువ్వు ఎంతో బలమైన దానవి. అంతకంటే ఎంతో అందమైన దానివి. నువ్వు మాకు ఆహారాన్ని అందిస్తావు. మా ప్రాణానికి ఊపిరి నీవు, నీకు మా కృతజ్ఞతలు. నిన్ను కాపాడేందుకు అవసరమైన బలాన్ని మాకు సమకూర్చు.'' అమృతకు తన తల్లి ప్రతి రోజూ ఉదయం చేసే ప్రార్థనలు గుర్తుకువచ్చాయి.
ఊరిలోని ఇతర పిల్లలంతా కూడా తమ తమ ప్రత్యేక చెట్లని ఎంపిక చేసుకుని వాటితో సంభాషించేవారు. తమ సొంత తోబుట్టువులుగా భావించి చెట్లను పాటలుపాడి వినిపించేవారు. అన్ని జంతువులు, పక్షులు వారి కబుర్లు వినేవి. ముఖ్యంగా కృష్ణ జింక బాగా వినేది. ఆ ప్రాణులకు ఊరి వారంటే ఏ మాత్రం భయం వేసేది కాదు. ఎందుకంటే వాటికి ఏ హాని తలపెట్టేవాళ్లు కాదు. వేటాడే వాళ్లు కాదు.
ఇప్పుడు చెట్లు ఎంతో ఆపదలో ఉన్నాయి.
చెట్లు నరికేయబోతున్న వారి దగ్గరకు అమృత పరుగున వెళ్లింది. ''మా చెట్లు నరికేయవద్దు. దయచేసి వాటికి ఏ హాని తలపెట్టవద్దు'' అంటూ అమృత ప్రాధేయపడింది. ''చెట్లు మా తోబట్టువులు. మా ఊరిని రక్షిస్తున్న దేవతలు మా చెట్లు. తాగే నీటికి, ఆహారానికి, మా ప్రాణానికి ఈ చెట్లే ఊపిరి'' అని అమృత వారికి చెప్పింది. వారు ఏ మాత్రం ఆమె చెప్పింది వినకుండా, అక్కడ నుండి వెళ్లిపోమని కేకలు వేయసాగారు. ఓ వృక్షాన్ని కౌగిలించుకుంది అమృత. ''నన్ను నరికివేయండి ముందు. నన్ను చంపి, చెట్టును వదిలేయండి'' అంటూ అమృత రోదించసాగింది.
చెట్లు నరకడానికి వచ్చిన వాళ్లంతా ఆశ్చర్యంగా అమృతను చూడసాగారు. కేవలం తమ యజమాని ఆజ్ఞలను అమలు చేయడమే వారికి తెలుసు. అమృతను పక్కకు లాగి, కిందకి తోసివేసారు. అమృత అంతే వేగంగా లేచి నిలబడి, మళ్లీ చెట్టును కౌగలించుకుంది. గొడ్డళ్లతో అమృత కాలి మడమలపై కొట్టసాగారు. దెబ్బతగిలి,నేలపైన పడింది. గాయాలవుతున్నా లెక్క చేయకుండా చెట్టును అంటి పెట్టుకుని అలానే కూర్చుంది. అమృతని నరికివేస్తేనే చెట్టను నరకాలనే తమ కోరిక నెరవేరుతుందని వారు గ్రహించారు. అమృతను నరికివేశారు. అమృత నేలకొరిగిన కొద్ది క్షణాల్లోనే కొన్ని వందల మంది చిన్నా పెద్దా, ఆడమగా తేడా లేకుండా అడవిలోకి వచ్చి తలోచెట్టును కావలించుకుని నిలబడ్డారు.
రాజభటులు తమ ప్రయత్నాలకు అడ్డువచ్చిన ప్రతి ఒక్కరిని పొట్టన పెట్టుకో సాగారు. వాళ్లు చంపుతున్న కొద్ది వందలు, సంఖ్యలో ఆ ఊరి జనం, చుట్టుపక్కల ఊళ్ళ జనం వచ్చి చెట్లను కావలించుకొంటు, ఒక్క చెట్టు కూడా నేలకు ఒరగకుండా కాపాడారు. అలా చెట్లను కాపాడేందుకు ప్రవాహంలా వస్తున్న ప్రజల్ని చూసి రాజ భటులు ఏమీ చేయలేక వెనుతిరిగారు. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. 363 మంది ప్రాణాలు కోల్పోయారు. చెట్లను కాపాడుకోవడానికి తమ ప్రాణాలు పణంగా పెట్టారు. ఆ ప్రకృతి ప్రేమికులు.
రాజు ఈ వార్తను నమ్మలేకపోయాడు.ఎవరైనా చెట్ల కోసం ప్రాణ త్యాగం చేస్తారా? ఆ విషయం తెలుసుకుందామని స్వయంగా ఆ గ్రామానికి ప్రయాణమయ్యాడు. గ్రామస్థులు చెట్ల కోసం జీవితాలు అర్పించిన తమ సహచరుల కోసం ప్రార్థనలు చేయసాగారు. వారెంతో గర్వంగా ఉన్నా వారి ప్రవర్తన ఎంతో మర్యాదగా ఉంది. తమ జీవితాలు చెట్లపైనే ఆధారపడి ఉన్నాయని తెలుసుకున్నప్పటి నుండి వారికి చెట్లపై ఎంతో ప్రేమ, అవినాభావ సంబంధం ఏర్పడ్డాయని రాజుకు తెలిపారు. చెట్లు మనం లేకున్నా బతకకలవు. కానీ, మనం చెట్లు లేకపోతే ఒక క్షణం కూడా బతకలేము అని చెప్పారు.రాజు వారి మాటలకు ఎంతో కదలిపోయాడు. బిషనోయీలు నివసించే ప్రాంతాల్లో కలప నరకటం, జంతువులను వేటాడడం వంటి వినాశకరం పద్ధతులను నిషేధించి, బిషనోయీల నమ్మకాన్ని రాజ్యంలో అంతా గౌరవించాలని ఆజ్ఞాపించాడు. ఇది జరిగి మూడు వందల సంవత్సరాలైనా, ఇప్పటికి కూడా బిషనోయీలు చెట్లంటే అంతే ప్రేమ చూపుతారు. చుట్టూ ఎడారి ఉన్నా వారి గ్రామాలు ఒయాసిస్సులు. చెట్లకి కొదువలేదు. జంతువులకు ప్రాణభయం లేదు. స్వేచ్ఛగా తమ ఇష్టం వచ్చినట్టు విహరిస్తాయి. ముఖ్యంగా అందమైన కృష్ణజింకలు. బిషనోయీలు ఇప్పటికీ తమ సిద్ధాంతాలను పాటిస్తూ భూమికీ, తమ తోటివారికి జీవితాన్ని ప్రసాదిస్తున్నారు.
-మమతా పాండ్య -
నులి వెచ్చని కిరణాల తాకిడికి అడవి బద్దకంగా వళ్లు విరుచుకొని నిద్ర లేస్తోంది. బంగారు కాంతులు వెదజల్లే సూర్యుడి తొలి కిరణాల కాంతిలో గడ్డి పరకల మీద మంచు బిందువులు వింతగా మెరుస్తున్నాయి. పక్షులు కిలకిలా రావాలు చేస్తూ ఆకాశంలో హాయిగా తిరుగుతున్నాయి. అడవి అంతా ఒక మధురమైన సంగీతం! అడవిలోని చిన్నా,పెద్దా జంతువులన్నీ నిద్ర మత్తు వదిలించుకొని తమ పనులకు సిద్దమౌతున్నాయి. రంగురంగుల సీతాకోక చిలుకలు, తేనెటీగలు, కీటకాలు ఝంకారం చేస్తూ ఎగురుతున్నాయి.
రాత్రిపూట సంచరిస్తూ, నక్కినక్కి దాక్కుంటూ గడిపిన ప్రాణులు విశ్రాంతికి సిద్దమైతున్నాయి. ఈ పచ్చని ప్రపంచంలో అంతా సవ్యంగానే ఉంది.
అంతలో హఠాత్తుగా ఆ నిశ్శబ్ధాన్ని భగ్నం చేస్తూ అరుపులూ, కేకలూ ఆ ప్రాంతమంతా మారుమోగాయి. ఉద్రేకంతో ఊగిపోతూ ఒక మనిషి అక్కడకు వచ్చాడు. అతడి చేతిలో ఒక పెద్ద కర్ర ఉంది. అతడు ఎవరి కోసమో వెతుకుతున్నాడు. చెట్ల దగ్గర ఖాళీ ప్రదేశంలోకి వచ్చి అతడిలా అన్నాడు.
ఈ పచ్చడి అడవికి వేటకు వచ్చాను
చిరుతను కొట్టి చంపేందుకు ఈ కర్రను తెచ్చాను
నా మేకలు రెండిటిని చంపి తిన్నదది
ఆ చిరుత పని పడతాను, ఎక్కడున్నదది?
ఆ మనిషిని ఎన్నో కళ్లు గమనిస్తున్నాయి. కాని అతడికి కనిపించింది
మాత్రం పెద్ద, పొడవాటి తోకల కొండముచ్చుల గుంపు
మాత్రమే. చక్కగా చెట్టు కొమ్మలో కూర్చుని ఆకులూ, పళ్లూ
తింటున్నాయవి. అవి అలా తింటూనే ఆ మనిషి వంక ఆసక్తిగా
చూడసాగాయి. అతడు వాటిని చూసి ఇలా అన్నాడు-
ఎత్తయిన చెట్లమీద వున్న ఓ కోతుల్లారా!
చిరుత వస్తున్నపుడు నాకు కాస్త చెప్పరా
కొండముచ్చులు తోకలూపుకుంటూ కుతూహలంతో అతడి మాటలు విన్నాయి.
చిరుత పులి కోసం అన్వేషిస్తున్న వ్యక్తి!..... అది తమకూ లాభదాయకమే! ఆ ఆలోచన వచ్చిందే తడవుగా
ఓ యువ కొండముచ్చు ఇలా అంది......
మమ్ము పట్టి తినే చిరుత మా శత్రువు
మరి దాన్ని పడితే నీవు మా మిత్రువు!
ఆ కొండముచ్చు మాటలను బల పరుస్తూ జుట్టు తెల్లబడిపోయిన ఒక పెద్ద ఇలా అంది-
పొడవు తోకల మాజాతికి ఒకటే వణుకు
సింహం కన్నా చిరుత అంటే మాకు మహా బెదరు
అందనంత ఎత్తులో, కొమ్మల అంచుల్లో
మేము దాగి, దుమికినా, సులభంగా పట్టి తినేస్తాడు
తమందరికీ శత్రువైన చిరుతను చంపేస్తానని మనిషి అనడంతో కొండముచ్చుల గుంపు ఆనందం పట్టలేక గంతు లేయటం ప్రారంభించాయి. వాటి తాకిడికిచెట్లు ఊగి పోసాగాయి. ఆకులు అల్లల్లాడి పోసాగాయి.ఇదంతా చూసి ఒక వేప చెట్టు అన్ని మొక్కలూ, చెట్లను చూస్తూ ఇలా అంది.
అడవికి ప్రాణం పోసేది మనం
ఎందరికో ఇల్లూ, ఆహారం ఇచ్చేది మనం
నా లేలేత ఆకులే కదా కొండముచ్చుకు విందు భోజనం
కొండముచ్చు లెక్కువైతే నేను బోసి పోనా?
చిరుతే లేకపోతే నేను చిక్కిపోనా?
దాంతో వాదనలు ప్రారంభమయ్యాయి. అంతలో పొదల మధ్య నుంచి బుసలు శబ్దం వినిపించింది. నల్లటి,
పొడవైన పాము ఒకటి గడ్డి దుబ్బుల్లో నుంచి ముందుకు వచ్చింది. ఆ పాము మాట్లాడటం
మొదలు పెట్టగానే ఆ ప్రాంతమంతా తాత్కాలికంగా నిశ్శబ్ధం ఆవరించింది
పాము ఇలా అంది.
నాకు తెలుసు చిరుతంటే అందరికీ భయం
అయినా చిరుత క్షేమమే నాకు నయం
మా శత్రువైన నెమలికి చేస్తుంది అపకారం
అలా నా జాతికి చేస్తుంది ఉపకారం
దీనితో అంతటా గందరగోళం చెలరేగింది. ఎవరికివారు తమకుతోచిన వాదనలు చేయసాగారు. వాళ్ల వాద ప్రతివాదనలతో అడవి మారుమ్రోగిపోయింది.
ఇంతకి దోషి ఎవరూ? ఈ గొడవ అంతటికీ కారణం ఏమిటి?
ఇంతలో చెట్టు పై కొమ్మల్లో నుంచి చిన్నగా గుర్రు పెట్టిన శబ్దం వినిపించింది. నిద్ర కళ్లను నులుముకొంటూ చిరుతపులి గట్టిగా గర్జిస్తూ ఇలా అంది-
భలే ఉన్నాయి మీ వాదనలు!
అవుననీ-కాదనీ రకరకాల దృక్పథాలు
నేనెలా జీవించాలని ఉందో అలాగే జీవిస్తాను
మరినేను చేసే దానిలో తప్పు ఉందంటే నేనొప్పుకోను
చిరుతే స్వయంగా మాట్లాడటంతో ఆ ఆరోపణలు చేసినవారంతా మిన్నకుండిపోయారు. ప్రతి ఒక్కరూ
తమ వాదనే సబబు అని అనుకోసాగారు. ఎదుటి వాళ్లదే తప్పంతా అనుకొంటూ తమను తాము సమర్థించుకొన్నారు.
హఠాత్తుగా గాలి అంతా ఘీంకార శబ్ధంతో మారుమ్రోగింది. అక్కడ ఏనుగు ప్రత్యక్షమైంది. అంతమంది అక్కడ గుమిగూడి వుండటాన్ని చూసి ఏనుగు ఆశ్చర్యపోయింది. కానీ అక్కడ చేరిన ప్రాణులన్నీ ఏనుగును చూసి ఆనందంగా నిట్టూర్చాయి. మొత్తానికి వారికి ఒక మధ్యవర్తి దొరికింది. చిరుతా, అన్ని జంతువులూ కలిసి ఇలా అన్నాయి-
అంతం లేకుండా వాదించుకొంటున్నాం
అది ఇదా తేల్చుకోలేకున్నాం
ఎవరు ఒప్పు, ఎవరు తప్పు
నువ్వు కాస్త తేల్చి చెప్పు
తొండాన్ని పైకి ఎత్తి పట్టి చెవులు రిక్కించి ఏనుగు వాళ్లు చెప్పేదంతా శ్రద్ధగా వింది. జంతువులన్నీ
నిశ్శబ్ధాన్ని పాటిస్తూ ఏనుగు ఇచ్చే తీర్పు కోసం ఎదురు చూడసాగాయి.
తరతరాల అనుభవసారాన్నంతా రంగరించి, ఏనుగు గంభీరంగా ఇలా పేర్కొంది.
జీవతమనే జాలంలో దారాలం మనం
ఒకరికి ఒకరం అందరికీ అవసరం,
ప్రకృతి ఒడిలో అందరం సమానం,
ఒకటే ఒక్క నియమం-ఐకమత్యమే బలం
ఆ తెలివైన ఏనుగు స్పష్టంగా అలా చెప్పింది. ఇపుడు మీరు చెప్పండి -ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో!
చూడటానికి అడవులన్నీ ఒకేలా కనిపిస్తాయి. కానీ ప్రతి అడవిలోనూ వేర్వేరు రకాల మొక్కలూ, జంతువులూ ఉంటాయి. అటవీ వ్యవస్థలో ప్రతి మొక్కా, జంతువూ తమదైన ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఏదైనా ఒక మొక్కకు కానీ, జంతువుకు కానీ ఏమైనా జరిగితే, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాని ప్రభావం మరెన్నో ప్రాణులపై ఉంటుంది. ఎందుకూ పనికిరావని భావించే కొన్ని ప్రాణులు ప్రకృతిలో ఇతర జీవులతో ఎటువంటి సంబంధాలను కలిగివున్నాయో ఈ కథ తెలియజేస్తుంది. -
వాతావరణ మార్పులు భూమ్మీదే కాదు.. అంతరిక్షంలోనూ ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. విశ్వ ఆవిర్భావానికి కారణమని భావిస్తున్న మహావిస్ఫోటనం (బిగ్‌బ్యాంగ్) తర్వాత కాలంలో అంతరిక్ష వాతావరణంలోని ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు సంభవించాయని చెబుతున్నారు. బిగ్‌బ్యాంగ్ అనంతరం 100 కోట్ల ఏళ్ల తర్వాత రోదసిలోని వాయువుల ఉష్ణోగ్రత ఎనిమిదివేల డిగ్రీల సెల్సియస్ ఉండేదని, 350 కోట్ల ఏళ్ల తర్వాత ఇది 12వేల డిగ్రీల సెల్సియస్‌కు పెరిగిందని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు గుర్తించారు. మహావిస్ఫోటనం తర్వాత అనేక కొత్త నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని.. వాటికి కేంద్రంగా ఉండే క్వాజర్లనే కృష్ణబిలాల నుంచి అతినీలలోహిత కిరణాలు పెద్ద ఎత్తున విడుదల కావటం వల్లనే ఉష్ణోగ్రతలు పెరిగి ఉంటాయని ముఖ్య శాస్త్రవేత్త జార్జ్బెకర్ తెలిపారు.
-
శబ్ద కాలుష్యాన్ని పర్యవేక్షించే విస్తృత నెట్వర్క్ దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దీనిని ఏర్పాటు చేయనుంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లోని జనసమ్మర్ధం ఉండే ప్రాంతాల్లో పరిసర శబ్ద స్థాయిలను నియంత్రించేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 160 శబ్ద నియంత్రణ కేంద్రాలను నిర్మిస్తారు. దేశంలో ఏ ప్రాంతంలో శబ్ద కాలుష్యం స్థాయిలు ఏవిధంగా ఉన్నాయన్న వాస్తవ కాల సమాచారాన్ని ఈ ప్రత్యేక వ్యవస్థ అందిస్తుంది.