-
బాలల్లో రచనా నైపుణ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. బాలసాహిత్యం - నా అనుభవాలు - సూచనలు అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో నిర్వహించిన 'బాలచెలిమి ముచ్చట్లు' 9వ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలల్లో ఊహా శక్తిని పెంపొందించేందుకు అవసరమైన తోడ్పాటు కుటుంబంతో పాటు విద్యాలయాల నుండి చిన్న నాడే లభిస్తే మంచి ప్రేరణను పొందుతారని చెప్పారు. బాల్యాన్ని అద్భుతంగా మలచడానికి మంచి బాలల రచనలు రావాల్సిన అవసరం ఉందని ఆ కృషి ఇంకా పెంపొందాలని తెలిపారు. జీవితంలో ఎదిగే దశల్ని చూపే బాలల రచనలకు ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. సహజసిద్ధమైన సామాజిక వాతావరణాన్ని బాలలకు రచనల ద్వారా పరిచయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. నిరంతర ఆలోచనల నుండి సృజనాత్మక శక్తితో స్ఫూర్తినిచ్చే రచనలు క్రియాశీలకంగా బాలల విషయంలో మారుతాయని తెలిపారు. బాహ్య, అంతర ఆలోచనలను ప్రభావితం చేసిన ఎన్నో బాలల రచనలు ఇప్పటికీ గొప్పగా మిగిలిపోయాయని ఆయన గుర్తు చేశారు. పేదరాసి పెద్దమ్మ వంటి కథలు ఎంతో ఆసక్తిని బాలలలో కలిగిస్తాయని తెలిపారు.
ప్రముఖ రచయిత డాక్టర్ నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ బాల్యంలో ఆసక్తిని కలిగించే అంశాలతో సృజనాత్మకంగా రూపొందించిన కథలను అందించడం ద్వారా గొప్ప ఫలితం ఉంటుందని చెప్పారు. బాల్యాన్ని అందమైన భవిష్యత్తుగా మలుచుకోవడానికి వీలు కల్పించే రచనలను రచయితలు అందించాలని అన్నారు. ప్రముఖ రచయిత ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ బాలలు చదివి అందరితో చెప్పుకుని ఆనందించే రీతిలో సులభమైన పదాలతో, అందమైన శైలితో రచనలు ఉండాలని తెలిపారు. బాలలలో ఉన్న సృజనను వెతికితే గొప్ప రచనలను వారే స్వయంగా చెయ్యగల్గుతారన్న విషయం నిరూపణ అయ్యిందని అంటూ తాను చేసిన బాలల రచనల అనుభవాలను వివరించారు. స్ఫూర్తి డైరెక్టర్ కుమారి పద్మిని రంగరాజన్ మాట్లాడుతూ బాలలతో సంభాషించి వారికి విషయాన్ని సులభంగా అందించగల్గడం ఎంతో అవసరమని చెప్పారు. రచయితలు బాలల అభిరుచులను గమనించి తమ రచనలను అందించాలని సూచించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ వేదకుమార్ మణికొండ మాట్లాడుతూ బాల సాహిత్య రంగంలో నిష్ణాతులైన ప్రముఖులను ఆహ్వానించి ప్రతి నెలా ఉపయోగకరమైన అంశంపై నిర్వహిస్తున్న సదస్సులో అనేక ప్రయోజనాత్మకమైన అంశాలు వెలువడుతున్నాయని తెలిపారు.
బాలల సంపూర్ణ వికాసమే లక్ష్యంగా బాలచెలిమి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ఎస్.రఘు, జుగాష్‌విలీ, తిరునగరి శ్రీనివాస్, వేలాద్రి, తిరుమల శ్రీనివాస్, గొల్లపల్లి సిద్ధార్థ, అలువాల సురేష్, చిదంబరం, రాజ్‌కుమార్, జ్యోతి, కృష్ణకుమారి, రజిత, వాసవి, షేక్ మౌసిన్, కె. ప్రభాకర్, కో-ఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ గోపీ దేశాయ్ దర్శకత్వం హించిన 'ముజ్షే దోస్తీ కరేగే' హిందీ షార్ట్ ఫిల్మ్‌ను ఈ సందర్భంగా ప్రదర్శించారు. సన్నిహిత ఉమెన్ - గర్ల్ సొసైటీ పాఠశాల విద్యార్థులు బాలల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
-
బాలలు ఉన్నతంగా ఎదిగే స్థితిని కల్పించే రచనలను రచయితలు అందించాలని కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత డాక్టర్ ఎం భూపాల్‌రెడ్డి అన్నారు. బాలసాహిత్యం - నా అనుభవాలు - సూచనలు అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో నిర్వహించిన 'బాలచెలిమి ముచ్చట్లు' 8వ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలల భావాలను గ్రహించి వారి మనస్తత్వాన్ని గమనించి నడవడికను తీర్చిదిద్దేలాగా రచనలు ఉంటే బాగుంటుందని చెప్పారు. ఆడుతూ పాడుతూ కథల్లా సాగిపోయే ఆనందమయమైన రచనాశైలిని రచయితలు అవలంబిస్తే బాలలకు ఎంతో ఇష్టంగా సాహిత్యం చేరువవుతుందని అన్నారు. పాటలు, పొడుపు కథలు, సామెతలు వంటి అంశాలలో ఆసక్తికరంగా రచనలను మలచాలని చెప్పారు. తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు చెప్పే కథల్ని కూడా రచయితలు సేకరించి తమదైన బాణీలో అందించగలిగితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు.
ప్రముఖ రచయిత, చరిత్ర పరిశోధకులు డాక్టర్ కావూరి శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎదుగుతున్న పిల్లలను స్నేహితులుగా భావించాలని అన్నారు. ఆప్యాయతను అందించగల్గిన వాతావరణాన్ని సాహిత్యంలో రచయితలు ప్రతిబింబింపజేయాలని చెప్పారు. ఊహా శక్తిని పెంపొందించే విధంగా రచయితల కథా సృష్టి బాలల కోసం ఉండాలని అన్నారు. ప్రముఖ బాలల రచయిత బమ్మిడి జగదీశ్వర్‌రావు మాట్లాడుతూ బాలలు సహజంగా ఎదిగే రీతిలో స్వచ్ఛతను పెంపొందింపజేసే కథాంశాలను ఎన్నుకొని రచనలు చేయాలని చెప్పారు. సామాజికవేత్త గరిపల్లి అశోక్ మాట్లాడుతూ అంతరించిపోకుండా కథల్ని పిల్లలకు పెద్దలు వారసత్వ సంపదగా అందించాలని అన్నారు.
పాత్రికేయురాలు ఉషా తురగా రేవల్లి మాట్లాడుతూ పాఠం విన్నంత సులభంగా బాలలకోసం రచనలను చేయడానికి రచయితలు సిద్ధపడాలని చెప్పారు. మలుపులు తిరిగే రీతుల్లో కథల్ని అందించినప్పటికీ బాలల కోసం స్పష్టత ఎంతో ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ వేదకుమార్ మణికొండ మాట్లాడుతూ బాల సాహిత్య రంగంలో నిష్ణాతులైన ప్రముఖులను ఆహ్వానించి ప్రతి నెలా ఉపయోగకరమైన అంశంపై నిర్వహిస్తున్న సదస్సులో అనేక ప్రయోజనాత్మకమైన అంశాలు వెలువడుతున్నాయని తెలిపారు. బాల చెలిమి ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ రూపాలలో సొసైటీ ద్వారా అందించేందుకు సంసిద్ధమయ్యామని అన్నారు. బాలల సంపూర్ణ వికాసమే లక్ష్యంగా బాలచెలిమి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.
-
వేద కుమార్ మణికొండ సంపాదకత్వంలో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ ప్రచురించిన అంతరిక్ష దొంగలు కథా సంపుటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
గాడిద తెలివి ....
వేద కుమార్ మణికొండ సంపాదకత్వంలో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ ప్రచురించిన 'గాడిద తెలివి' కథా సంపుటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
పిల్లల కోసం పెద్దవాళ్లు రచనలు చేసినా... పిల్లల కోసం పిల్లలే రచనలు
చేసినా... వాటిని చదివినపుడు బాలలు సరికొత్త ఊహాప్రపంచంలోకి వెళ్లగలగాలి.
అలాంటి రచనలే పిల్లల్లో సృజనాత్మకతను, ఊహాశక్తిని పెంచుతాయని...
సెప్టెంబర్ 8న హిమాయత్‌నగర్‌లోని ఆక్స్‌ఫొర్డ్ గ్రామర్ స్కూల్లో జరిగిన
6వ 'బాలచెలిమి ముచ్చట్లు' కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు. ప్రతినెల
రెండోశనివారం నిర్వహించే బాలచెలిమి ముచ్చట్లలో ఈ సారి
'బాలసాహిత్యం-ముందడుగు' అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది.
చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆ సంస్థ చైర్మన్ ఎం.వేదకుమార్ అధ్యక్షత వహించారు. బాలసాహిత్య రంగంలో నిష్ణాతులైన ప్రముఖులను ఆహ్వానించి ప్రతినెలా ఉపయోగకరమైన చర్చలను నిర్వహిస్తున్నట్టు వేదకుమార్ తెలిపారు.
ఎం. వేదకుమార్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ చైర్మన్
చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ గత నాలుగు దశాబ్దాలుగా పిల్లల చదువు, వారి సృజనాత్మకత గురించి ఆలోచిస్తూ పనిచేస్తోంది. 1986-87 ప్రాంతంలో పిల్లల పుస్తకాలపై రెండేళ్లపాటు పరిశోధనలు చేశాం. ఇతర దేశాల్లో పిల్లల పుస్తకాలు, వాటి భాష ఎలా వస్తున్నాయో పరిశీలించాం. మనదేశంలోనూ అనేక భాషల్లో పిల్లల పుస్తకాలపై కూడా పరిశోధన చేయడం జరిగింది. తెలుగులో ఎలాంటి పత్రికలు వస్తున్నాయి. .. ..ఎలాంటి రచయితలున్నారు.. వారి రచనలు ఎలా ఉన్నాయి... రష్యన్, ఫోక్, చైనీస్ పౌరాణికాలు... ఇలా రకరకాలు చక్కటి ప్రచురణలు వస్తున్న క్రమంలో... ఈ దేశంలో కూడా బెంగాలీ గానీ, హిందీ గానీ... 80వ దశకంలోని సమకాలీన రచనలపై పరిశోధనలు చేశాం. అప్పట్లో దేశంలో వెలువడే 18 పత్రికలు ప్రతినెల తెప్పించేవాళ్లం. భాష తెలియనప్పటికీ... పుస్తకం సైజ్, పత్రిక ఫార్మాట్, ఇల్లస్ట్రేషన్స్, కథల సైజ్ ఎలా ఉంది, సైన్స్, కవితలు, పర్యావరణం వంటి అన్ని విషయాలకు ఎంతటి ప్రాముఖ్యతను ఆ పత్రికలు ఇచ్చేవో పరిశీలించాం. రచనలు ఎలా ఉండాలి, పిల్లలకు అసలు ఏం చెప్పాలి... ఏది చెప్పొద్దు... అలా అనేక వర్క్ షాప్‌లు నిర్వహించి... అవగాహనకు వచ్చాక.. అందుబాటులో ఉన్న మంచి రచయితలతో, ఇల్లస్ట్రేటర్స్తో స్టడీ చేసి... అక్షరాల స్ట్రోక్స్ ఎలా ఉండాలనేదానిపై కూడా చర్చలు జరిపాం. అనేక వర్క్‌షాప్‌లు నిర్వహించి 1990 ఆక్టోబర్‌లో 'బాల చెలిమి' పత్రికను తీసుకొచ్చాం. 1991లో అనివార్యకారణాల వల్ల తేలేకపోయాం. ఆ తర్వాత.. కొన్ని సంవత్సరాలపాటు 16 పేజీలు, 8 పేజీలు, 4 పేజీలు కూడా నిర్వహించాం. వెబ్సైట్లు మొదలయ్యాక... బాలచెలిమి వెబ్ ప్రారంభించాం. ఆ రచనలన్ని... 'షషష.పaశ్రీaషష్ట్రవశ్రీఱఎఱ.షశీఎ' వెబ్సైట్లో ఇప్పటికీ చూడవచ్చు.. 2017లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు.. బాల చెలిమిని మళ్లీ తేవడానికి ఉత్సాహాన్ని ఇచ్చాయి. ప్రపంచ తెలుగు మహాసభల్లో 'బాల సాహిత్యం'పై కూడా చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఆహ్వానం అందడంతో నేను కూడా అందులో పాల్గొన్నాను. తెలుగు మహాసభల్లో బాల సాహిత్యంపై చర్చ జరగడం కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ వేదికపైనే మళ్లీ బాల చెలిమిని తీసుకొద్దామని... పిల్లలకు మంచి రచనలు అందిస్తామని తెలపడం జరిగింది. ముఖ్యంగా ఇంగ్లిష్‌లో తెస్తే ఎన్నడూ ఫెయిల్ కాం.. పదివేల కాపీలైనా మాలాంటి చిన్న సంస్థ ద్వారా వాటిని మార్కెట్ చేయవచ్చు. కానీ తెలుగులో అది కష్టమవుతుంది. ఎంతో పెద్ద నెట్వర్క్ ఉంటే తప్ప వెయ్యి కాపీలు కూడా తెలుగు పత్రిక సర్క్యులేట్ చేయలేం. అయితే ఇంగ్లిష్‌లో ఇప్పటికే చాలా విరివిగా బాల రచనలు వస్తున్నాయి... అందుకే తెలుగును ఇష్టపడేవారిగా.. మరియు గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళే పిల్లలకు అందివ్వాలన్నది ఉద్దేశం. వారికి మంచి రచనలు ఇవ్వగలిగితే... కొత్త ప్రపంచాన్ని వాళ్లు చూడగలుగుతారు. అలా మంచి బాల సాహిత్యం అందించాలన్న లక్ష్యంతోనే బాల సాహిత్యంలో పనిచేసే వారురు మరియు చయితలను ఆహ్వానించింది. గత 6 నెలలుగా చర్చలు నిర్వహిస్తున్నాం... అ క్రమంలోనే ' బాలసాహిత్యం - ముందడుగు' అంశంపై చర్చ నిర్వహిస్తున్నాం. పిల్లలకు రాసే వాళ్లనే కాకుండా..., పెద్దలకు రచనలు చేసే నిష్ణాతులు, సైంటిస్టులు, ఆర్టిస్టులు, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీతలు , ... ఇలా అందరి నుంచి పిల్లల రచనలు ఎలా ఉండాలనేదానిపై... అభిప్రాయాలు, ఆలోచనలు తీసుకోవడం కొనసాగుతున్నది.
రేడియో కార్యక్రమాల ద్వారా సైన్స్ మావయ్యగా అందరికీ సుపరిచితులు, రచయిత కె.బి.గోపాలం... బాలల రచనలపై తన మనోభావాలను వేదికపై పంచుకున్నారు. ప్రత్యేకంగా బాలసాహిత్యమంటూ లేదని చెప్పారు. పిల్లలకు అందించే ప్రతి రచనా బాలసాహిత్యమే అన్నారు.
నందిని సిధా రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్
సాహిత్యమనేది ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని... మొత్తం మనుషుల కోసం.. సమాజం కోసం.. మనసౌలభ్యం కోసం అంటూ... నిబంధనలు పెట్టుకుంటాం. స్త్రీల సాహిత్యం అంటే పురుషులు చదవకూడదని ఎక్కడా లేదు. స్త్రీల సాహిత్యాన్ని చదవాల్సింది పురుషులే. బాలల్ని ఎలా పెంచాలో తెలియాలంటే...పెద్దలు కచ్చితంగా బాల సాహిత్యం చదవాలి. కథలు విన్నపుడు పిల్లలతోపాటు పెద్దలు కూడా సంతోషపడకుండా ఉండలేరు. పెద్దవాళ్లలోనూ బాలహృదయం ఉంటుంది. ఈ రోజున్న సాంకేతిక పరిజ్ఞానం బాలల్ని చాలా దూరం తీసుకెళుతోంది. పుస్తకాలు చదవాలా వద్దా...సాంకేతిక పరిజ్ఞానమే వాడాల్నా... అనే చర్చ జరుగుతోంది. బాలల సాహిత్యం విడిగా ఉంటుందా... ఉండదా అన్నపుడు... బాలల స్థాయికి తగ్గట్టు చిన్నపుడు అభిరుచులు ఉంటాయి. వాళ్ల అభిరుచులకు అనుగుణంగా బాల సాహిత్యాన్ని రాయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనం సాంకేతికపరికరాలు వాడినా.. గత కాలం నుంచి ఇప్పటి వరకు వచ్చిన పుస్తకాల రూపంలో వెళ్లినా.. మంచి బొమ్మలు, ఆకర్షణీయంగా కథలు వంటివన్నీ... బాలల్ని చేరుకునే ప్రయత్నాలే. వాళ్లను చేరుకోలేనపుడు, బాలలు రాసినాకూడా... అది బాల సాహిత్యం కాదు. పిల్లలకు కథలు వెళ్లినంత సులువుగా సంప్రదాయాలు, పద్యాలు వెళ్లలేకపోవచ్చు. కథల తర్వాతి స్థానంలో గేయాలు, పాటలుంటాయి. అయితే... పాటలు అర్థంకాక... పిల్లలను పెద్దగా ఆకర్షించవు. రెండేళ్ల పిల్లల చేతిలో ఫోన్లు పెట్టి పాటలు వినిపిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో... అందులోపాటలకంటే... శబ్దం బాగా ఆకర్షిస్తుంది. నేను పదోతరగతి వచ్చాకే పుస్తకాలకు రచయితలు ఉంటారని తెలిసింది. 6, 7 తరగతుల్లో మా పంచాయితీ లైబ్రరీలో ఉన్న వందల పుస్తకాలు చదివాను కానీ రచయితల పేర్లు ఉంటాయని తెలియదు.
ఉదాహరణకు సైన్స్ కథలు కె.బి.గోపాలం రాస్తే చదువుతాం... అదే మరొకరు రాస్తే చూడం. స్వచ్ఛమైన బాల రుచి ఎలా ఉంటుందంటే... కేవలం కథల్ని మాత్రమే గుర్తుంచుకునే వయసు అది. బాలల స్థాయి ఉండే అభిరుచులకు, యువత స్థాయిలో అభిరుచులకు, పరిణతి చెందిన స్థాయి అభిరుచులకు తేడా ఉంటుంది. బాలల రచనలు చేయాలంటే... వారిస్థాయికి దిగి... వారి మనోభావాలు, అభిరుచులు తెలసుకుని రాయాలి. నేను స్కూళ్లకు వెళ్లినపుడు అలంకారాల గురించి చెప్పాను... కథలు చెప్పినపుడు మాతమ్రే వారికి చేరుతుంది. బాలలు మన పాఠకులు అయినపుడు మనం రాసే భాష మారుతుంది. పండితులు పాఠకులు అయినపుడు రాసే భాష... బాలలు పాఠకులు అయినపుడు రాసే భాష ఒకటి కాదు.
సాంకేతిపరికరాల వల్ల పిల్లల ఉహాశక్తి, కాల్పనిక శక్తి తగ్గుతోందన్నది నిజం. పిల్లలు చిన్న వస్తువుల్లో తమ కాలక్షేపాన్ని వినోదాన్ని వెతుక్కోవడం మొదలైందో... వారి ఊహాశక్తి పెరిగే అవకాశం లేకుండా పోయింది. అందుకే బాలల రచనలు... వారి ఊహాశక్తిని పెంచగలిగే పరిస్థితి ఉండాలి. చిన్నపుడు ఎన్నో నాటకాలు, వీధి భాగవాతాలు, చిందు భాగవాతాలు చూసినప్పటికీ... వాటిలో బాల నాగమ్మ కథ బాగా నచ్చేది. ఎందుకంటే... మాయల ఫకీరు లాంటి పెద్దవాడిని పిల్లవాడు ఎలా జయిస్తాడనే ఆసక్తి ఉండేది. ప్రస్తుతం బాలచెలిమి పత్రిక తేవాలనుకోవడం చాలా సంతోషం. ఇంగ్లిష్‌లో తెస్తే ఎక్కువ కాపీలు వెళతాయా... రచనలు ఏ భాషలో వచ్చినప్పటికీ... పిల్లల్ని విముక్తి చేయగలగాలి.బిగ్‌బాస్ లాంటి కార్యక్రమాలను పిల్లలు గంటల తరబడి చూస్తున్నారు. వాటివల్ల పిల్లల ఊహాశక్తిి, భాష, అభిరుచి, జ్ఞానం పెంచేదిగా లేనపుడు మనం బాధపడటం తప్ప చేయగలిగింది ఏమీలేదు. వాళ్లను అలాంటి కార్యక్రమాల నుంచి విముక్తం చేయాల్సిన బాద్యత వేదకుమార్ గారిపైఉందని భావిస్తున్నా.. ఇలాంటి అనేక చర్చలు జరగాలని... ఆశిస్తున్నా. .. అన్ని ప్రక్రియల్లో కృషి జరగాల్సిన అవసరం ఉంది.
బొమ్మలు ఒక వయసులో చాలా ఆకర్షిస్తాయి. కాబట్టి బొమ్మలు, చిన్న వాక్యాలతో ఉన్న పుస్తకాలు మొదలు పెట్టి... చందమామ కథలు చెప్పాలి. కొడవటిగంటి కుటుంబరావు.. చందమామను పెద్దవాళ్లకు, పిల్లలకు అర్థమయ్యే భాష తీసుకొచ్చారు. అలాంటి పుస్తకం నేడు లేదు. అయితే డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంది. వాటిని ప్రింట్ చేసి పిల్లలచే చదివించగలిగితే... వారి ఊహాశక్తి పెరుగుతుంది. భేతాళ కథలు, పరోపకారి పాపన్న కథలు, రామాయణం, భారతం, భాగవతం కథలన్నీ అందరికీ నచ్చేవే. నందిని సిధారెడ్డిగారు చెప్పినట్టు, హేతువాదాన్ని పిల్లలకు బలవంతంగా చెప్పనక్కర్లేదు. చందమామలో దెయ్యాల కథలుండేవి. ఒకసారి కుటుంబరావుగారిని అడిగారు.... మీరు భౌతికవాదులు, సైంటిస్టులు, సైన్స్ పుస్తకాలు రాస్తారు.... మీరు రాసే కథల్లోదెయ్యాలుంటాయంటే.. మా దెయ్యాలు చాలా మంచి దెయ్యాలు, అవి ఎవరికి అపకారం చేయవు, అందరికీ మంచి చేస్తాయాన్నరు. దెయ్యాల్లో కూడా మంచితనాన్ని చూడగలిగే మనసును పిల్లల్లో కలిగించగలగాలి.
పంచతంత్ర కథలు సరళమైన భాషలో ఉంటాయి. అవన్నీ ఎవరో పూర్వీకులు రాశారు, ఇప్పుడు పనికిరావు అనుకోవడం మూర్ఖత్వం... కొత్త కాలంలో కొత్త కథలు రాసుకోవాల్సిందే... రాయాలంటే నేర్పరితనం కావాలి.. అపుడు పాత కథలు కూడా తప్పసిసరిగా చదవాలి. స్కూలు వార్షికోత్సవాల్లో.. నేను చిన్నపుడు చూసిన నాటికల్నే ఇప్పటికీ వేస్తున్నారు. కొత్తనాటికలు రాయాలంటే ఎలా రాయాలి... అప్పుడు మళ్లీ పాతవాటి దగ్గరకే వెళ్లాల్సి ఉంటుంది. పిల్లలకు మాట్లాడుకునే పరిస్థితి కల్పించాలి. కాసేపైనా వాళ్లంతటవాళ్లు మాట్లాడుకోగల అవకాశం కల్పిస్తే... వారిలో చాలా సృజనాత్మకత పెరుగుతుంది. మేము చిన్నపుడు కథలు చదువుకుని.. వాటి గురించి చాలా సేపు మాట్లాడుకునేవాళ్లం. అలా మాట్లాడుకోవడానికి స్కూల్‌కు తొందరగా వెళ్లేవాళ్లం. ఇక్కడ 'మల్లి' సినిమా చూపించాక... మీకు ఇంకా ఏ సినిమాలు ఇష్టమని అడిగినపుడు... బాహుబలి సినిమా కావాలన్నారు. టెక్నాలజీ వాడుకోవడం, మీడియా హైప్వల్ల బాహుబలి సినిమాలు గొప్పగా నడిచినప్పటికీ... చందమామలో వచ్చిన కథలు, బొమ్మల కంటే గొప్పగా అనిపించదు. దర్శకుడు రాజమౌళి కూడా చందమామ బొమ్మలు చూసి ప్రేరణ పొంది ఉంటారు. కాబట్టి మనం బొమ్మలు, పాటలు, కథలు ఇవి మన సంపదలు. ప్రతీ భాషలోనూ ఉండే అపూర్వ సంపదలు. వాటిని పెద్దవాళ్లు పిల్లలకు అందించాలి. కొత్తగా సృష్టించడంతోపాటు పాతవాటిని వెలికితీసి పిల్లలకు ఇవ్వాలి. బంగారం లాంటి బాల సాహిత్యాన్ని పిల్లల చేతికి అందించగలగాలి. ఏ రూపంలోనైనా పిల్లలకు మంచి విలువల్ని, మంచితనాన్ని, అద్భుతమైన ఊహాశక్తిని, కల్పనాశక్తిని అందించే సాహిత్యాన్ని ఇవ్వాలి.
ఇంట్లో ఉండే అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలే.. పిల్లలకు తొలి బాలసాహితీవేత్తలని ప్రముఖ రచయిత ఓల్గా అన్నారు. బాలసాహిత్యం పాత రచనలు చదివినపుడే... కొత్త రచనలకు అవకాశం ఉంటుందని... ఆమె తెలిపారు. పాతకాలం రచనలు ఇప్పటికి పనికిరావని చెప్పడం సరికాదన్నారు.
ఓల్గా, ప్రముఖ రచయిత
'పాతనగరంలో పసివాడు, గులాబీలు, అమూల్యం' అనే మూడు పిల్లల సినిమాలకు కథలు, మాటలు రాశాను. పిల్లలు ఇష్టంగా చూసిన ఈ సినిమాలకు పలు అంతర్జాతీయ చిత్ర ప్రదర్శనల్లో అవార్డులు కూడా వచ్చాయి. నెలల పిల్లల దగ్గర్నుంచి కూడా.. బాల సాహిత్యం అవసరమే. పెద్దవాళ్లకైయితే చాలా అవసరమని నేను నమ్ముతాను. 'ట్వింకిల్- ట్వింకిల్ లిటిల్ స్టార్'.... మనకు అసవరంలేదు... 'చిట్టి చిలకమ్మ' లాంటి పాటలు చాలా మంది పెద్ద రచయితలు చిన్న పిల్లల కోసం రాశారు. నా దృష్టిలో అందరికంటే పెద్ద బాలసాహితీవేత్తలు మా అమ్మమ్మ, నాయనమ్మ. వాళ్లు చెప్పిన కథలు నన్ను రచయితగా మార్చాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. బాలసాహిత్యం ముందు మౌఖిక సాహిత్యంగా మొదలవుతుంది. ఇంట్లో పెద్దలు చెప్పే కథలతో బాల సాహిత్యం ప్రారంభమవుతుంది. మళ్లీ ఆ కథల్ని మేము మా పిల్లలకు చెప్పాలన్నా... సమయం దొరకడంలేదు.. పిల్లలు కూడా చిక్కడంలేదు. రెండున్నరేళ్లకే వాళ్లను ప్లే స్కూళ్లలో వేయడంతో హోంవర్క్‌లతో వాళ్లు బిజీగా మారుతున్నారు. చాలా సందర్భాల్లో అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతాయ్యలు పిల్లలతో కలిసి ఒకే కప్పు కింద ఉండే పరిస్థితులు కూడా లేవు. కొత్త కాలానికి కొత్త సమస్యలు వచ్చినపుడు సాహిత్యం మరో కొత్త రూపాన్ని ఎలా తీసుకోవాలి. ఇది మనముందున్న పెద్ద సవాల్.
కె. బి.గోపాలం, పిల్లల రచయిత
దశాబ్దాల క్రితం ప్రకాశం ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంటల్ సైన్సెస్ అనే సంస్థ హైదరాబాద్‌లోని అయోధ్య హోటల్ పక్కన ఉండేది. వాళ్లు పదిరోజుల రచయితల వర్క్‌షాప్ నిర్వహించారు. నేను అందులో పాల్గొనకపోయినప్పటికీ... చివరి రోజున ఉపన్యసించమని ఆహ్వానించారు. అక్కడ వరదాచారి కనిపించారు. ఆయన ముందుగా మాట్లాడుతారేమో... మిగిలినవి ఏమైనా ఉంటే ఆ తర్వాత మాట్లాడదామనుకున్నా... కానీ నన్నే ముందు మాట్లాడమన్నారు. నేను ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ను ఇక్కడ కూడా ప్రస్తావిస్తున్నా... నా దృష్టిలో అసలు బాల సాహిత్యమంటూ ప్రత్యేకంగా ఏదీలేదు. ఎందుకంటే...చిన్నపుడు మనసు నిర్మలంగా ఉంటుంది. ఏమి చెప్పినా... ఓహో నిజమే కదా అని నేర్చుకునే మంచితనం ఉంటుంది. నేను ఆ పద్ధతిలో ఆలోచించాను... ఆలోచిస్తున్నాను..
సైన్స్‌కు సంబంధించి పిల్లల అనుమానాలకు జవాబులు చెప్పే కార్యక్రమం రేడియో లో మొదలుపెట్టాం. తెలంగాణ వచ్చాక... విశాలాంధ్ర రెండు భాగాలుగా విడిపోయింది. మనకు నవ చేతన మిగిలింది. నవచేతనకు చైర్మన్‌గా... తెలుగు యూనివర్సిటీ వీసీగా పనిచేస్తున్న ఎస్.వి. సత్యనారాయణ నియమితులయ్యారు. అలా ఒకసారి హలో అందామని వెళ్లాను. నేను లోపలికి వెళ్లగానే వెనక నుంచి అక్కడ పనిచేసే స్టాఫ్ వచ్చారు. వాళ్లునన్ను చూడటానికి వాచ్చారని తెలియగానే... ఒప్పొంగిపోయింది. నేను రాసిన పుస్తకాల ప్రభావం విశాలాంధ్ర సిబ్బందిమీదనే అంతగా ఉందంటే... ఇక పాఠకుల మీద ఎంత ఉందో తెలియదు. 'నిత్యజీవితంలో భౌతికశాస్త్రం' మళ్లీ వేయొచ్చుగా అని... ఆ సందర్భంలో ఎస్వీగారు అడిగారు. అయితే... అప్పుడు నా పరికత్వత తక్కువ... దాన్నే మళ్లీ ప్రింట్ చేయకండి... దాన్ని మళ్లీ రాస్తాను అనిచెప్పా... అలాగే దీన్ని రాశాను. ఇప్పటికీ... ఈ పుస్తకం బాగా అమ్ముడుపోతోంది. మరిదీన్ని ఎవరూ బాలసాహిత్యం అనడంలేదు. అంతరిక్షం అనే ఒక బొమ్మల పుస్తకం రాశాను... పదేళ్లకంటే తక్కువ వయసుగలవారికి కూడా అర్థమవుతుంది. ఇదే సైజ్‌లో సైన్స్ చరిత్ర అనే పుస్తకం రాసిన. ఇది ప్రింటింగ్ దశలో ఉంది. అందరికీ సైన్స్ పేరుతో మరో పుస్తకం తెచ్చాను. సైన్స్ గురించి ఏ మాత్రం అవగాహనలేనివారికి ఇది చదివితే... అర్థమవుతుందని రాశాను. మరి ఇది బాలసాహిత్యం కాదా... నేను రాసిన మరో పుస్తకం '100 ప్రశ్నలు'.... ఇందులో రకరకాల ప్రశ్నలుంటాయి.... అసలు ప్రశ్నతోనే ఈ ప్రపంచం ముందుకుసాగిందని సైన్స్, తత్వశాస్త్రవేత్తలు, సాహిత్యంవాళ్లు ఒప్పుకున్న విషయం. 'మినుగురు పురుగుల్లో వెలుగు ఎలా వస్తుంది' , 'పక్షులు ఎలా ఎగురుతాయి', 'పూలకు రంగులు ఎందుకు', 'సైన్స్ పద్ధతి' లాంటి పుస్తకాలు రాశాను...
'సైన్స్ పద్ధతి' పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 11 వేల కాపీలు తీసుకుని ప్రతిబడికి పంపింది. అయితే దీన్ని ఎవరూ బాలసాహిత్యం అనలేదు... ఇది బాల సాహిత్యమా కాదా.. మీరే తేల్చుకోండి... మోటివేషనల్ కూడా ఉండాలన్న ఉద్దేశంతో... మరొక రకమైన పుస్తకాలను రాయడం మొదలు పెట్టాను. 'కొత్తదారులు', 'నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్' 'జేన్ గుడాల్' 'ఐజాక్ న్యూటన్' లాంటి పుస్తకాలు రాయడం జరిగింది. సైన్స్‌తోపాటు...పురాణాలు, కథలు, కవిత్వాలు గురించి కూడా రాస్తాను... బాలలకుగానీ... లేదా వారిలాంటి మనసున్నవారికిగానీ.. చెప్పాలంటే... అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలన్నదే నా తపన.. జానపదకథలు అంటే పిల్లల కథలు అనే అపోహ ఉంది.... అయితే జ్ఞాపకం వచ్చింది కాబట్టి ఒక విషయం చెబుతాను... అప్పట్లో చందమామ పత్రికపైన... పిల్లల మాస పత్రిక అనే ట్యాగ్‌లైన్ ఉండేది. అనేకమంది పెద్దవాళ్లు ఉత్తరాలు రాసి... ఆ ట్యాగ్‌లైన్‌ను తీసేయించారు. అది పిల్లల మాసపత్రిక మాత్రమే కాదు.. మేముకూడా చదువుతామనేవారు.. అదేపద్ధతిలో నేను రాసిన ఈ పుస్తకాలన్నీ బాలసాహిత్యంకాదు.. ఇది అందరికీ కావాల్సిన సాహిత్యం.
బాలల ఊహాశక్తిని పెంపొందించే రచనలు తీసుకునిరావాల్సిన అవసరం చాలా ఉందని... కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరమైన ప్రముఖ రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధా రెడ్డి అన్నారు. సాంకేతిక పరికరాలు పిల్లల ఊహాశక్తిని దెబ్బతీస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
పైడిమర్రి రామకృష్ణ, పిల్లల రచయిత
ఇక్కడున్న నాతోపాటు... చాలా మంది రచయితలు చందమామ చదివి పెరిగినవాళ్లే. దాంతోపాటు బాలజ్యోతి, బాలమిత్ర కూడా చదివాను. బాలజ్యోతిలో సైస్సు మావయ్య కె.బి.గోపాలం గారి వ్యాసాలు వచ్చేవి. అలాంటిది ఈ రోజు ఆయనతో వేదిక పంచుకోవడం సంతోషంగా ఉంది. ఈతరం పిల్లలు తెలుగు బాలసాహిత్యాన్ని చదువుతున్నట్టు అనిపించడంలేదు. తెలుగును అందరూ నేర్చుకోవాలి, అది మన మాతృభాష. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధా రెడ్డిగారికి నాదొక విన్నపం... తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున పిల్లల కోసం పత్రిక ఎందుకు నడపకూడదని నేను ప్రశ్నిస్తున్నాను. వాటిని స్కూళ్లకు చేర్చినపుడు ప్రతి విద్యార్థికి బాలసాహిత్యం చేరే అవకాశం ఉంటుంది. 'పిల్లల కోసం చాలా సైన్స్ వ్యాసాలు రాశాను... నేను బాల సాహితీవేత్తను కాదా' అని కె.బి.గోపాలం అడుగుతున్నారు... కచ్చితంగా ఆయన బాలసాహితీవేత్తనే. ఎందుకంటే బాలల కోసం ఏ రచన అయినా... బాల సాహిత్యమే. దాన్ని పెద్దలు కూడా చదువుతారు. అందులో కథలు పిల్లలకు ఎక్కువగా దగ్గరవుతాయి. కథలతోపాటు గేయాలు, కవితలు ఇతర ప్రక్రియలుంటాయి. అలాగే కె.బి.గోపాలం గారు తీసుకున్న ప్రక్రియ సైన్సు వ్యాసాలు. అయితే ప్రభుత్వం తరపును అవార్డుల కోసం... సైన్స్ వ్యాసాలను ఇతర ప్రక్రియలు అనే కోటాలో తీసుకుంటున్నారు. దాన్ని బాల సాహిత్యంగా పరిగణించడంలేదు. పిల్లల కోసం చేసిన ఏరచన అయినా... అది బాల సాహిత్యమే.. దీని ప్రకారం కె.బి.గోపాలం గారు రాసినవి బాల సాహిత్యమే. సైన్సు వ్యాసాలతోపాటు బాలల కోసం రాసినవి పరిగణలోకి తీసుకోవాలని నందిని సిధారెడ్డి గారిని నేను కోరుతున్నా.
ప్రస్తుత బాలచెలిమి ముచ్చట్టు అంశం... 'బాలసాహిత్యం- ముందడుగు' గురించి చెప్పుకోవాలంటే... నేటి పిల్లలు బాల సాహిత్యాన్ని చదవగలిగితేనే... భవిష్యత్తులో రాయగలరు. భూపాల్, రఘు, నేను ఇంకా ఇతర బాలసాహితీవేత్తలు కలిసి సిరిసిల్లలో రంగినేని ట్రస్టు ద్వారా వర్క్‌షాప్ నిర్వహించాం. అందులో వారికి బాల రచనలు చేయడమెలాగో నేర్పించాం... ఓ కథా వస్తువుతో కథను ఎలా మొదలు పెట్టాలి... ఎలా రాయాలి... ఎలా మలుపు తిప్పాలి.. ఎలా ముగించాలి.... అనే అంశాలపై శిక్షణ ఇచ్చాం... వాళ్లు నేర్చుకున్నాక... సొంతంగా అద్భుతమైన కథలు రాశారు. వారి రచనలను అచ్చువేశారు... బాల చెలిమిలోనూ ఒక జానపద కథ, ఒక సైన్సు వ్యాసం, క్రియేటివ్ కథలు, ప్రస్తుత సాంఘిక సూత్రాలతో కథలు. గేయాలు వంటి అన్ని ప్రక్రియలతోపాటు పిల్లలు రాసిన కథలు కూడా ఉండేలా చూడాలని వేదకుమార్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా.
రోహిణి చింత, పిల్లల రచయిత
నాలుగు నుంచి ఏడేళ్ల పిల్లలను దృష్టిలో పెట్టుకుని రచనలు చేస్తాను. నేను సైన్స్ కమ్యూనికేటర్‌ను. హ్యూమన్ బయాలజీ- జెనెటిక్స్‌లో పీహెచ్‌డి జెనెటిక్స్‌లో చేశాను. అయితే నేను చేసిన పీహెచ్డీ పిల్లలకు పనికిరానపుడు వృధా అని మా గురువులు చెప్పేవారు.. నా ఉద్దేశంలో పిల్లలకోసం పిల్లలు చేసిన రచనలను ముందుకు తీసుకెళ్లాలి. మిస్టరీ, థ్రిల్లర్స్, అడ్వెంచర్, హ్యూమరస్ కథలకు ప్రాధాన్యత ఇస్తాను. పిల్లల స్థాయిలో వారు ఏమి అర్థం చేసుకోగలరో అలాంటి రచనలే చేపట్టాలి. బాల సాహిత్యంలో నాకు బాగా నచ్చిన రచనలు చందమామలో వచ్చేవి. మా అమ్మమ్మ, తాతయ్యలే వాటిని నాకు పరిచయం చేశారు. వాటితోనే తెలుగు రచనలపై ఆసక్తి కలిగింది. బాల సాహిత్య రచనల్లో వచ్చిన పుస్తకాల్లో చందమామలో ఎక్కువగా బొమ్మలుంటాయి. నా కొడుకుకి కథ చెప్పాలంటే.. ముందుగా బొమ్మలు చూపిస్తాను. వాటిని అర్థం చేసుకోవడానికి సమయం ఇస్తాను. ఆ తర్వాత కథ మొదలు పెడతాను. అప్పుడు కథను తాను ఊహించుకునే అవకాశం ఉంటుంది.
తెలుగులో బొమ్మలతో ఉన్న కథల పుస్తకాలు చాలా తక్కువ. నా కొడుకు వయసులో ఉన్న పిల్లలకు బొమ్మలతో ఉన్న కథలు, పుస్తకాలు ఎక్కువగా ఆకట్టుకుంటాయి. కథలు సుదీర్ఘంగా ఉండకుండా.. బొమ్మలతో మంచిగా ఉండి మొదటి పేజీ ఆకర్షణీయంగా ఉండాలి. అప్పుడే పుస్తకం చూడాలన్న ఆసక్తిని పెరుగుతుంది. నేను నా 150 పేజీల పరిశోధనా పత్రాలను 6 పేజీల కథ కింద రాసి బొమ్మలతో అచ్చు వేయించాను. ప్రైమరీ స్కూల్స్‌కు సైన్స్ పుస్తకాలను ముద్రించే 'ఐ వండర్' అనే మ్యాగజైన్ నా పుస్తకాన్ని విడుదల చేసింది. అపుడు నా కొడుకు క్లాస్మేట్ వచ్చి.... ఆంటీ నాకు ఒక కాపీ దొరుకుతుందా అని అడిగాడు. ఆ పుస్తకం నీకు అర్థమవుతుందా అని అడిగాను. అయితే మా అమ్మ పుస్తకం చదువుతుంది... నేను ఆబొమ్మలు చూస్తాను అని ఆ బాబు చెప్పాడు. ముందుగా మనం పిల్లవాడి కోణం నుంచి చూడాలన్నది నా ఉద్దేశం.
భూపాల్, నటుడు- రచయిత
సభలో పాల్గొన్న బాలసాహిత్యంంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అయిన భూపాల్, నటుడు- రచయిత
ఈ మధ్యే తెలంగాణ పాఠశాల పిల్లలు అని వచ్చిన 306 కథలు చదివాను. వాటిలో 51 మాత్రమే ఎన్నుకోబడ్డాయి. 250 కథలు పక్కనబెట్టారు. దీని అర్థం పిల్లల్లో లోపం ఉందని కాదు. వారిలో సృజనాత్మకత ఉంది. అయితే దాన్ని పెంచిపోషించే సత్తా ఎవరూ ఇవ్వడంలేదు. కచ్చితంగా ఇది పెద్దల పొరపొటే.. కథలు రాసే, చెప్పే విధానాలు మనమే పిల్లలకు చెప్పాలి. వారికి మనం అలవాటు చేయకపోవటమే అసలు సమస్య. వారికి చెబితే... అద్భుతంగా కథలు రాయగలరు.
బాలచెలిమి 6వ ముచ్చట -'బాలసాహిత్యం-ముందడుగు' కార్యక్రమంలో... తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొనగా... రచయితలు ఓల్గా, కె.బి.గోపాలం, పైడిమర్రి రామకృష్ణ, రోహిణి చింత, వడ్డేపల్లి కృష్ణ, భూపాల్ రెడ్డి, ఎస్.రఘులతోపాటు అక్కినేని కుటుంబారావు, శ్రీనివాస్, శ్యాంసుందర్, ధనుంజయ్, బొట్ల పరమేశ్వర్, సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన 'మల్లి' హిందీ షార్ట్ ఫిల్మ్‌ను ఈ సందర్భంగా ప్రదర్శించారు.
-
వాస్తవాలను ప్రతిబింబించి.... బాలల మానసిక పరిణతిని పెంచే విలువలున్న
రచనలు వచ్చినపుడే బాల సాహిత్యానికి పరిపూర్ణత, ప్రయోజకత్వం లభిస్తుంది.
ప్రస్తుత సమాజంలో అలాంటి రచనలు రావాల్సిన అవసరం ఉందని... హిమాయత్
నగర్‌లోని ఆక్స్‌ఫొర్డ్ గ్రామర్ స్కూల్లో జరిగిన బాల చెలిమి ముచ్చట్లు
కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు. చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ
ఆధ్వర్యంలో ప్రతి నెల రెండో శనివారం బాల చెలిమి ముచ్చట్లు కార్యక్రమం
నిర్వహిస్తున్నారు. ఐదోసారి జరిగిన బాల చెలిమి ముచ్చట్లలో... 'బాల
సాహిత్యం- ప్రభావం' అంశంపై.. ప్రముఖ రచయితలు తమ మనోభావాలు, రచనా అనుభవాలను
వ్యక్తపరిచారు. చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ ఎం.వేదకుమార్
అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీపీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ముఖ్య
అతిథిగా పాల్గొన్నారు.
బాల చెలిమి ముచ్చట్లు కార్యక్రమం ప్రారంభించడానికి ముందు... పిల్లల కోసం ' ద రెడ్ బెలూన్', 'స్వచ్ఛ భారత్' లఘు చిత్రాలను ప్రదర్శించారు. స్వచ్ఛ భారత్ చిత్రాన్ని ప్రేమ్ దర్శకత్వం వహించారు. ఐక్యమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని, స్వచ్ఛ భారత్‌లాంటి కార్యక్రమాలపై పిల్లల్లో అవగాహన పెంచడానికే ఈ లఘు చిత్రాన్ని రూపొందించినట్టు... దర్శకుడు ప్రేమ్ తెలిపారు.
బాల సాహిత్యం-ప్రభావంపై జరిగిన చర్చలో.. ముఖ్య అతిథి ఘంటా చక్రపాణి ముందుగా ప్రసంగించారు. రచనలు శాస్త్రీయంగా ఉంటే... వాటిని చదివాక శాస్త్రీయంగా చూడగలిగే పరిస్థితి పిల్లల్లో ఉంటుందని చక్రపాణి అన్నారు.
ఘంటా చక్రపాణి, టీపీఎస్సీ చైర్మన్
వేదకుమార్ గారు గత 25 ఏళ్లుగా సమాజంతో మమేకమై ఒక పెద్ద వ్యవస్థ ద్వారా తనవంతు కార్యక్రమాలు చేపడుతున్నారు. 30 ఏళ్ల క్రితం పాఠశాలలు పెట్టినవాళ్లంతా ఇప్పుడు కార్పొరేట్ స్థాయికి ఎదిగి రియల్టర్లుగామారి, చట్టసభల్లో అడుగుపెట్టినవాళ్లున్నారు. కానీ వేదకుమార్ గారు మాత్రం ఇప్పటికి ప్రజలతో, మానవహక్కులతో అందరితో కలిసిమెలిసి మమేకమై ఉండే వ్యక్తి. మేము పిల్లలుగా ఉన్నపుడు బాల సాహిత్యంతో పరిచయం చాలా తక్కువ. అప్పట్లో ఎక్కడో పాన్ షాప్‌లలో వేలాడుతూ ఒకటి అరా చందమామ పుస్తకాలు కనిపించేవి. మా చిన్నపుడు ఊళ్లో చిరుత రామాయణం, చిందూ భాగవతం ఉండేది. ఇవికాకుండా ప్రతి ఏటా కాముని పండుగకు పాటలు పాడేవాళ్లం. అచ్చుకి, అచ్చులో లేనటువంటి మిగతా రచనలకు, కథలరూపంలోగాని మౌఖిక సాహిత్యంలోగాని విన్న పిల్లల్లో అద్భుతమైన రచనాశక్తి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి ఈ రోజు వార్తలు ఏమిటంటే చెప్పలేకపోవచ్చుకానీ... మీ ఊళ్లో ఉన్న సమస్యలు చెప్పమంటే అనర్గళంగా మాట్లాడతారు. ఎందుకంటే వారిలో కథా కౌశలం ఉంటుంది. పట్టణాల్లోని కాన్వెంట్ పిల్లలు అలా చెప్పలేరు.
ఏమనిషికైతే తన చుట్టూ ఉండే వాతావరణం గురించి ఆలోచించే అవసరం ఉంటుందో... ఆ మనిషి మెదడు వికసిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నవాళ్లకి లేదా మిగతా అన్ని రకాల వేదనలు, సమస్యలు అనుభవిస్తున్నవారికి కథా కౌశలం, రచనా శక్తి ఎక్కువగా ఉంటాయి. నేడు పట్టణాల్లో ఉండే మహిళల వద్దకు వెళ్లి మీరున్న పరిస్థితులపై పాటలు పాడమంటే పాడలేరుకానీ... అదే ఊళ్లో పొలం పనిచేసే మహిళలకు తమ పరిస్థితలపై అప్పటికప్పుడు పాటలు కట్టి పాడగల శక్తి ఉంటుంది.
చిన్నపుడు మా ఊళ్లో విద్యుత్ సౌకర్యం లేదు. దీంతో సినిమాలు చూసే అవకాశం లేదు.. మాలో ఎవరో ఒకరు సినిమా చూస్తే... ఆ సినిమా మొత్తం కథను స్కూలుకు వెళ్లేదారిలో ఫైటింగ్‌లతో సహా వివరించి చెప్పేవాడు. కానీ నేటి జనరేషన్ పిల్లల్లో కథా కౌశలం లేదు. సమాజంతో, కుటుంబంతో సంభాషించడం వల్ల అనేక విషయాలు, విషయ పరిజ్ఞానం తెలుస్తాయి. నేటి తరంలో ఉమ్మడి భావం అనే పరిస్థితి లేదు. ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ప్రపంచ సాహిత్యంలో మాదిరిగానే మనవద్ద కూడా పురాణాలు, మతాలకు సంబంధించిన కథలే ఉండేవి. ఆతర్వాతి కాలంలో జంతువుల కథలు, పంచతంత్ర కథలు వచ్చాయి. మనం ఎలాగైతే ఆలోచించే ధోరణిలో ఉన్నామో... పిల్లలను కూడా అదే కోణంలోకి తీసుకెళుతున్నాం. మనకు ఎలాగైతే పాప -పుణ్యాల కథలు, భయం- భక్తి భావం కలిగించే అలవాట్లు ఉన్నాయో... పిల్లలపై కూడా అదే రుద్దతున్నాం. నేటికీ మన గ్రామీణ ప్రాంతాల్లో కథలు, సంస్కృతి సజీవంగా ఉన్నాయి. ప్రతి అంశంలో నుంచి కథలు సృష్టించగల చతురత ఉంది. పిల్లల మేథోశక్తిని పెంచేలా బాల సాహిత్య రచనలు జరగాలి. మిగిలిన ప్రాంతాలకంటే మన ప్రాంతం ప్రత్యేకమైనది. మన తెలంగాణ కథలు బాల రచనల్లో రావాలి. పిల్లలకు అన్ని రకాలుగా జ్ఞానం అందించే పరిస్థితి ఉండాలి.
రమణ జెవి, చిత్రకారుడు
మనం ఒక విషయాన్ని గ్రహించి దాన్ని పదాల రూపంలో మళ్లీ చెప్పడం చేస్తుంటాం. అలాంటి ప్రత్యేకతలు మనిషిలో చాలా ఉంటాయి. పదాల రూపంలో విజ్ఞానాన్ని తీసుకొని వాటిని పరీక్షల రూపంలో తిరిగి చెప్పడమేకాకుండా.. మనలో ఉండే అనేక జ్ఞానేంద్రియాలకు పని కల్పించినపుడే సృజనాత్మకత బయటికి వస్తుందని నా అభిప్రాయం. చిన్నపుడు చూసిన బొమ్మలు, చదివిన కథలు ఒక కళాకారుడిగా నన్ను ఎంతగానో ప్రోత్సహించాయి. చిన్నపుడు నాకు స్కూల్ అంటే ఒక భయంకర వాతావరణం అనిపించేది. అక్షరాలు దిద్దాలంటే నచ్చేదికాదు. నా సీనియర్‌తో పలక వెనుక ఆంజనేయుడి బొమ్మను చెక్కించుకుని ... అక్షరాలు దిద్దుతున్నట్టుగా బొమ్మ దిద్దేవాడిని. అలా నాకు చాలా సంతోషం అనిపించేంది. అక్షరాల్లో లేని ప్రాణం ఆ రూపంలో కనిపించేది. ఇంటర్ తర్వాత నాకు చదువు అంటే ఆసక్తిలేదని ఇంట్లో చెప్పి... ఆర్టిస్ట్‌గా మారిపోయాను. పిల్లలకు సంబంధించిన ప్రచురణలు చాలా సున్నితంగా చేయాల్సినపని.
నాకు జిడ్డు కృష్ణమూర్తి అంటే ఇష్టం. ఆయన ప్రసంగాలు వినడానికి రిషీ వ్యాలీ వెళ్లేవాడిని. అప్పుడు నా బొమ్మలు కూడా ప్రదర్శించేవాడిని. అలా రిషీ వ్యాలీలో ఆర్ట్ టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. అప్పుడు పిల్లలను మరింత దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. వారు చాలా సున్నితంగా ఉంటారు. చాలా సున్నితత్వ హృదయం ఉంటేనే వారికి దగ్గర కాగలం. మన చుట్టూ ఉండే పరిస్థితులు, విద్యావిధానం మనల్ని ఒకరకమైన చట్రంలో బంధిస్తాయి. సామాజానికి అవన్నీ అవసరమే కావచ్చు. అదే సమయంలో మనలో ఉండే సృజనాత్మకతను తట్టిలేపాలి. అలా చేయడానికి కళలు, సాహిత్యం ఉపయోగపడతాయి. పిల్లల హృదయాలను తాకి, వారిలోని సృజనాత్మకతను వెలికితీసే రచనలు రావాలని కోరుకుంటున్నా.
ప్రముఖ రచయిత కందేపి రాణీ ప్రసాద్ మాట్లాడుతూ... పొడుపు కథలు, ఆట-పాటల ద్వారా పిల్లల్లో మానసిక పరిణితిని పెంచే కృషి చేస్తున్నట్టు తెలిపారు.
కందేపి రాణిప్రసాద్, ప్రముఖ రచయిత
బాలలు మన జాతీయ సంపద. వీరిని తీర్చిదిద్దితే మన దేశం ముందుకు పోతుందని భావిస్తున్నా. పిల్లలకు మంచి- చెడు విచక్షణ నేర్పించగలిగితే.. క్రమశిక్షగల పౌరులుగా తయారవుతారు. పిల్లల మనసు వెన్నలాంటిది. ఎలా మలుచుకోగలిగితే వారు అలా తయారువుతారు. వరి గింజలు నాటి సీతాఫలాలు పండమంటే పండవు. పిల్లలకు ఏవి నేర్పిస్తామో... ఆ ఫలితాలే లభిస్తాయి. కానీ వాళ్లకు మనం నేర్పించేది ఒకటి, ఆశించేది మరొకటి. అబద్ధం చెప్పొద్దని అంటాం... ఎదురింటివాళ్లు వస్తే.... ఇంట్లో గొడుగు లేదని చెప్పమంటాం... రెండు మనమే నేర్పిస్తాం. అలాంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పాలో వద్దో పిల్లలకు అర్థంకాదు. ర్యాంకులు, మార్కుల ప్రాతిపదికన పిల్లలను తెలివైనవాళ్లుగా లెక్కలేసుకుంటున్నాం. అలాంటివాళ్ల వల్ల ఉపయోగంలేదు. మానవత్యం ఉండి, పది మందికి సాయం చేయగల వాళ్లై ఉండాలి. అలాకానపుడు ఎంతపెద్ద పదవిలో ఉన్నా... సమాజానికి ఉపయోగపడరు. ఒకరకంగా చెప్పాలంటే... బాల సాహిత్యం రాసేవాళ్లు కూడా టీచర్ల లాంటి వాళ్లే. తల్లిదండ్రులు, గురువు, బాలసాహితీవేత్తలు మాత్రమే పిల్లల మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. కేవలం కథలు గేయాలు మాత్రమే బాలసాహిత్యం కాదు. స్కూలు పాఠాలను కూడా సాహిత్య రూపంలో అందిస్తే వారికి రెండు రకాలుగా ఉపయోగపడుతుందని భావిస్తున్నా. ఆ మార్గంలో నేను కొంత కృషి చేస్తున్నా. మావారు పిల్లల డాక్టర్... మా హిస్పిటల్‌లో గోడలపై పిల్లల కోసం పొడుపు కథలు రాయించాం. పిల్లల ఆసుపత్రి కాబట్టి... వారిలో ఆసక్తి పెంచేలా.. మానవ శరీర భాగాలకు సంబంధించిన పొడుపు కథలు అంటించాం. గుండె ఎలా పనిచేస్తుంది... మెదడు ఏమి చేస్తుంది... ఊపిరి తిత్తులు ఎలా పనిచేస్తాయి.... లాంటి దాదాపు 300 పొడువు కథలు, గేయాలు పెట్టాం. ఇంకా స్థలం సరిపోకపోవడంతో... మందులు రాసే చిట్టీలపై కూడా పొడుపు కథలు రాస్తున్నాం.
పొడుపు కథలతోపాటు బాల సాహితీ రచయితలు ఇచ్చే పుస్తకాలను చుదివేలా ఆసుపత్రిలో ఒక గది ఏర్పాటు చేశాం. పేషంట్‌తోపాటు వచ్చే ఇతర పిల్లలు, వారి తల్లిదండ్రుల్లో ఆసక్తిఉన్నవాళ్లు వాటిని చదువుకోవచ్చు. కొందరు పిల్లలు ఇంజెక్షన్లు వద్దని ఏడుస్తుంటారు. మా ఇంజెక్షన్ రూమ్‌కి ఒక పోస్టర్ అంటించాం. ఒక దెయ్యంలాంటి దాన్ని సిరంజి పొడిచి చంపేస్తూ ఉంటుంది. ఇక్కడ దెయ్యం అంటే వైరస్, లేదా బ్యాక్టీరియా. పక్కనే... కొన్ని లైన్లు రాసి పెట్టాం. ఇంజెక్షన్ అంటే భయపడకు.. ..పొడిచేది నీలోని బ్యాక్టీరియాను నిన్ను కాదు అని. అలా ప్రతీ రూమ్ వద్ద చిన్నచిన్న కవితలు, మంచిమాటలు పెట్టాం. బాల సాహిత్య రచయితలు రాసేవి థియరీ లాంటివి.. మేము ప్రాక్టికల్‌గా ప్రయోగాలు చేస్తూ ఫలితాలు సాధిస్తున్నాం. మా ఆసుపత్రిలోని ఒక ఫ్లోర్లో కార్ల పరిణామక్రమం, మరో ఫ్లోర్లో రాజ భవనాలు, మరో చోట అంతరించే దశలో ఉన్న జంతువులు, పక్షుల వివరాలతోపాటు వైద్య శాస్త్రంలో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల వివరాలు పెట్టాం... ఆసుపత్రిలోనే వేస్ట్ మెటీరియల్‌తో పిల్లలను ఆకట్టునేలా బొమ్మలు, చార్ట్‌లు 3 వేల వరకు తయారు చేశాం. బాల సాహిత్యం రచనలు... పిల్లల వరకు చేరేలా జరగాలన్నదే మా ప్రయత్నం.
పిల్లలకు వాస్తవిక ప్రపంచంతో ముడిపడిన కథలు, మానవీయ విలువలు పెంపొందించే కథలు అందించాల్సిన బాధ్యత రచయితలపై ఉందని... ప్రముఖ రచయిత దేవరాజ్ మహారాజ్ ... బాలచెలిమి ముచ్చట్లలో తన మనోభావాలను పంచుకున్నారు.
దేవరాజ్ మహారాజ్, ప్రముఖ రచయిత
బాల సాహిత్యంలో నేను ప్రత్యేకంగా రచనలు చేయలేదు. అయితే నేను రాసిన పుస్తకాల జాబితాలో ఐదారు పిల్లల పుస్తకాలు కూడా ఉన్నాయి. భూతాలు, దెయ్యాలు, దేవుడు అనేవి లేకుండా మానవీయ విలువలకు ప్రాధాన్యమిచ్చే ప్రపంచ జానపద కథల్లోంచి ఎన్నుకుని... వాటిని మళ్లీ తిరగ రాశాను. అలా పిల్లలకు సంబంధించిన కొన్ని కథలు వచ్చాయి. ఇక్కడ పిల్లలున్నారు కాబట్టి అలాంటి ఒక కథ చెప్తున్నా... తాబేలు- కుందేలు కథను తిప్పి రాస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. ఒకసారి తాబేలు - కుందేలు మళ్లీ కలుస్తాయి. పాత పోటీ మరచిపోయి మరోసారి పోటీ పెట్టుకుందామని అనుకుంటాయి. అయితే ఈ సారి మార్గం మార్చానని తాబేలు చెబుతుంది. కుందేలు సరే అంటుంది. ఇద్దరు కలిసి పరుగు మొదలు పెడతాయి. కుందేలు వేగంగా పరిగెత్తాక... నది అడ్డు వచ్చి ఆగిపోతుంది. నీటి ప్రవాహాన్ని దాటలేక అక్కడ కూర్చుంటుంది. చాలా సేపటి తర్వాత మెల్లగా తాబేలు అక్కడికి చేరుకుంటుంది. అప్పుడు తాబేలు, కుందేలుతో .... నీవు నదిదాటలేవు కాబట్టి నా వీపుపై ఎక్కు... కలిసి ముందు కెళదాం. దానికి బదులుగా... నేను వేగంగా నడవలేని చోట నన్ను నీ వీపుపై ఎక్కించుకో అని తాబేలు సలహా ఇస్తుంది. కలిసి ఐక్యమత్యంగానే విజయం సాధించవచ్చని అర్థమై కుందేలుకు జ్ఞాననోదయమవుతుంది.
అలా నది దాటాక... కుందేలు తనపై తాబేలుని ఎక్కించుకుని గమ్యస్థానం చేరుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో సామర్థ్యం ఉంటుంది. వాటన్నింటిని పంచుకుని ముందుకు వెళితే విజయం సాధించవచ్చని... ఇలా తిరగరాసిన కథ ద్వారా పిల్లలకు చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో బాలచెలిమి పత్రిక తీసుకుని రావడానికి వేదకుమార్ గారు చేస్తున్న సాహసోపేతమైన కృషిని అభినందిస్తున్నా. ఎందుకంటే యునెస్కో లెక్కల ప్రకారం అంతరించిపోతున్న భాషల జాబితాలో తెలుగు కూడా ఉంది. జనరేషన్స్ మారిపోతుండటంతో... తెలుగుకు ఆ దుస్థితి వచ్చింది. చిన్న పిల్లలకు మాతృభాషలో పాఠాలు చెబితే వారు తొందరగా గ్రహించగలుగుతారని ప్రశాంత్ చంద్ర రే అని కెమిస్ట్ చెప్పారు. పిల్లల స్వేచ్ఛను హరించకుండా పాఠాలు చెప్పాలని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ... శాంతినికేతన్ ద్వారా రుజువు చేశారు. పట్టణాల్లో ఉండే పిల్లలు మార్కులు, ర్యాంకుల విషయాల్లో ముందుంటారు. కానీ... చెట్ల కింద ఆడుతూ పాడుతూ పెరిగిన గ్రామీణ పిల్లల వద్ద ఇంగిత జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. మన యాంత్రిక జీవితాల్లో పిల్లలకు కథలు చెప్పడానికి సమయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మన భాషలో పిల్లల కోసం పత్రిక ఉండాలి. తొటి మనుషులతో గుండెల నిండా మాట్లాడుకోవాలని తాపత్రయపడుతున్న వేదకుమార్ గారికి అభినందనలు. నేటి సమాజానికి ఇలాంటి ప్రయత్నం చాలా అసవరం. నేటి రచయితల్లో చాలా మంది బాల సాహిత్యం చదువుకునే పెరిగి పెద్దవాళ్లయ్యారు. స్మార్ట్ ఫోన్లతో కమ్యూనికేషన్ పెరిగినప్పటికీ... మనుషులంతా కలిసిలేరు. మనముందు తరాల వాళ్లు మనకు పరిశుభ్రమైన పర్యావరణాన్ని అందించారు. దాన్ని తర్వాతి తరాల వాళ్లకు ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం లేకపోతే, బాల సాహిత్యం వల్లే ఉపయోగం ఏముంది. పిల్లలకు వాస్తవాలు చెప్పాలి. వారిని మభ్యపెట్టే రచనలు చేయకూడదు. వందల ఏళ్ల క్రితం పాత సంప్రదాయాలను పిల్లలపై రుద్దకూడదు. బాల సాహిత్య రచనల్లోనూ పాత విధానాలకు ఫుల్ స్టాప్ పెట్టి కొత్త సాహిత్యాన్ని సృష్టించాలి. సమకాలీన సంక్లిష్ట జీవితంలోని సమస్యలు పిల్లలకు తెలిసే విధంగా కథలు రావాలి.
డా.ఎన్.రఘు, కోఠి మహిళా కాలేజీ తెలుగు విభాగం అధ్యక్షులు
పిల్లల హృదయాలని అంతర్గతంగా ఆలోచించగలిగినపుడు రచనల్లో ప్రత్యేకత వస్తుంది. పిల్లలస్థాయికి దిగి రాసే రచయితలు తమ అనుభవాలను అతి సరళంగా అందించగలిగినపుడే బాల సాహిత్యం లక్ష్యం నెరవేరుతుంది.
బాల సాహిత్య ప్రభావం అంశంపై... బాలచెలిమి ముచ్చట్లలో పాల్గొన్న రచయితలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, సాహితీవేత్తలకు వారు ఇచ్చిన సూచనలను... చిల్డ్ర్‌న్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ ఎం.వేదకుమార్ అభినందిస్తూ స్వాగతించారు.
ఎం.వేదకుమార్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ చైర్మన్
బాల సాహిత్య రంగంలో నిష్ణాతులైన ప్రముఖులు పాల్గొంటున్న బాల చెలిమి ముచ్చట్లు కార్యక్రమూన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ రూపాల్లో అందించేందుకు సొసైటీ ద్వారా సిద్ధమవుతున్నాం. బాలల సంపూర్ణ వికాసమే లక్ష్యంగా బాల చెలిమి ముందుకెళుతుంది. ఇలాంటి చర్చలను కొనసాగిస్తుంటాం. బాల చెలిమి ముచ్చట్లకు వచ్చిన రచయితలకు,అతిథులకు ధన్యవాదాలు. అందరి సహకారంతో నాణ్యమైన సృజనాత్మక రచనలతో బాల చెలిమి పత్రికను తీసుకొస్తాం. రెడ్ బలూన్, స్వఛ్ భారత్ వంటి క్రియేటివ్ వర్క్స్‌ను చూపించాం. వీటి ద్వారా ఒక్క పిల్లవాడిని ఉత్తేజపరచగలిగినా అది విజయంగానే భావిస్తాం....
ఈ కార్యక్రమంలో రామానందతీర్థ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ కిశోర్ సాహితీవేత్తలు నారాయణ, శ్రీనివాస్, అనీల్, సునీత, లక్ష్మి శైలజ, ప్రభాకర్‌తోపాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
-
తరం మారుతోంది... స్మార్ట్ తరం దూసుకొస్తోంది... వారి ఆలోచనా విధానం
కూడా శరవేగంగా మారుతోంది... మరి ఇలాంటి పరిస్థితుల్లో... బాల సాహిత్యం కూడా
మారాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో మానసిక పరిణతిని పెంపొందించే స్థాయిలో...
నేటితరానికి తగ్గట్టుగా బాల సాహిత్యం రావాల్సిన ఆవశ్యకత ఉందని... బాల
చెలిమి నాల్గవ ముచ్చట్లలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. జులై 14న
హిమాయత్‌నగర్‌లోని ఆక్స్‌ఫొర్డ్ గ్రామర్ స్కూల్లో ' బాల సాహిత్య వికాసం -
మనం, మన ఆలోచనలు' అంశంపై.. చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో
బాల చెలిమి ముచ్చట్లు కార్యక్రమం జరిగింది. అకాడమీ చైర్మన్ అధ్యక్షత
వహించిన ఎం.వేదకుమార్ ... బాల చెలిమి ముచ్చట్లకు వచ్చిన రచయితలను పరిచయం
చేస్తూ... వేదికపై ఆహ్వానించారు. ఎం.వేదకుమార్, చిల్డ్రన్స్
ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్
బాల్యాన్ని ప్రతిబింబించే రచనలు కనుమరుగవకుండా... పిల్లల హృదయాలను తాకే సాహిత్యాన్ని అందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత రచయితలపై ఉంది. పిల్లల రచయితలే బాలల కోసం రాయడంకంటే ... పెద్దల రచయితలు కూడా ప్రయత్నించాలి. మనందరిలోనూ ఒక పిల్లవాడు దాగి ఉంటాడు. పెద్దల రచయితలకు ఒక అవకాశం ఇవ్వాలి. పిల్లల గురించి, విద్యావిధానం గురించి ఈ రచయితలే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. సమాజంలో మార్పు కోరుతున్న రచయితలు వీళ్లు. వారి రచనలు బాలలకు అందాలి. ఒక వేళ రాయకపోయినా... బాల సాహిత్య రచయితలకు దశ, దిశ చూపగలిగే వేదిక ఉన్నపుడు మంచి రచనలు వస్తాయని భావిస్తున్నా. కేవలం పుస్తక రూపంలోనే కాకుండా... సినిమాకు రేడియో కార్యక్రమాలకు, టీవీలకు రచనలు కావాలి. ఈ నాలుగు మాధ్యమాల్లో ఆలోచించగలిగినపుడే పిల్లలకు మంచి రచనలు అందివ్వగలం. గతంలో రేడియో అన్నయ్య లాంటి కార్యక్రమాలు చాలా పరిమిత సంఖ్యలో అవకాశం ఉండేది. మాతరం వాళ్లు ఆ కార్యక్రమాలు విని స్ఫూర్తి పొందినవాళ్లమే. బాలానంద సంఘంతోపాటు చిన్నచిన్న కల్చరల్ క్లబ్స్ వాటివల్ల నాటికలు నేర్చుకుని పెద్ద కళాకారులుగా ఎదగడానికి తోడ్పడ్డాయి. అయితే ఇప్పుడు పరిధి ఎక్కువై అవకాశాలు అధికంగా ఉన్నాయి... పిల్లల ప్రపంచం చాలా పెద్దది... ప్రతి వీధిలోని పిల్లలకు కూడా బాలసాహిత్యం చేరే అవకాశం ఉండాలి. బాల చెలిమి ముచ్చట్లు ఇది నాల్గవ సెషన్. ఇక్కడికి వచ్చిన రచయితల్లో కొందరు బాల సాహిత్యం రాయకపోయినప్పటికీ... పిల్లల కోసం ఎలా రచనలు ఎలా ఉండాలి అన్నది వారికి ఒక ఆలోచన, ధృక్పథం ఉంటాయి. అలాంటివి బాల చెలిమి ముచ్చట్లలో అందరు రచయితలతో పంచుకునే అవకాశం ఉంటుంది.
గోగు శ్యామల, రచయిత
స్త్రీల జీవిత చరిత్రలు రాయడంలో బిజీగా ఉన్న సమయంలో బాల చెలిమి ముచ్చట్లకు రావడం కొంత ఉపశమనం కలిగించింది. బాల సాహిత్యం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందనే ఇక్కడికి వచ్చాను. ఈ తరం పిల్లలు మాట వినరూ అనే నెగెటివ్ ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి. కానీ సాహిత్య కోణంలో అలోచించినపుడు...ఆ పరిమితి నుంచి బయటికి వచ్చి ఆలోచించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతమున్న సాహిత్యాన్ని మార్కెట్ శాసిస్తోంది. మనం చిన్నపుడు విన్న.. ..చిట్టి చిలకమ్మా వంటివి టీవీల్లో కనిపించడంలేదు. భయంకర శబ్దాలతో యుద్ధం కథలతో వచ్చే టీవీ షోలు పసి హృదయాలను కలుషితం చేస్తున్నాయి. పిల్లల్లో యుద్ధం మైండ్ సెట్‌ను తయారు చేసి... హింసను జీర్ణించుకునే పరిస్థితులు కల్పిస్తున్నారు. మనం ఇంకా రాసే దగ్గరే ఉన్నాం... ఈ జనరేషన్ పిల్లలు విజువలైజేషన్‌కు దగ్గరయ్యారు. ఈ పరిస్థితుల్లో వారికి మనకు మధ్య అంతరం పెరుగుతోంది. ఇది మనకు సవాల్ వంటిది. స్మార్ట్ ఫోన్లు పిల్లల ఆటవస్తువులైన ఈ రోజుల్లో... వారి వేగాన్ని మనమే అందుకోవాలి. తెలుగు సినిమా మోడల్‌తో... హీరోయిజంపైన మన దగ్గర సాహిత్యం ఎక్కువగా ఉంది. నా ఉద్దేశంలో పిల్లల జీవితాల్లో ఒక ఊరు, ఒక సమాజం కనిపించాలి. ప్రస్తుతం మనం... మూసధోరణిలో వెళుతున్నాం. అసలు ముందుగా పిల్లల కోసం ఆలోచించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. బాల చెలిమి లాంటి వేదికల ద్వారా పిల్లలకు దగ్గరయ్యే రచనలు చేపట్టినపుడు ఫలితాలు బాగుంటాయని ఆశిస్తున్నా...
ఆనంద్, చిత్రకారుడు
వయసు ఎగసితేనేమి.. మనసు మాత్రం యవ్వనం.. ఎన్ని వత్సరాలైతేనేమి... పరిమళించదా చందనం అన్న రీతిలో... తాను అనుకున్న లక్ష్యంవైపు అడుగులు వేస్తున్న వేదకుమార్ గారికి.. కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, రచయితలకు నమస్కారం. ఈనాడు పత్రికలో చీఫ్ ఆర్టిస్ట్‌గా పదేళ్లు పనిచేసినప్పటికీ... పిల్లలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో బాలల అకాడమీలో చేరాను. బొమ్మలతోపాటు బాలచంద్రిక పత్రికకు కథలు, కవితలు, గేయాలు రాసేవాడిని. 1986లో వేదకుమార్‌గారితో ఏర్పడ్డ పరిచయం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాలచెలిమి ఒక బ్రోచర్తో ప్రారంభించాం. తర్వాత 16 పేజీల పుస్తకాన్ని తయారు చేశాం. ఆ తర్వాత దాన్ని 32 పేజీలకు పెంచాం. బాల భవన్లో ఉన్నపుడు... పిల్లల కోసం బాలలే రచనలు చేయడంపై కథలు ఎలా రాయాలో వారికి ప్రయోగాత్మకంగా తర్ఫీదు ఇచ్చాను. ఇంట్లో న్యూనతా భావాన్ని, కుల, మతాల వల్ల జరిగే అంశాంతి, సమాజంలో ఇబ్బందుల గురించి కథలు రాశారు. వర్క్‌షాప్‌లో పిల్లలు రాసిన కథలు చూసి చలించిపోయాను. బాలలు అర్థం చేసుకునే స్థాయికి రచనలు చేయాలా... లేదా మనకు తోచింది మనం రాసి ఇదే బాలసాహిత్యం అనుకోవాలా అన్నది రచయితలు ఆలోచించాలి.
పిల్లల తరగతి, వారి శారీరక-మానసిక పరిస్థితులు, అవగాహనాస్థాయిలను పరిగణలోకి తీసుకుని వారికి జ్ఞానాన్ని పెంచే విధంగా రచనలు సాగాలి. పిల్లలను స్కూలు పుస్తకాలకే పరిమితం చేయకూడదు. బాల సాహిత్యంలో బొమ్మలు కూడా తగ్గట్టుగా ఉండాలి. భావ సౌందర్యం ఉట్టిపడేలా... పిల్లల హృదయాలు స్పందించేలా రచనలు జరగాలి. రేడియోల్లో నాటికలు వచ్చినపుడు మనకు ఊహించుకునే అవకాశం ఉండేది. కానీ టీవీలు స్మార్ట్ ఫోన్లు చూసే నేటి తరానికి ఊహించుకునే అవకాశం లేదు. అరేబియన్ నైట్స్ కథలతో స్ఫూర్తి పొంది పిల్లలకు చాలా తక్కువ మాటల్లో ఎలా కథలు చెప్పవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకున్నా... ఆ క్రమంలోనే 'పిల్లలు బొమ్మలు వేయడం ఎలా' అనే పుస్తకాన్ని రచించాను. పిల్లలకు కథలు రాసినపుడు.. చాలా పరిశోధనలు చేసిన రచనలు చేపట్టాలి.. అప్పుడే ప్రయోజనం ఉంటుంది.
దాసరి శ్రీనివాసులు, రచయిత- రిటైర్డ్ ఐఏఎస్
పిల్లలు తమను గుర్తించాలని ఆరాటపడతారు. వాళ్లవైపు చూడకపోతే ఏదో అల్లరి చేసి తమవైపు తిప్పుకుంటారు. ఇవన్నీ పిల్లల లక్షణాలు. ఇవి పెద్దవాళ్లలో ఉంటే చైల్డిష్ అంటాం. బాలలకు ఉండే ఈ లక్షణాలను కలిపితేనే అది బాలసాహిత్యం అవుతుంది. పిల్లల రచనల్లో అవన్నీ లేకపోతే బాల సాహిత్యం కాదు. బాంబేలో ఒక ఫౌండేషన్ వారు దేశావ్యాప్తంగా అన్ని భాషల్లో బాల సాహితీ రచనల పోటీ నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది తెలుగు బాల సాహితీ రచయితలను ఆహ్వానించారు. కథల ఎంపిక జ్యూరీ చైర్మన్‌గా నేను వెళ్లాను. జ్యూరీకి 108 కథలు వచ్చాయి. అందులో 13 ఏళ్ల అమ్మాయి ఒక కథ పంపింది. వచ్చిన ఎంట్రీల్లో ఆ అమ్మాయి అతిపిన్న వయస్కురాలు. వారిలో అతిపెద్ద వయస్కులు 94 ఏళ్ల రచయిత. వారిలో రెడ్డి రాఘవయ్యగారు అనే రచయితకు పురస్కారం లభించింది. ఇక్కడ కూడా అలాంటి కథల పోటీ పెడితే బాగుటుందని నా కోరిక. వైజాగ్‌లో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న రోజుల్లో... పురాతన లైట్ హౌస్ వద్ద ఒక పార్క్‌ను అభివృద్ధి చేశాం. నిర్మాణ సమయంలో విదేశాల్లో మాదిరిగా.. స్థానికుల సలహాలు, సూచనలు తీసుకున్నాం. స్థానిక మానసిక వికలాంగుల పాఠశాల పిల్లలను ఆహ్వానించాం. అక్కడి ఒక ద్వారాన్ని శంఖు ఆకారంలో ఏర్పాటు చేశాం. అందులోంచి ఒక పిల్లవాడు అటు ఇటు తిరుగుతున్నాడు. నన్ను చూసిన 14 ఏళ్ల పిల్లవాడు... 'గురువుగారూ శంఖం అద్భుతంగా ఉంది. లోపలికి వస్తూ పోతే బాగుంది. కానీ వీళ్లు చిన్న విషయం మరచిపోయారు. ఇక్కడ శంఖునాదం కూడా ఉంటే బాగుండేది' అన్నాడు. అలాంటి అమూల్యమైన సలహా ఇచ్చిన పిల్లవాడిని మానసిక వికలాంగుడు అనగలమా... వెంటనే శంఖునాదం ఏర్పాటు చేశాం. తెలివి ఒకడి సొత్తుకాదు. మనం నివసిస్తున్న సమాజాన్ని అర్థం చేసుకోవాలి. పిల్లలకు కథలు చెబితే సృజనాత్మకశక్తి రాదు. వారికి ఆలోచనలు కల్పించలేని స్కూళ్లు, టీచర్లు మనకు ఎందుకు..
ఎస్.శివరామ ప్రసాద్, ప్రముఖ రచయిత ( కలం పేరు వాణిశ్రీ)
సాహిత్యమంతా మదించి పి.హెచ్.డి.లు చేస్తే రచయితలు కాలేరు. కొత్త ఆలోచనలతో సృజనాత్మక శక్తి ఉన్నవాళ్లే రచయితలు అవుతారు. తెలుగు బాల సాహిత్యంలో చక్రపాణిని ఆద్యుడుగా చెప్పుకోవచ్చు.. ఆ రోజుల్లో ఒక రూపాయి ఖరీదు చేసే చిన్న నవలలను ముద్రించి అమ్మేవారు. వాటిని మద్రాసులోని నాగిరెడ్డి ప్రెస్‌లో ముద్రించేవారు. అలా వారిద్దరి అనుబంధం ఉండేది. నాగిరెడ్డి బాల అనే పత్రిక నడిపేవారు. అయితే పిల్లల పత్రిక ఇలాకాకుండా... ప్రతి పేజీలోనూ బొమ్మలుంటే వారిని ఆకట్టుకోగలమని చక్రపాణి సలహా ఇచ్చారు. అలా 1947లో చందమామ పత్రిక మొదలైంది. నేను కూడా చందమామ కథలు చదివే రచయిత అయ్యాను.
ఏలూరులో చదువుకునే రోజుల్లో చందమామ కథల ఏజెంట్ వచ్చి స్కూల్లో పుస్తకాలు పంచేవారు. ఇప్పటికీ ఆ కథలు గుర్తున్నాయి. కథ చదివాక ఆనందించాలి... లేదా ఆలోచన రావాలి.. అప్పుడే కథలు హత్తుకుంటాయని చక్రపాణి చెప్పేవారు. 1956లో పాఠశాలలో చదివే రోజుల్లో ఒకసారి మంగళగిరి విహారయాత్రకు మమ్మల్ని తీసుకెళ్లారు. దానిపై రాసిన వ్యాసం మా స్కూల్ పత్రిక ఉజ్వల భారతిలో అచ్చయింది... అదే నా తొలి రచన. అలా మొదలైన నా ప్రయాణంలో దాదాపు వెయ్యి కథలు రాశాను. 40 ఏళ్లు పైబడినవారే పుస్తకాలు చదువుతున్నారు. యవత చదవడంలేదు... పిల్లలు ఇంగ్లీష్ మీడియం వల్ల తెలుగు పుస్తకాలు చదవడంలేదు. పుస్తకాలను ప్రింట్ చేసుకుంటున్నాం... కానీ మార్కెటింగ్ చేసుకోవడం ఎలా.. ఎవరూ కొనడంలేదు. అటకలపై దాచిపెట్టుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం కూడా రచయితలను ప్రోత్సహించాలి.
వేదాంత సూరి, బాల సాహితీవేత్త
చిన్నప్పటి నుంచి రేడియో వినే అలవాటు ఉంది. ఒక పత్రిక నడపాలని అప్పట్లోనే అనుకునేవాడిని. మూడేళ్ల వయసులోనే రేడియోలో ఒక పద్యం పాడాను. ఇక ఆ తర్వాత నుంచి కథలు రాయడం మొదలు పెట్టాను. పెద్దయ్యాక... కరీంనగర్లో బాలలోకం అనే పత్రికలో చేరాను. ఆ తర్వాత ఉదయం పత్రికలో చేరాను. పిల్లల కోసం ఉదయబాల అని పేజీ పెట్టారు. అక్కడి నుంచి 'మొగ్గ' పేజీ కోసం.. ప్రతిరోజు బాల సాహిత్యం రాశాను. మాస పత్రికలుండే రోజుల్లో ప్రతిరోజు పిల్లల కోసం రాయడం కష్టమైన పనే. అయినప్పటికీ...బాల సాహిత్యానికి ఒక వెలుగు వస్తుందని కష్పపడ్డాను. బాల సాహిత్యం రాసేపుడు... నా మనసు బాల్యంలోకి మారిపోతుంది. అప్పుడే అది సాధ్యమవుతుంది. అలా పదేళ్లపాటు 'మొగ్గ'తో అనుబంధం కొనసాగింది. పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ మొగ్గ కోసం ఆసక్తిగా ఎదురుచూసేవారు. కొన్నేళ్ల తర్వాత బాలల కోసం సొంత పత్రిక 'మొలక' స్థాపించాను. అది నడిపించే పరిస్థితి లేక మరో ఉద్యోగం చూసుకుంటూ నడిపిస్తున్నా. బాల సాహితీవేత్తలకు ప్రభుత్వం చేయూతనిస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి..ముందుగా పెద్దవాళ్లలో మార్పు తీసుకుని రావాలి... అప్పుడు పిల్లల్లో మార్పు కచ్చితంగా వస్తుంది. ప్రస్తుత జనరేషన్ తగ్గ కథలు రాసే రచయితలు లేకపోవడం బాధగా అనిపిస్తోంది..
అవార్డుల కోసమే కథలు రాస్తున్నారు... పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఎవరు రాయడం లేదు. మన అభిప్రాయాలను పిల్లలపై రుద్దుతున్నాం... వారి అభిప్రాయాలను తెలుసుకోవడంలేదు. ఆ పరిస్థితి మారాలి...
దేశపతి శ్రీనివాస్, రచయిత, తెలంగాణ రాష్ట్ర సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి (ఓ.ఎస్.డి)
వేదకుమార్‌గారితో చాలా కాలంగా ఆత్మీయ అనుబంధం ఉంది. మేము ఇద్దరం కలిసి జైబోలో తెలంగాణ సినిమాలో కూడా నటించాం. ఆక్స్‌ఫొర్డ్ స్కూల్ వేదికగా ఆయన నిరంతరం చర్చలు కొనసాగిస్తున్నారు. అందరం గుమిగూడి ఒకచోట చర్చించుకోవడం మంచి విలువగా భావిస్తా.. ఆలోచనలు ఎప్పుడు కూడా చాలా చిన్న పాయగానే మొదలవుతాయి. నోటి నుంచి వెలువడిన మాట... రాసిన అక్షరం వట్టిగనే పోవు. మనం దళితులు, స్త్రీల గురించి ఆలోచిస్తున్నాం... వాళ్ల మాదిరిగానే పిల్లల ప్రపంచం గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడిక్కడ మాట్లాడిన వక్తలందరూ చిన్నపుడు బాలసాహిత్యం చదివినవాళ్లే. చందమామ, బాలచంద్రిక లాంటి పుస్తకాల్లో చూసిన భేతాళుడు లాంటి బొమ్మలు ఇప్పటికీ మనసుల్లో ముద్రపడిఉన్నాయి. కథలు, పాటల్ని మాత్రమే పిల్లలు ఇష్టపడతారు. బాలసాహిత్యమంటే ఎక్కువగా ఈ రెండే. ఎప్పుడైనా స్కూల్ డే ప్రోగ్రామ్స్‌కి వెళ్లినపుడు ఆటల మీద ఉన్న పాటలు పాడే... వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తా..
..... వన్నె వన్నె పురుగు జింగన్న దొరికింది...
అగ్గిపెట్టలో దాచి ఆడుకుంటారంట...
బంతి ఆకును తెచ్చిరీ... దానికి బువ్వాని తినిపిచ్చిరీ...
పుంగిర్లు పూయంగా పూబంతులాడంగా..
ఆటలాడిన పిల్లలూ... వీళ్లు పొడిసేటి నెలపొడుపులూ...
ముక్కు గిల్లే ఆట చక్కని పులిపెర్లు...
చిన్నపుడు మనమంతా ఆడిన ఆటలు ఇంకా గుర్తున్నాయి. ముక్కు గిల్లే ఆటలో పిల్లలను పూలతో పిలుస్తాం. ఇలా పిల్లలను మల్లె పూలతో పిలిచిన పిల్లవాడే.. పెద్దయ్యాక కవి అవుతాడు. పిల్లలు ఆటలు ఆడినపుడే వారిలో పరిశీలనాశక్తి పెరుగుతుంది. ఈ రోజుల్లో విద్య కేవలం మార్కుల కోసం, ధనార్జన కోసం అన్నట్టుగా తయారైంది. విద్య విశాలభావన కోసం లేకపోవడం వల్ల పిల్లలు సంకుచిత భావాల్లో ఉండిపోతున్నారు. నిరాదరణకు గురైన పిల్లలు అసాఘింక శక్తులుగా మారుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కొంతైనా ప్రభావవంతమైన పాత్ర నిర్వహించగలిగానంటే... కొంతైనా బాల సాహిత్యం ప్రభావం కచ్చితంగా ఉంది. అమెరికాలాంటి దేశాల్లోనూ పుస్తకాలు చదవడానికి పిల్లలను ప్రోత్సహిస్తారు. అదే మన స్కూళ్లలో అయితే... చించేస్తారని గ్రంథాలయంలోని పుస్తకాలు పిల్లలకు ఇవ్వరు.
దయ, కరుణ, ప్రేమ, స్నేహం, కలివిడి స్వభావం, సమానత్వ భావన, ధైర్యం, నిజాయితీ లాంటి మౌలిక భావనలు కథల ద్వారా పిల్లలకు కలగాలి. చెడు ఓడిపోతుందన్న విషయం కూడా కథల ద్వారా వారికి అర్థం కావాలి. కనీసం 30 కథలు వచ్చా అని టీచర్లను ఇంటర్వ్యూల్లో అడిగే పరిస్థితి ఉండాలి. టీచర్లకు సబ్జెక్ట్ రాకపోయినా.. కనీసం కథలు చెబితే పిల్లలకు విలువలు వస్తాయి. పంచతంత్ర, కథా సరిత్సాగరం, అరేబియన్ నైట్స్, తెనాలి రామకృష్ణ, అక్బర్-బీర్బల్ లాంటి కథలు నేడు లేవు. మానవపాత్రలకన్నా... పశు,పక్షాదుల పాత్రల్నే పిల్లలు ఎక్కువ ఇష్టపడతారని పంచతంత్ర కథల ద్వారా తెలుస్తోంది. పిల్లల రచనల్లో వాస్తవికతను ఎక్కువగా ఆలోచించవద్దు. కథల్లో ట్విస్టులు పిల్లలు ఇష్టపడతారు. సింహం-కుందేలు లాంటి కథలు... పిల్లలను ఆస్వాదిస్తారు. ఆ అమాయక కుందేలులో పిల్లలు తమను తాము చూసుకుంటారు. టీవీల్లో డోరేమాన్ లాంటివి కాకుండా... దేశీయ సాహిత్యం అందుబాటులోకి రావాలి. యానిమేషన్ ఖర్చుతో కూడుకున్నపని... కానీ పుస్తకాలను సులువుగా పిల్లల వద్దకు చేర్చవచ్చు.. బాల సాహిత్యం... మన సంస్కృతిలో భాగంగా మారాలి. విలువలు, తార్కికశక్తి, ఊహాజనిత శక్తులు, శ్రవణశక్తి వంటివి కథలవల్ల పిల్లల్లో పెరుగుతాయి. నేటి తరం పిల్లల్లో ఉన్న అనేక మానసిక రుగ్మతులకు బాలసాహిత్యం ఒకరకమైన ధైర్యాన్ని ఇస్తుంది. మానవుడికి మౌలిక సంవేదనల గురించి చెప్పగలిగింది.. వివరించగలిగింది... వాటినుంచి వారిని కాపాడగలిగింది... అద్భుతమైన సాహిత్యమవుతుంది. అలాంటి సాహిత్యాన్ని పిల్లలకు వారి భాషలో, వారి స్థాయిలో అందించాల్సిన అవసరం ఎంతైన ఉంది...
ద్యావనపల్లి సత్యనారాయణ, చరిత్రకారులు, ట్రైబల్ మ్యూజియం క్యూరేటర్
మన శరీరంలో ల్యాడ్ (లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్) అనే డివైజ్ ఉంటుందని... 20 వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ( లింగ్విస్టిక్) భాషావేత్త నోమ్ చోమ్స్కీ చెప్పాడు. మన శరీరంలో 30 వేల జన్యువులుంటే... తరతరాలుగా మనం మాట్లాడే భాష (తెలుగు)ను కొన్ని జన్యువులు ఆకళింపు చేసుకుని ఉంటాయని ఆయన అన్నాడు. అందుకే మాతృభాషలో ఏది నేర్పించినా అది తొందరగా వస్తుందని నోమ్ చోమ్స్కీ చెప్పాడు. కాబట్టి రేపటి రోజున ఎలా ఉండాలి విలువలను పిల్లలకు చిన్నప్పటి నుంచే బాలసాహిత్యం ద్వారా నేర్పించాలని అన్నాడు. ప్రపంచంలోని మొట్టమొదటి గ్రంథం రుగ్వేదంలోనూ.. జ్ఞాని సంతోషి అని చెప్పారు. అంటే చిన్పపిల్లలకు జ్ఞానం వచ్చినపుడే సార్థకత ఉంటుంది. వేదాలను అర్థం చేసుకోవడానికి ఆరణ్యకాలు, బ్రాహ్మకాలు, ఉపనిశత్తులు వచ్చాయి. ఉపనిశత్ అంటే దగ్గర కూర్చో బెట్టుకుని జ్ఞానం నేర్పడం... అది కూడా పిల్లలను అలరింపజేస్తూ జ్ఞానాన్ని నేర్పాలి.
పంచతంత్రల్లోని మొదటి కథలో.. .ఒక గురువు దక్షిణభారతదేశంలో గోదావరి తీరానా శిష్యులకు నేర్పించాడని ఉంది. గోదావరి మనదగ్గరే ఉందికాబట్టి... బాల సాహిత్యం ఇక్కడే పుట్టిందనే చెప్పవచ్చు. ఈ పంచతంత్రకథలు మన దేవాలయాల శిల్పాల్లోనూ కనిపిస్తాయి.
బాల సాహిత్యం ద్వారానే మన విలువలను, శౌర్యాన్ని. రాజ్యాన్ని, గౌరవాన్ని కాపాడుకోవచ్చని నమ్మిన ఒక గొప్ప స్త్రీ రుద్రమదేవి. తన తదనంతర రాజ్యాధికారాన్ని తన మనమడైన ప్రతాప రుద్రునికి ఇచ్చింది. రుద్రమదేవి స్వయంగా బాలసాహిత్యాన్ని ప్రతాప రుద్రునికి నేర్పించ ేది. రామప్ప దగ్గర కటాక్షిపురంలో ఊర్లో ఈ శిల్పాలు కనిపిస్తాయి. బాల సాహిత్యంవల్ల ప్రతాపరుద్రుడు గొప్ప రాజు అయ్యాడని చెప్పవచ్చు. ఆటలు, పాటల రూపంలో బాల సాహిత్యం ఉంటేనే మంచిది. పిల్లలకు బాలసాహిత్యాన్ని చేర్చడంలో అనేక సమస్యలున్నప్పటికీ... ప్రయత్నం జరుగుతూనే ఉండాలి.
వక్తల ప్రసంగం అయ్యాక, వారు చర్చించిన అనేక విషయాలపై ఎం.వేదకుమార్ తన భావాలను పంచుకున్నారు...
ఎం. వేదకుమార్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్
రచయితలు మాట్లాడిన కొన్ని విషయాలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టారు. అయితే వీటిలో చాలా విషయాలు ప్రభుత్వానికి తెలిసినవే అయినప్పటికీ... మన కృషి, మన ఆలోచనలతో మనవంతు ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. తెలంగాణ గడ్డపై నుంచి వేల మంది రచయితలు కొన్ని దశాబ్దాలుగా వస్తున్నారు. గడిచిన దశాబ్దంలో చాలా రచనలు వచ్చాయి. చిన్న చిన్న కుగ్రామాల నుంచి యువ రచయితలు వస్తున్నారు. మట్టిమనుషుల... ఆ మట్టి వాసన రచనలు.. తెలంగాణ ఉద్యమానికి అన్వయించి.. తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఎంతోమంది కళాకారులున్నారు. ప్రభుత్వం కూడా వారిని సాంస్కృతిక సారథి ద్వారా ప్రోత్సహిస్తోంది. అయితే మన వక్తలు చెప్పినట్టు... ఎవరూ పట్టించుకోని బాల సాహిత్యాన్ని... ఎవరూ నిరాశ చెందకుండా... సాధ్యమైనంత మంచి సాహిత్యాన్ని తెచ్చే ప్రయత్నం చేద్దాం...
బాల సాహిత్యం - మనం మన ఆలోచనలు అంశంపై జరిగిన బాల చెలిమి ముచ్చట్లలో... రచయిత, సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్‌తోపాటు రచయితలు వాణిశ్రీ, గోగు శ్యామల, దాసరి శ్రీనివాసులు, తిరునగరి వేదాంతసూరి, డాక్టర్ నాళ్లేశ్వరం, ఎస్.రఘు, డాక్టర్ వి.ఆర్.శర్మ, సామిడి జగన్‌రెడ్డి చిత్రకారుడు ఆనంద్, చరిత్రకారులు ద్యావనపల్లి సత్యనారాయణ, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరితో సహా పలువురు బాల సాహితీ అభిమానులు పాల్గొన్నారు.
-
కాలం మారుతోంది... సామాజిక జీవనపరిస్థితులూ మారుతున్నాయి...
రేపటితరమైన పిల్లల ఆలోచనా విధానం కూడా మారుతోంది. ఈ నేపథ్యంలో.. బాలల
సాహిత్యం పేరుతో... అనగనగా అని కథలు మొదలు పెట్టకుండా... పిల్లల్లో మానసిక
పరిణితిని పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని... జూన్ 9న
ఆక్స్‌ఫొర్డ్ గ్రామర్ స్కూల్లో జరిగిన బాలచెలిమి ముడవ ముచ్చట్లు
కార్యక్రమంలో బాల సాహితీవేత్తలు, రచయితలు పేర్కొన్నారు. ఈసారి... 'నేను -
నా రచనా నేపథ్యం' అంశంపై బాలసాహితీ వేత్తలు సమావేశమై చర్చించారు.
ప్రముఖ రచయిత అమ్మంగి వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో... బాలసాహితీ రచయితలు... చంద్రశేఖర్ ఆజాద్, ఐతా చంద్రయ్య, డా.వి.ఆర్.శర్మ, పత్తిపాక మోహన్, కన్నెగంటి అనసూయ, సుజాత, ఆకెళ్ల సుబ్బలక్ష్మి, డా. సిరి, మల్లీశ్వరి, తదితరులు హాజరయ్యారు.
చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ చైర్మన్ ఎం.వేదకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రచయిత, నేషనల్ బుక్ ట్రస్ట్ అసిస్టెంట్ ఎడిటర్ పత్తిపాక మోహన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
బాలచెలిమి ముచ్చట్లలో పాల్గొనడానికి వచ్చిన రచయితలను పరిచయం చేస్తూ... ఎం.వేదకుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఎం.వేదకుమార్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ చైర్మన్
ప్రముఖ రచయిత అమ్మంగి వేణుగోపాల్... బాల చెలిమి మూడవ ముచ్చట్లలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అప్పట్లో... బాల చెలిమికోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ మూడేళ్లపాటు పరిశోధన చేసింది... ఆనాటి పెద్ద రచయితల నుంచి యువ రచయితలకు అందరితో మాట్లాడి, వర్క్‌షాప్‌లు నిర్వహించి.. బాల చెలిమిని నడిపాం. ఎబౌట్ చిల్డ్రన్, ఫొర్ చిల్డ్రన్, బై చిల్డ్రన్ అంశాలతో రచనలు ఉండాలన్నది మా భావన. కుగ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు తప్ప ఏమీలేని బాలబాలికలకు.. రేడియో మాత్రమే వినగలిగే పిల్లలకు అకాడమీ పుస్తకాలతోపాటు అనుబంధంగా పుస్తకాలు అందజేయాలన్నది అకాడమీ ఆలోచన. పభుత్వ విద్యా విధానంలో ఉన్న సమస్యలపై.. ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అదే పాత పద్ధతిలో కొనసాగించాయి. ఈ నేపథ్యంలో మనకున్నపరిమితులకు లోబడి వారికి సప్లిమెంటరీ పుస్తకాలు ఇవ్వాలని ప్రయత్నిస్తాం.
చంద్రేశఖర్ ఆజాద్, బాల సాహితీ రచయిత
నేను 76 నవలలు రాశాను. రేడియోతోపాటు అన్ని ప్రక్రియల్లో నా రచనలు జరుగుతున్నాయి. మా ఇంటి దగ్గర అనేకమంది సామాజిక వర్గాల ప్రజలు ఉండేవారు. అక్కడి ప్రకృతినివారిని గమనిస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత... రచనలు చదవడం మొదలుపెట్టాను. ఒక రచయితగా నిలదొక్కుకోవాలంటే... అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండేదో... ఇప్పుడు అలాగే ఉంది. బాలసాహిత్యం రచనలు నాకు అనుకూలంగా అనిపించాయి. అయితే బాల రచనలను పత్రికలు పెద్దగా పట్టించుకునేవి కావు.... పెద్దల పుస్తకాలు, పిల్లల పుస్తకాలు రాస్తూ ఉండేవాడిని. ఇటీవలి కాలంలో నేను రాసిన 'దారి తప్పిన పిల్లవాడు' అనే నవల రాబోతోంది. బాల సాహిత్యం అంటే అప్పటి పంచతంత్రకథలు, నీతి కథలు అన్నట్టుగా తయారైంది. నేటి జనరేషన్... వాళ్ల చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆటవస్తువులు, భావజాలం మారిపోయాయి. నా రెండేళ్ల మనవడిలాగే అందరూ పిల్లలు సెల్‌ఫోన్ గేమ్స్‌లోనే ఎక్కువ సేపు కాలం గడుపుతున్నారు. ఈ రోజుల్లో డోరేమాన్, ఛోటా బీమ్ కార్టూన్లు ఎక్కువగా చూస్తున్నారు. జెకే రౌలింగ్ లాంటివారు రాసిన నవలను మనం వందలు ఖర్చు పెట్టి కొంటున్నాం. మనం తెలుగులో కనీసం అటువైపు ఆలోచించడంలేదు. పిల్లలకు జీవితం అంటే చెప్పాలి. చెప్పిన చెప్పిన కథలే చెప్పకుండా... పిల్లలతో మమేకం అవ్వాలి. అప్పుడు కొత్త కథలు వస్తాయి. పత్రికలవాళ్లు అడిగారని కథలు రాయొద్దు... రచనల్లో గాఢత, కొత్తదనం ఉండాలి. మనం పరిధిదాటి పిల్లల జీవితాల్లో వెళ్లినపుడు అనేక కథలు దొరుకుతాయి. ముందుగా రచయితలు మారాలి.
కన్నెగంటి అనసూయ, పిల్లల రచయిత్రి
నేను చిన్నపల్లెటూరులో పుట్టాను... అక్కడి ప్రకృతితో గాఢమైన అనుబంధం ఉంది. రోజులో అధిక సమయంలో ఆటలతో గడిచిపోయేది. నా ప్రతి కథలోనూ... నా చిన్నతనం అనుభవాలు కనిపిస్తాయి. స్కూల్లో జరిగిన వ్యాసరచన పోటీల్లో ... రుక్కులు, గోవులొస్తున్నాయి జాగ్రత్త లాంటి పుస్తకాలు బహుమతులుగా వచ్చేవి. ఇంటర్ కాలేజీ పత్రికలో ఆర్టికల్స్ రాశాను. ఒకసారి పుష్కరాలకు వెళ్లినపుడు అక్కడి బ్రాహ్మణులు పొట్టకూటి కోసం పడుతున్న వెతలపై తొలిసారిగా కథ రాశాను. ఏలూరు టైమ్స్ పత్రికలో నా తొలికథ ప్రచురితమైంది. నేను రోజూ కథలు రాయను... తట్టుకోలేని బాధకలిగినపుడు మాత్రమే నా నుంచి మంచి కథ వస్తుంది. ఇక బాలల రచనలు విషయానికొస్తే.... చిన్నప్పటి నుంచే పిల్లల కోసం కథలు రాశాను. గతంలో కంటే ఇప్పుడు బాలల రచనలు పెంచాను. వాళ్లకు కార్టూన్ ఛానెల్స్ పెట్టేసి మన చేతులారా నాశనం చేస్తున్నాం. సుమారు 3 వందల బాల సాహిత్యం కథలు రాశాను. గ్రామాల్లో ఉన్న పిల్లలకు... ప్రపంచంలో ఎన్ని వసతులున్న పిల్లలకు తీసిపోకుండా.. బాలసాహిత్యం అందించే అవకాశం మనకు ఉంది. దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాం. ఏడు ప్రచురణల తర్వాత ఆపివేయడం జరిగింది. బాలచెలిమి పునరుద్ధరణలో భాగంగా ఇది మూడవ ముచ్చట. ఇప్పటి వరకు పిల్లలకు రాయని రచయితలు, మేథావులు, ప్రొఫెసర్లు లాంటి వారికి ప్రోత్సహించే వేదికగా ఉండాలన్నది మా భావన. బాలచెలిమి పత్రిక కోసం నెలకు ఒక కథ ఇవ్వడానికి ప్రముఖ కవి అమ్మంగి వేణుగోపాల్ సమ్మతించడం సంతోషంగా ఉంది. తెనాలి రామకృష్ణుడు, అక్బర్ బీర్బల్, ముల్లా నసీరుద్దీన్ మాదిరిగా ఈ దక్కన్ ప్రాంతం నుంచి ఒక క్యారెక్టర్‌కి క్రియేట్ చేసి అమ్మంగిగారు కథలు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పిల్లల పుస్తకాలను.. పెద్దలు కూడా ఎక్కువగానే చదువుతారు. మా అమ్మగారు కూడా... ఆఖరిశ్వాస వరకు చందమామ చదివారు. పిల్లల పత్రిక అంటే... ఒకటే మూస ధోరణిలో రచనలు ఉండాలన్నది చిల్డ్రన్స్ అకాడమీ ఆలోచన కాదు. అన్ని రకాల ప్రయోగాలు చేస్తూ... సంతులనం పాటిస్తూ.. మన పరిస్థితులను బట్టి... ఎలాంటి సాహిత్యాన్ని పిల్లలకు అందజేయాలి...దానిపై అకాడమీ ప్రయత్నం చేస్తోంది.
బాలచెలిమి ముచ్చట్లలో.. ..ముందుగా.. సిద్ధిపేటకు చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త
ఐతా చంద్రయ్య... తన రచనల ప్రస్థానాన్ని వివరించారు.
ఐతా చంద్రయ్య, బాల సాహితీ వేత్త
నేను సిద్ధిపేటలోని జేబీఎస్ పాఠశాలలో 6వ తరగతిలో ఉండగా.. బ్రహ్మయ్య అనే ఉపాధ్యాయుడు... రచనలవైపు ప్రోత్సహించారు. ఆయన చొరవతోనే స్కౌట్స్‌లో చేరి తొలిసారిగా స్కౌట్స్‌పై ఓ గేయం రాశాను. నా గేయం ప్రచురణ, సార్ ప్రోత్సాహంతో రచనలపై ఆసక్తి పెరిగింది. హై స్కూల్లోనూ మా టీచర్ ప్రోత్సాహంతో చిన్నచిన్న పద్యాలు రాయడం ప్రారంభించాను. కథలు రాస్తున్న క్రమంలో.... మన తెలంగాణ బాల సాహితీవేత్తలు తక్కువ అనే అప ప్రథ వచ్చింది. అంతకుముందు నుంచే నేను బాల సాహిత్యం చదవడం వల్ల... బాల సాహిత్యం రాయడం ప్రారంభించాను. నా రచనలు బాల భారతం, చందమామలో వచ్చినయి. నేను కథలు సంపుటితాలు, గేయ సంపుటితాలు రాశాను. వీటితోపాటు 18 మంది తెలంగాణ యోధుల జీవిత చరిత్రలు రాసినాను. అవి త్వరలోనే వస్తున్నాయి. అందులో సీఎం కేసీఆర్ చరిత్ర కూడా రాశాను. ఎన్.బి.టిలో ఇంతకుముందు తెలంగాణ వాళ్లకు అవకాశం దక్కేది కాదు... మోహన్ గారు వచ్చాక అది సాధ్యమైంది. వారు పంపిపన హిందీ బాల సాహిత్యాన్ని తెలుగులోకి అనువందిచాను. సిద్ధిపేటలో ప్రస్తుతం డజనుకుపైగా బాల సాహిత్య రచయితలున్నారు. వారిని చూస్తుంటే నాకు సంతోషం కలుగుతోంది.
సుజాత, బాల సాహిత్య రచయిత్రి
నా పదహారవ ఏట ఒక నవలతో రచనా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. 'వెన్నెల వాన', 'చింతనీకేలా' నా తొలి నవలలు... ఆ తర్వాత నవలల జోలికి నేను వెళ్లలేదు. ఆతర్వాత రాసిన కథలకు మంచి స్పందన వచ్చింది. అవి పది భాషల్లో అనువాదం అయ్యాయి. బాలలకు ఎలాంటి విషయాలు చెప్పాలి... వాళ్లు ఏం అర్థం చేసుకోవాలలి.. వాళ్లకు ఏమి తెలియాలి.. అసలు టీచర్లు ఎలా ఉండాలి అనే అంశాలతో 15 రోజులపాటు అప్పట్లో శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. అప్లికేషన్‌తోపాటు.. మా అమ్మాయికి వచ్చిన ఆలోచన నుంచి రాసిన పాట పంపాను....
అమ్మా ఈ రైలు బండి అసలెక్కడ పుట్టిందే...
అన్నమెవరు పెడ్తారే...
అమ్మా ఈ రైలు బండి అసలెక్కడ పుట్టిందే..
ఆ పాట... నా తమ్ముడి మిత్రుడి సహాయంతో విశాలాంధ్రలో ప్రచురితం అయింది.
అక్కడికి వచ్చిన రచయితల భావాలు నాలో మార్పును తెచ్చాయి. ఆ తర్వాత నేను పిల్లలు, పెద్దలకు రచనలు చేశాను. అక్కడి నుంచి చేపలు, పరిహారం, వేకువ రేఖలు కథల పుస్తకాలు వచ్చాయి. నా పాటలు రేడియోల్లో వచ్చేవి... అవే పుస్తకాలుగా కూడా వచ్చాయి. కిన్నెర లలితగీతాలు... వంటివి వచ్చాయి.. నా కథలకు ఎన్.సి.ఆర్.టి.ఇ నుంచి కూడా బహుమతులు వచ్చాయి.
ఆకెళ్ల సుబ్బలక్ష్మి, బాలల రచయిత
చిన్నపుడు మా ఇంటిపక్కన రాజుల కుటుంబాలు ఉండేవి. వారి ఇంటికి వెళ్లినపుడు... చందమామ పుస్తకం చదివాను... అలాంటి కథలు రాయాలనిపించేది. ఆరోజుల్లో వచ్చే డిటెక్టివ్ నవలలో మొదటిసారి నేను రాసిన జోక్ అచ్చయింది. దానికి 5 రూపాయలు బహుమతి కూడా ఇచ్చారు. అక్కడి నుంచి ఐదేళ్లపాటు ఆ పుస్తకంలో క్విజ్లు, ఫజిల్స్, లాయర్ సలహాలు సమాధానం ఇచ్చాను. విజయబాపినీడు గారి విజయ పత్రికలో 'పాపం సంధ్య' రాశాను. ఒకటి రాస్తే మరొకటి రాయలేమనుకుంటారు గానీ... నేను స్పందించే విధంగా అంశం నచ్చితే కథలు, కవితలు, బాలసాహిత్యం రాశాను. శత్రువు ఆట అనే పిల్లల కథకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత పిల్లల పత్రిక బొమ్మరిల్లులో కథలు రాశాను. అప్పటి చందమామ నుంచి ఇప్పటి నాని పత్రికల్లో నా కథలు ప్రచురితం అయ్యాయి. నా రచనల వల్ల పిల్లలకు, బాల కథా రచయితలకు ఎంతోకొంత ప్రయోజనం ఉండాలని..'బాల గోకులం' అనే సంస్థ ఏర్పాటు చేశాం. అందులో పిల్లలకు కథల పోటీలు పెట్టేవాళ్లం. కథా రచయితలకు 'బాల నేస్తం' అనే బిరుదు ఇచ్చేవాళ్లం.
అమ్మంగి వేణుగోపాల్, కవి - రచయిత
బాల సాహిత్యం రాసేవాళ్లు చాలా సవాళ్లు ఎదుర్కొంటారు. ముందుగా పెద్దల రచనల చేసినవాళ్లు ఆ తర్వాత బాల సాహిత్యం రాసినపుడు... ..రచయితలకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. పిల్లలస్థాయికి దిగి రచనలు చేయడం పెద్ద సవాల్. దాదాపు అందరు రచయితల మాదిరిగానే నేను చందమామ నుంచే క్రియేటివిటీని, చదివే శక్తిని నేర్చుకున్నా. కొన్ని విలువలను మనం బాలల సాహిత్యం నుంచి నేర్చుకుంటాం. పిల్లల పనులు కూడా తెలివితక్కువగా ఉంటూ ... సాహసోపేతంగా ఉంటాయి. నేను చిన్నపుడు... చందమామ వంటి కథలతో ప్రేరేపితమై 'రాజు కథ' అనే కథ రాశాను. బాలచెలిమి కోసం వేదకుమార్గారి విజ్ఞప్తి మేరకు కథలు రాసే పనిలో ఉన్నాను. డోరేమాన్ లాంటి కార్టూన్లకు పిల్లలు అడిక్ట్ అయి ఉన్నారు. వాటిలో కథలు సైంటిఫిక్‌గా చాలా పెద్దగా ఉంటాయి. మరి చిన్న పిల్లలకు అంతపెద్ద సైంటిఫిక్ కథలు అవసరమా అనిపిస్తూ ఉంటది. అలాంటి వ్యవసానాల నుంచి బాల చెలిమి లాంటి పుస్తకాలు డైవర్ట్ చేయగలిగేలా ఉంటే బాగుంటుంది. బాలచెలిమిలో ప్రచురితమైన కథలపై పిల్లల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటే బాగుటుంది. ఇంగ్లీష్ బాల రచనలు కూడా పరిశీలించాలి. కొత్తయుగంలో నడిచే పత్రికలు చందమామలా ఉంటే నడవదు. ఐ.క్యూ, జనరల్ నాలెడ్జికి సంబంధించిన అంశాలు కూడా ఉండాలి.
డా. సిరి, బాలల రచయిత
బాల సాహిత్యమంటే.. పిల్లల కోసం ఏదో రాస్తుంటారు అని బయట చెప్పుకుంటారు. పిల్లలు ప్రయోజకులు అవాడానికి ఏది ఉపయోగపడాలో దాని గురించి రాస్తుంటారు. పిల్లల కోసం రచనలు చేయడం చిన్న అనుకుంటారు.. ..కానీ అనుభవంలో అది పెద్ద విషయమే. మనం రాసే రచనలు అందరూ పిల్లలకు అందుతున్నాయా అన్నది అనుమానమే. బాల సాహిత్య రచన అక్షరాల రూపంలో మనం కూడబెట్టిన ఆస్తి... అమ్ముడుపోని పుస్తకాల కట్టలో మిగిలిపోతోంది. తెలుగులో రచనలు చేస్తే... చాలా మంది ఇంగ్లిష్‌లో చేయండి... బాగా అమ్ముడు పోతాయాని సలహా ఇస్తుంటారు. అసలు మన మాతృభాషలో రాస్తే మన పిల్లలు ఎందుకు చదవరు. తల్లిదండ్రులు మాతృభాషను ఎందుకు ప్రోత్సహించరు. దీనిపై రచయితలు, ప్రచురణకర్తలు ఆలోచించాలి.
మల్లీశ్వరి, బాల సాహితీ రచయిత
బాల సాహిత్యమంటే... ఈ రోజుల్లో అందరూ కథల సాహిత్యమనే అనుకుంటున్నారు. కథ అంటే.. అనగనా ఒకప్పుడు... ఒకానొకప్పుడు.. అని చెబుతుంటారు. కథను ఆ రోజుల్లో అని చెప్పడం బాగానే ఉంటుంది. కానీ ప్రతీది అలా చెప్పడం బాగాలేదు. చలంగారు అన్నట్లు... పెద్దలే పిల్లల పట్ల వినయంగా, విధేయంగా ఉండాలి. వాళ్లను రిస్ట్రిక్ చేయడంవల్ల.. వాళ్ల ఊహల్ని ఆపేస్తుంటాం. కోపాలు, వైషమ్యాలు, ఉద్రేకాలు చోటుచేసుకుంటున్న ప్రస్తుత రోజుల్లో సంయమనం చాలా అవసరం. దీనికోసం పిల్లల్లో ఉండే రకరకాల భావాలను గుర్తిచగలగాలి. మా పెరట్లో పిచ్చుకల గూటిలో గుడ్లు తొలగించడాన్ని ప్రశ్నించిన మా అబ్బాయి ఆలోచనలోంచి 'ఎవరు చెప్పినా వినాలి' అనే కథను రాశాను. కథల రూపంలో నీతిబోధ తరతరాలుగా జరుగుతూనే ఉంది. కానీ ప్రయోజనం అయితే ఇప్పటి వరకు నాకు కనిపించలేదు. చిన్నపిల్లల్లో ఆలోచనాపరమైన కదలికలను తీసుకుని రాగలిగితే.. ప్రయోజనం ఉంటుంది.
డాక్టర్ శర్మ, బాల సాహితీవేత్త
రచయితల సహాయ, సహకారాలతో ప్రతి నెల బాలచెలిమి ఇలా వికసిస్తూ ఉంటుంది. అందరూ రచనలు చేస్తూ ఉన్నాం.. ..కానీ ప్రచురణకు సంబంధించి కవర్ పేజీ, అక్షరాలు స్టైల్ వంటి సాంకేతిక విషయాలు ఎవరికీ సరిగా తెలియదు. వీటికి శిక్షణా తరగతులు పెట్టాలన్నది నా విజ్ఞప్తి. దానివల్ల అందరికీ తెలుస్తుంది. మనం అచ్చు వేసే పుస్తకాల్లో కనీసం 30 శాతం స్కూలు పిల్లలకు ఉచితంగా అందిస్తే బాగుటుందని నా ఆలోచన. బాలచెలిమికి అందరికీ సలహాలు, సూచనలు ఆహ్వానిస్తున్నాం. ఇతర భాషల్లో బాల సాహిత్య రచనలు ఎలా ఉన్నాయో పరిశోధనలు కూడా చేయాలి... అప్పుడు మన ఆలోచన విస్తృతమవుతుంది.
ప్రముఖ రచయితలతోపాటు... పలువురు యువ రచయితలు కూడా... తమ రచనా అనుభవాలను...బాలచెలిమి ముచ్చట్లలో పంచుకున్నారు.
-
భావి సమాజానికి విలువలతో కూడిన పౌరులను అందించాలంటే... అది బాల్యం
నుంచే సాధ్యమవుతుంది. అలాంటి విలువలను బాల్యం నుంచే నేర్పడంలో బాలల
సాహిత్యం ముఖ్యమైనది. ఇదే క్రమంలో... నేటితరం పిల్లలను ఆకట్టుకునేలా కొత్త
ఒరవడిలో 'బాల చెలిమి పత్రిక' త్వరలో వెలువడనుంది. ఈ నేపథ్యంలో... గత నెల
ఏప్రిల్ 2న అంతర్జాతీయ పిల్లల పుస్తక దినోత్సవం రోజున హైదరాబాద్
హిమాయత్‌నగర్‌లోని ఆక్స్‌ఫొర్డ్ గ్రామర్ స్కూల్లో 'చిల్డ్రన్స్
ఎడ్యుకేషన్ అకాడమీ' ఆధ్వర్యంలో 'బాల చెలిమి ముచ్చట్లు' పేరుతో తొలి చర్చా
కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి కొనసాగింపుగా మే 12న.. 'బాలల
సాహిత్యం - రచన - సవాళ్లు' అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. బాల చెలిమి
పత్రి ప్రచురణతోపాటు... ఇలా ప్రతినెల రెండో శనివారం బాలల సాహిత్యంపై ఇలాంటి
కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
'చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ' చైర్మన్ యం. వేదకుమార్ ఆధ్యక్షతన... మే 12న జరిగిన 'బాలల సాహిత్యం - రచన - సవాళ్లు' కార్యక్రమంలో ప్రముఖ బాల సాహితీవేత్తలు డా. వి.ఆర్.శర్మ, పైడిమర్రి రామకృష్ణ, దాసరి వెంకట రమణ, వేదాంతసూరి, డా. కందెపి రాణీ ప్రసాద్, పుట్టగంటి సురేష్, డా. పత్తిపాక మోహన్, డా. బెల్లంకొండ సంపత్, డా.రఘు, గరిపల్లి అశోక్, అనిల్ బత్తుల, చొక్కపు వెంకట రమణ, డా.సిరి, తిరునగరి, పెండెం జనార్దన్, రాజా వాదిరెడ్డి మల్లీశ్వరి, జుగాష్ విల్లీ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
వి.ఆర్.శర్మ, బాల సాహితీ రచయిత
బాలల సాహిత్య రచనలు చేయాలంటే... అసలు ముందుగా బాల్యం గురించి లోతుగా తెలుసుకోవాలని... దీనిపై అధ్యయనం చేయాలని బాల సాహితీ రచయిత వి.ఆర్.శర్మ అన్నారు. ఆసిఫాలాంటి ఘటనలు జరిగినపుడు... బాలల రచయితపై ఎలాంటి బాధ్యతలు ఉన్నాయో ప్రశ్నించుకోవాలో అని శర్మ సూచించారు.
బాల సాహిత్యం - సవాళ్లు ప్రశ్న వేసుకున్నప్పుడు... అసలు ఈ రోజుల్లో బాల సాహిత్యం లక్ష్యం ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. వందేళ్ల క్రితం పాశ్చాత్య రచనల ప్రభావంతో... మనదేశంలో బాల సాహిత్య రచనలు ప్రారంభించుకున్నప్పుడు ఆనాటి సమాజ అవసరాలు, పరిస్థితుల మేరకు సూత్రీకరణలతో రచనలు చేశారు. కానీ ప్రస్తుత సమాజం అలా లేదు. అప్పట్లో రచయితలు ఆర్థికంగా, సమాజంలో ఉన్నతవర్గాల వారు తాము చూసిన, అనుభవించిన బాల్యాన్ని, పాశ్చాత్య రచనల ప్రభావంతో బాల సాహిత్యాన్ని అందించారు. కానీ నేటి బాల్యం చాలా మారింది. ఇప్పటికీ అదే పాత్ర సూత్రాలతో బాల సాహిత్యాన్ని రచించడం ఎంతవరకు సమంజసమైనదనేది మొదటి ప్రశ్న. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం. అసలు బాల్యం ఎక్కడ మొదలై ఎక్కడ అంతమువుతుందీ అనుకుంటే... పాత సూత్రీకరణలన్నీ ప్రస్తుత పరిస్థితులకు వర్తిసాయా.. అనే చర్చ జరగాలి. పెద్దలకు ఏది మంచిదో... పిల్లలకు అదే మంచిది... పిల్లలకు ఏది చెడ్డదో.. పెద్దలకు కూడా అదే చెడ్డదే.. ఇలాంటి విషయాలపై విస్రృతంగా చర్చించాలి. నేటి బాల్యాలు... విద్య, తిండి, యుద్ధాలు, అత్యాచారాలు వంటివి ప్రభావితమై ఉన్నాయి. నేటి బాలలపై జరుగుతున్న అకృత్యాలపై స్పందించాల్సిన బాద్యత రచయితలపై ఉందని భావిస్తున్నా. పిల్లలకు కేవలం నీతి కథలేకాకుండా.. ప్రస్తుత సమాజం గురించి కూడా పరిచయం చేయాల్సిన విషయంపై చర్చ జరగాలని కోరుకుంటున్నా. ఆనాటి రోజుల్లో పూర్ణమ్మ లాంటి కథలు రాసి గురజాడ ఎందరిలో ఆలోచింపజేశాడు..... మరి ఈ రోజుల్లో బాల రచయితలకు ఎందుకు స్పందన ఉండటంలేదు.. నేటి బాల్యంపై ఉన్న ఒత్తిళ్లపై కూడా రచనలు జరగకపోవడం ఒక సవాలుగా పరిగణించాలి. మనదేశంలో బాలసాహిత్యం చిన్న చూపు చూడబడుతోంది... కానీ పాశ్చాత్య దేశాల్లో హ్యారీపోటర్ లాంటి కథలు ... సినిమాలుగా తెరకెక్కి అందరినీ ఆకర్షించి కోట్లు కొల్లగొడుతున్నాయి. మరి మన దగ్గర మన కథలు... పిల్లల్ని మరింతగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. రచయితలు కూడా తరుచూ సమావేశమై చర్చిండం ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవచ్చు.. పిల్లలకు బాల సాహిత్యాన్ని మరింత దగ్గర చేసేందుకు బాల చెలిమి తరపున జరిగే జిల్లా పర్యటనల్లో అందరూ తమవంతుగా తరలిరావాలి. చిత్తశుద్ధితో బాల్యాన్ని రక్షించుకునేందుకు బాల రచనలు చేద్దాం....
యం.వేదకుమార్, బాల చెలిమి ప్రధాన సంపాదకులు
చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అకాడమీ ద్వారా.. బాల సాహిత్యాన్ని సంబంధించిన విజ్ఞాన్ని ప్రచురుస్తిన్నామని.. బొమ్మలతో కూడిన వినోద, విజ్ఞాన పుస్తకాలను విరివిగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని... అలాగే దృశ్య, శ్రవణ పద్ధతిలో కూడా బాలల సాహిత్యాన్ని, రచనలను అందుబాటులోకి తెస్తున్నామని.. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ చైర్మన్, బాల చెలిమి ప్రధాన సంపాదకులు యం. వేదకుమార్ అన్నారు.
ముద్రణ, దృశ్య, శ్రవణ మార్గమాల ద్వారా పిల్లలకు ఎంతమంచి సాహిత్యాన్ని అందివ్వగలమో.. అంత ప్రయత్నం చేస్తాం. ఈ మధ్యనే ఆక్స్‌ఫొర్డ్ గ్రామర్ స్కూల్లో రేడియో కార్యక్రమాలను నిర్వహించాం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా బాల సాహిత్యాన్ని పిల్లలకు మరింత దగ్గర చేయొచ్చు. ప్రస్తుత చర్చలో పాల్గొన్న అనేక మంది రచయితల సహాకారంతో అకాడమీ ద్వారా బాల చెలిమి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. బాల చెలిమి కేవలం ఒక పత్రికగానే మిగిలిపోకుండా... జిల్లాకు ఒక పత్రిక వచ్చి... బాల చెలిమి ఒక వేదికలా మారాలి. ముందుగా తెలుగువారికి బాల చెలిమిని అందించే ప్రయత్నం జరుగుతోంది. బాల సాహితీ రచనలు చేసి... సమాజానికి అందుబాటులోకి తేలేకపోతున్నవారికి కూడా... బాల చెలిమి వేదికగా పనిచేస్తుంది. అలాగే ప్రతినెల రెండో శనివారం సాయంత్రం... బాల సాహిత్యం గతం, వర్తమానం, భవిష్యత్తుపైనే చర్చలు నిర్వహిస్తాం. అందరినీ ఒకేసారి కాకుండా... బాల సాహితీ రచనల్లో నిష్ణాతులైన వారిని ప్రతినెల చర్చకు ఆహ్వానిస్తాం. వారు చర్చల్లో పాల్గొంటారు. ప్రతి నెలలో జరగాల్సిన చర ్చ అంశంపై ముందుగానే ఒక నిర్ణయానికి వస్తాం. దీంతోపాటు... రాబోయే రోజుల్లో ప్రతినెలలో ఒక రోజు బాల సాహిత్య పుస్తకాలను తీసుకొని ఒక బస్సులో జిల్లాల్లో పర్యటిస్తాం. మా వద్ద ఉన్న దృశ్య, శ్రవణ కథలను ప్రొజెక్టర్ల ద్వారా పిల్లలకు చూపిస్తాం. అక్కడి బాల సాహితీ రచయితలకు తమ ఆలోచనలు పంచుకోవడానికి ఒక వేదిక కల్పిస్తాం. వారి రచనలు ముద్రించుకోవానికి ముద్రణా సంస్థల ద్వారా సహకారం అందిస్తాం. వీటితోపాటు... ప్రతినెలలో ఒకరోజు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి... రచయితల సహకారంతో పిల్లలకు కథలు చెప్పడం... రంగస్థలం గురించి చెప్పడం... పిల్లల సినిమాలు చూపించడం... గేయాలు పాడించడం.. వారిలో సృజనాత్మకత వెలికితీసేలా రచనలు చేయించడం వంటివి నిర్వహించబోతున్నాం... బాల చెలిమి ముచ్చట్లకు... నగరంలో జరిగే కార్యక్రమాలకు... జిల్లాల్లో పర్యటనలను ఎవరెవరు నిర్వహించాలో ఓ కమిటీ ఏర్పాటు చేసి వాటి కార్యక్రమాలు చేపడదాం... చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అకాడమీ, బాల చెలిమి ప్రయత్నాలతోపాటు.... అసరమైతే ప్రభుత్వానికి కూడా సూచనలు చేసి సహాయం తీసుకుంటాం...
డా. ఎస్.రఘు, బాలసాహితీవేత్త
బాల చెలిమి అనేది ... రేపటి తరం వారికి మానవీయ విలువలకు చెలిమిలా నిలబడాలని కోరుకుంటున్నాం. నిశ్శబ్దంగా... వేదకుమార్ గారు... బాల చెలిమి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ ప్రయత్నంలో మేమంతా తప్పకుండా భాగస్వామ్యవులవుతున్నాం.. బాల సాహిత్య- రచనలు- సవాళ్లు అనే విషయంలో... ఇంకా అనేక పాత కథా వస్తువులనే తీసుకుంటున్నాం... అదే రాజులు, అడవి, పల్లెలు అంశాలతో పాత పద్ధతుల్లోనే కొత్త కథలు చెబుతున్నారు. అలాకాకుండా... ప్రస్తుతం పిల్లల చుట్టూ ప్రపంచం మారుతోంది. సమకాలీన అంశాలపై ... వారి చుట్టూ జరిగే అంశాలు... వారికి పరిచయమైన వాతావరణంలోంచి కథలు వస్తే బాగుంటుంది. అప్పుడు వారు తొందరగా కథలపట్ల ఆకిర్షతులయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా హాస్యాన్ని, వ్యంగాన్ని కూడా చేరిస్తే మరింత ప్రయోజనకరం. ఇలాంటి కొత్త ప్రక్రియల వల్ల పిల్లలు బాల సాహిత్యం పట్ల ఆకర్షితులవుతారు.
బెల్లంకొండ సంపత్‌కుమార్, బాల సాహితీ వేత్త
బాల సాహిత్యం లేకుండా పెద్దల సాహిత్యమనేది ... పునాది లేకుండా ఇల్లు కట్టడం వంటిదేనని... ప్రముఖ బాల సాహితీ వేత్త బెల్లంకొండ సంపత్‌కుమార్... బాల చెలిమి ముచ్చట్ల సందర్భంగా అన్నారు...
బాల సాహిత్య రచనలు చేసేటపుడు... అసలు బాలలు అంటే ఎవరూ అనేది స్పష్టత ఉండాలి. వారికి చేసే రచనలు వారిని ఏ దిశకు తీసుకెళతాయిన్నది ముఖ్యం. బాల సాహిత్య రచనల్లో ఇలాంటి సవాళ్లు ప్రాథమికస్థాయిలోనే ఉంటాయి. పిల్లల ఆలోచనలు... నర్సరీ క్లాసుల్లో ఒక మాదిరిగా.. .. 5వ తరగతి వరకు మరో రకంగా... ఆ పైన ఇంకో రకంగా ఉంటాయి. ఇక ఇంటర్ చదివే విద్యార్థులు అటు చిన్నవారు కాదూ... అటు పెద్దవారు కాదు. పదో తరగతిలోపు పిల్లలను విలువలు నేర్పించగలిగితే ఆ తర్వాత వారి భవిష్యత్తు బాగుంటుంది. ఇంటర్మీడియెట్ చదివే వారికి కూడా బాలసాహిత్యం ద్వారా విలువల గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పిల్లల స్థాయిని బట్టి బాల చెలిమి రచనలు అందిస్తే మేలు. పిల్లల వయసుకు తగ్గట్టుగా రచనలు అందించకపోగా... వారిపై అదనపు భారం మోపితే... వారి ఆలోచనా విధానం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చిన్న పిల్లలకు రైతు పోరాటాలు - పోలీసుల యాక్షన్ గురించి చెబితే... వారి ఆలోచనలపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంది. బాల సాహిత్యం రచన- సవాళ్లలో వీటన్నింటిని పరిగణలోకి తీసుకోవాలి. నేటి తరం పిల్లలపై సెల్ఫోన్లు, టీవీల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. వాటి మోజులో పడి పిల్లలు ఎదురుతిరిగే స్వభావాన్ని అలవరచుకుంటున్నారు. వారు బాహ్య ప్రపంచానికి దూరమవుతున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల అతి ప్రేమవల్లే అనేక అనర్థాలు జరుగుతున్నాయి. అతి సున్నితమైన విషయాలను పిల్లలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. సమాజంలో ఇలాంటివన్నీ బాల సాహిత్య రచనల్లో సవాళ్లుగానే భావించాలి. పిల్లల్లో వ్యక్తిత్వ నిర్మాణంలో కీలకమైన పరిస్థితిని కల్పించాలి. అలాంటి రచనలు చేయడం వల్ల ఓ లక్ష్యం కోసం పనిచేసిన వాళ్లమవుతాం. అలాంటి కీలకమైన బాధ్యత బాల చెలిమి తీసుకుంటే మంచిది. ఇలాంటి గురుతరమైన బాధ్యత బాల చెలిమిపై ఉందని భావిస్తున్నా. నేటి తరం పిల్లల్లో శ్రమను గౌరవించే తత్వం పోతోంది. వారికి శ్రమ విలువ తెలియడంలేదు. బాల సాహితీ రచయితలు ఈ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలిపేందుకు... పెద్దలకు కూడా ఓ వర్క్‌షాప్ అవసరమే. అదే సమయంలో విలువలను నేర్పడంలో వారికి కూడా వర్క్‌షాప్ లాంటివి నిర్వహించాలి. పిల్లల్లో సృజనాత్మకత పెంపునకు కొన్ని పత్రికలు ప్రయత్నం ప్రారంభించి... ఓ దశ తర్వాత వదిలేశాయి... వాటిని మరింత మెరుగుపరచి వారి ఆలోచనల్ని మరింత పదును పెంచాలి. అలాంటి ప్రయత్నాలతో బాలచెలిమి మరింతగా పిల్లలను ఆకట్టుకోగలుగుతుంది. బాల సాహిత్య రచనల పట్ల అమితాసక్తి ఉన్నవారు బాలచెలిమికి పనిచేయడం సంతోషంగా ఉంది.
రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, బాల సాహితీవేత్త, తెలుగు ఉపాధ్యాయురాలు
32 ఏళ్లపాటు తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ... రాబోయే తరం పిల్లల్లో ఏం తక్కువుందనేది గమనిస్తూ వచ్చాను. ఆ తర్వాతే బాల సాహిత్యం మొదలుపెట్టాను. కథలు, గేయాలు, కవితలు ఏం చదవాలన్నా ముందు భాష తెలియాలి. చిన్నపుడు మనకు ఇళ్లలో పద్యాలు, పొడుపుకథలు, సామెతలు చెప్పేవారు. అవే కథలు తరగతిగదిలో అర్థాలు తెలుసుకుని ఆనందించేవాళ్లం. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. సిలబస్ పూర్తిచేయడానికి టీచర్లకు సమయం సరిపోవడంలేదు. ఈ రోజుల్లో పిల్లలకు భాష తెలియడంలేదు. అలాంటపుడు... వారు కథలు, గేయాలు ఎలా తెలుసుకోగలరు. వారికోసం రాసిన సాహిత్యాన్ని ఆనందించలేరు. తెలుగు భాష అంటే ఆసక్తి పెరగడానికి కారణం వెతకాలి. చిన్న చిన్న వాక్యాల్లో తెలుగు నేర్పించి భాషపై ఆసక్తిని పెంచాలి. అప్పుడు మాత్రమే వారు కథలు, గేయాలు చదివినా ఆనందిస్తారు. బాల సాహిత్యంలో గేయాల రూపంలో నేను రచనలు చేశాను. పాశ్చాత్య రైమ్స్ వారి దేశాల పరిస్థితులకు అనుగుణంగా రాసుకున్నవే. దురదృష్టవశాత్తూ... మన దేశ పరిస్థితులకు తగ్గ చిన్నచిన్న రైమ్స్ ఇప్పటికీ రావడంలేదు. పిల్లలస్థాయిని బట్టి రచనల్లో పదజాలం ఉండేలా రచయితలు దృష్టిలోపెట్టుకోవాలి. నేటి పత్రికల్లోనూ... బాలల కోసం మొక్కుబడిగా కథలు, గేయాలు వేస్తున్నారే తప్ప... వారి భాష పరిజ్ఞాన్ని పెంచే ప్రయత్నం కనబడటంలేదు. భాషలేనపుడు సాహిత్యమేరాదు... ఒక రచయిత అయినా...ఉపాధ్యాయుడైన వినూత్నంగా ఆలోచించి దాన్ని పిల్లల్లోకి తీసుకెళ్లగలగాలి. బాలల కోసం ఎన్ని రచనలు చేసినా... వారి వద్దకు తీసుకెళ్లగలగడం చాలా కష్టమైన పని... అలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వేదకుమార్ గారికి అభినందనలు. చిట్టి చిలకమ్మా... అమ్మ కుట్టిందా అని కాకుండా... నేటి పరిస్థితులకు అనుగుణంగా మార్పు రావాలి.
పత్తిపాక మోహన్, బాలసాహితీ రచయిత
బాల చెలిమి పుస్తకాన్ని పిల్లల మసుకు హత్తుకునేలా... బొమ్మలు, ముద్రణ, అక్షరాల సైజు వంటి విషయాల్లోనూ వేదకుమార్ గారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతోపాటు ప్రతి జిల్లాలోనూ ఒక బాల చెలిమి లాంటి పత్రిక రావాలని కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా చూసుకుంటే మన తెలుగులో బాల పత్రికలు చాలా తక్కువగా ఉన్నాయి. బాల సాహితీ రచయితలకు సమాజంలో రెండో కేటగిరి రచయితలుగా భావిస్తున్నారు. దీంతో ఎంతో ఉత్సాహం ఉన్న రచయితలు కూడా బాల సాహిత్యానికి దూరమవుతున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో కొంత మార్పు వస్తోంది. కొన్ని పత్రికలు పిల్లల కోసం కొంత స్థలాన్ని కేటాయించడం శుభపరిణామం...
మనుషులకు విలువలు నేర్పేదే బాల సాహిత్యం... అలాంటి బాల సాహిత్యాన్ని బ్రతికించుకోవాలి... అప్పుడు మాత్రమే ప్రపంచాన్ని బ్రతికించుకోవచ్చని ప్రముఖ బాల సాహితీవేత్త దాసరి వెంకట రమణ అన్నారు. ప్రపంచం మీద ప్రేమ ఉంటేనే... బాల సాహిత్యం సాధ్యమవుతుందన్నారు.
దాసరి వెంకట రమణ, బాల సాహిత్య రచయిత
బాల సాహిత్యాన్ని రాయడంలో... ప్రచురించడంలో... ప్రచారంలోకి తేవడంలో అనేక ఇబ్బందులుంటాయి. పిల్లల్ని తన్మయ పరిచేలా... పెద్దల్ని అబ్బురపరిచేలా బాల సాహిత్య రచనలు రావాల్సిన అవసరం ఉంది. మనుషుల్ని బ్రతికించుకోవాల్సిన అవసరంఉంది. అది జరగాలంటే నేటి పిల్లలకు బాల సాహిత్యాన్ని నూరిపోయాలి. నైతిక విలువలు లేకపోవడం వల్లే పిల్లల్లో నేరప్రవృత్తి పెరుగుతోంది. సంస్కారం, విలువలు, మానవత్వం అడుగంటి పోతున్నాయి. తల్లిదండ్రి అంటే గౌరవం లేకుండా పోతోంది. దానికి కారణం మనమే. వాళ్లని కేవలం బడికి వెళ్లివచ్చే యంత్రాల్లా తయారు చేస్తున్నాం. వారికి ఎలాంటి కథలు చెప్పడంలేదు.. వారికి విలువలు, గౌరవం నేర్పడంలేదు.
తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు వాటి పుట్టనేమి గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా... విశ్వదాభిరామ వినురవేమా....
ఇలాంటి పద్యంలోని జీవనసారాన్ని పిల్లలకు నేర్పిస్తే... వారికివచ్చే బుద్ధులకు సరితూగేలా... వేమన పద్యం లాంటి పద్యం ప్రపంచ సాహిత్యంలో లేదు. మన పిల్లలకు రోజుకు ఒక పద్యం నేర్పిద్దాం... ఇదే బాల సాహిత్యం యొక్క ఔన్నత్యం. కొన్ని తరాలకు సంస్కారం నేర్పిన చందమామ పత్రిక కూడా 2013లో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో ఓ పెద్ద సవాల్. ఇలాంటి పరిస్థితుల్లో... బాల చెలిమి మళ్లీ వస్తోందని ... దక్కన్ ల్యాండ్ పత్రికలో చదివినపుడు... వర్ణనాతీతమైన ఆనందానికి గురయ్యాను. బాల సాహిత్యాన్ని ప్రేమించేవాడిని... ప్రచురించేవారిని... ప్రచారం చేసే వారు ఎవరున్నా శిరస్సు వంచి నమస్కరిస్తా.. ఈ విషయంలో వేదకుమార్ గారు అభినందనీయులు.. బాల చెలిమి పత్రిక మళ్లీ వస్తది... నిలదొక్కుకుంటది... మన్నుతది... మనుషులకు మానవత్వాన్ని నేర్పుతది.. ప్రపంచానికి మన సాహిత్య సౌష్టవాన్ని చాటుతది...
గరిపల్లి అశోక్, పిల్లల రచయిత, విశ్రాంత ఉపాధ్యాయులు
బాలల పత్రికలు ఎన్నివచ్చినా... తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ప్రేరణ కల్పించగలగాలి. అప్పుడు ఆ పత్రికలు తప్పకుండా విజయం సాధిస్తాయి. పిల్లల్లో ముందుగా పఠనాసక్తిని పెంచాలి. అప్పుడు తప్పకుండా మార్పు వస్తుంది. ఆ సిద్ధాంతాన్ని నేను నమ్ముతున్నాను. చందమామ వంటి పత్రికలను పిల్లల కంటే పెద్దవాళ్లే ఎక్కువగా చదివారు. ఆ కథలతో ఎంతో స్ఫూర్తి పొందాం. ఏ పత్రిక వచ్చినా... పిల్లలతోపాటు ఆబాలగోపాలన్నీ అలరించే విధంగా ఉన్నపుడు... తప్పకుండా విజయం సాధిస్తుంది.
యాదయ్య, బాల సాహితీ రచయిత
పిల్లల్లో విలువలు ఇంటి నుంచే మొదలవుతాయి. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య బంధాలే విలువలకు పునాది. పెద్దల సాహిత్యంకంటే.. బాల సాహిత్యం చాలా నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లల దగ్గర అనేక గొప్ప విషయాలు తెలుస్తాయి. దానికోసం వారిని పరిశీలిస్తుండాలి. వారి మాటల్లోంచే కవితలు, కథలు స్ఫురిస్తాయి. బాల సాహిత్యాన్ని మరింత3 ముందుకు తీసుకెళ్లేందుకు బాల చెలిమి చేస్తున్న కృషిని అభినందిస్తున్నా.
బాలల సాహిత్యానికి ఆదరణ పెరుగుతుండటం శుభపరిణామమని... 'బాల సాహిత్య రచన- సవాళ్లు' చార్చా కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. నేటితరం పిల్లలకోసం రచయితలను ఒకచోట చేర్చి... ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న 'చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ' చేస్తున్న కృషిని రచయితలు అభినందించారు.
-
హితాన్నే చేకూర్చేదే సాహిత్యం... ఎన్నో రకాలైన సాహితీ ప్రక్రియల్లో బాల
సాహిత్యం ప్రత్యేకమైనది. తల్లి జోలపాట మొదలుకుని.. బాల్యదశ ముగిసేవరకు
వచ్చే విజ్ఞానమంతా బాల సాహిత్యం కిందకే వస్తుంది. అందుకే బాల్య దశలో వారి
మనసులో నిండే ఊసులే వారి జీవితమంతా ప్రవహిస్తూ జీవనదశ దిశలను
మారుస్తుంటాయి. అయితే మారిన ప్రస్తుత జీవన విధానంతో... పిల్లలు కేవలం...
పాఠ్య పుస్తకాలకే పరిమితమవుతున్నారు. పాఠ్యాంశాలకు అదనంగా బాలల సాహిత్య
రచనలు వారి వద్దకు చేర్పించి చదివించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఇలాంటి
సాహిత్యం వల్లే వారి ఆలోచనా విధానాలు ఉన్నతంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం
లేదు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం.. ..వారిని ఎలక్ట్రానిక్
గ్యాడ్జెట్ల వైపు మాత్రమే ఆకర్షిస్తోంది. కంటికి కనిపించే దృశ్యాలే
తప్ప... రచనలు చదవడం వల్ల ఊహించుకునే పరిస్థితి ఉండటంలేదు. చదివిన
పుస్తకాలను.. వారి భావాలను ఒకచోట చర్చించడం ద్వారా పిల్లలకు మరింత ప్రయోజనం
కలుగుతుంది. అలాంటి వేదిక ఏర్పాటు లక్ష్యంతో... 'బాల చెలిమి' చిల్డ్రన్స్
ఎడ్యుకేషన్ అకాడమీ ఆధ్వర్యంలో... అంతర్జాతీయ పిల్లల పుస్తక దినోత్సవాన్ని
హిమాయత్ నగర్‌లోని ఆక్స్‌ఫొర్డ్ గ్రామర్ స్కూల్లో ఏప్రిల్ 2న
నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు
అయాచితం శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 'బాల చెలిమి' ప్రధాన
సంపాదకులు ఎమ్.వేదకుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యాఖ్యాతగా
వ్యవహరించారు... ఈ కార్యక్రమంలో ఎన్బిటీ సంపాదకులు డా.పత్తిపాటు మోహన్,
బాల సాహితీవేత్తలు, రచయితలు గంగదేవు యాదయ్య, వి.ఆర్.శర్మ, డాక్టర్ సిరి,
సాహితీ వేత్తలు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, డాక్టర్ ఎన్.రఘు,
శ్రీనివాస్, మంచి పుస్తకం ప్రచురణ కర్త కె. సురేష్ తదితరులు
పాల్గొన్నారు.
ఎమ్. వేదకుమార్, బాల చెలిమి ప్రధాన సంపాదకులు..
సాధారణ పాఠ్య పుస్తకాలతోపాటు... అదనంగా పుస్తకాలను చదవాల్సిన అవసరం ఉందని... ప్రపంచవ్యాప్తంగా చాలా మంది రచయితలు ఇదే అభిప్రాయపడుతున్నారు. పుస్తక పఠనంతో జీవితాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందమైన కథలతో... ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లవచ్చు. సినిమాలు, కార్టూన్ ఫిల్మ్స్‌లో దర్శకులు తమకున్న విజన్‌తో కథలు చెబుతారు.. అదే మంచి కథల పుస్తకాలు చదివినపుడు అంతకన్నా ఎక్కువగా ఊహా ప్రపంచంలో విహరించవచ్చు.. ప్రకృతి, మనుషులు, పండుగలు, ఆచారాలు, ప్రజల జీవన విధానం వంటివి పుస్తకాలతో తెలుస్తాయి. విద్యార్థులుగా ఆ విషయాలను తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. అంతర్జాతీయ పిల్లల పుస్తక దినోత్సవం సందర్భంగా... ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉంది. బాల చెలిమి వేదికగా... ప్రతి నెల రెండో శనివారం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం. పాఠశాల విద్య జ్ఞానాన్ని పెంచుకోవడానికి, జీవితంలోపైకి ఎదగడానికి అవసరమైనదే... అయితే వాటికి అనుబంధంగా పిల్లల రచనలు చదవడం చాలా అవసరమని ఇక్కడికి వచ్చిన వక్తలు కూడా చెబుతున్నారు.
పుస్తకాలు చదవడం, రచనలు చేయడం, పాటలు పాడటంతో మీలో దాగిఉన్న కళలను బయటికి తీయడం ముఖ్యం. ఆ ఉద్దేశంతోనే 90వ దశకంలో ప్రచురితమై అనివార్య కారణాలతో నిలిచిపోయిన బాల చెలిమిని పిల్లల అంతర్జాతీయ పుస్తకాల దినం సందర్భంగా మళ్లీ తెస్తున్నాం. ఈ మధ్యనే జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల్లో... పిల్లల రచనలపై చర్చిండం జరిగింది. ఆ పరిణామ క్రమంలోనే తమవంతు ప్రయత్నంగా తెలుగులో బాల చెలిమి రాబోతోంది. ఎక్కువమందికి దగ్గరవ్వాలనే లక్ష్యంతోనే బాల చెలిమిని తెలుగులోకి తెస్తున్నాం.
బాల చెలిమి ముచ్చట్లులో భాగంగా... ఆక్స్‌ఫొర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేదికను అలంకరించిన బాల సాహితీవేత్తలు... పిల్లలతో మమేకమై పుస్తక పఠనాసక్తిని పెంచేందుకు పలు సూచనలు చేశారు. ప్రముఖ పిల్లల పుస్తక రచయిత డాక్టర్ సిరి పిల్లలను అడిగి... వారికొచ్చిన కథలు వినిపించమని ప్రోత్సహించారు. అటు విద్యార్థులు కూడా ఉత్సాహంగా తమకు తెలిసిన కథలు వినిపించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు ఆయాచితం శ్రీధర్ తన అనుభవాలను పంచుకున్నారు.
ఆయాచితం శ్రీధర్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు...
ఏప్రిల్ 2న ప్రత్యేక సందర్భంగా 'పిల్లల అంతర్జాతీయ పుస్తక దినోత్సవాన్ని నిర్వహించడం సంతోషకరం. ఇలాంటి పండుగలు పెద్ద ఎత్తున చేసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రంథాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తాం. పిల్లల కథా రచయితలు ఇందులో పాల్గొని.. సమాజానికి మంచి సందేశం ఇవ్వాలన్నారు. చందమామ పుస్తకం నుంచే నాకు పఠానసక్తి మొదలైంది. పిల్లలకు చదువు పట్ల, పుస్తకాల పట్ల ఆసక్తి కలిగించే బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. పిల్లల జీవితంలో ఏ సందర్భమైనా పుస్తక ప్రమేయం ఉండేలా చూడాలి. ఇంటికొచ్చే పిల్లలకు గానీ... మనం ఎవరి పిల్లల పుట్టిన రోజు వేడుకలకు, ఏదైనా బహుమతులు, ప్రోత్సాహకాలు ఇచ్చే సందర్భం అయినా... పుస్తకాలను బహుమతిగా ఇచ్చే సంస్కృతి పెరగాలి. పిల్లల్లో పఠనాసక్తి, గ్రంథాలయాల్లో వేళ్లే ఆసక్తి పెంచాలి. నేటి స్కూల్ పిల్లలు వారి పాఠ్య పుస్తకాలు, స్కూల్‌కి వెళ్లి రావడమే తప్ప... గ్రంథాయాలుకు వెళ్లడం లేదు. పిల్లల్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహించేందుకు... బాల చెలిమి ద్వారా వేదకుమార్ చేస్తున్న కృషిని... ప్రశంసిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా నా బాధ్యతను గుర్తుచేసినందుకు ఆయన... ధన్యవాదాలు.
కార్యక్రమంలో భాగంగా ఎన్.బి.టి( నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా) పిల్లల రచనలకు సంబంధించిన పలు పుస్తకాలను ప్రదర్శించారు. సుమారు 150 పుస్తకాలు ప్రదర్శనలో పెట్టారు.
ఆ పుస్తకాలను కార్యక్రమంలో పాల్గొన్న రచయితలు, వక్తలతోపాటు విద్యార్థులు కూడా ఆసక్తికరంగా పరిశీలించారు. అంతర్జాతీయ పిల్లల పుస్తక దినోత్సవం విశిష్టతను బాలల సాహితీ రచయిత డాక్టర్ మోహన్ వివరించారు.
డాక్టర్ మోహన్, పిల్లల కథా రచయిత
ఫెయిరీ టేల్స్... కాన్సెప్ట్‌ని హన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ ప్రారంభించాడు. ఆయన జ్ఞాపకార్థం ఇలాంటి కార్యక్రమాలను యునెస్కోతోపాటు పలు సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో 5 రకాల కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజు ఓ కొత్త పుస్తకాన్ని క్రియేట్ చేయడం, ఓ కొత్త పుస్తకాన్ని కొనడం, కొత్త పుస్తకంపై చర్చలు జరపడం, కొత్త పుస్తకాన్ని మీ ఆత్మీయులకు ఇవ్వడం వంటివి. ఇలాంటి సందర్భంలో ఒక రచయితగా పాల్గొనడం సంతోషంగా ఉంది. తమకు చిన్నపుడు... ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ పరికరాలు లేవు. తమ వద్ద ఉన్న డబ్బుతో చందమామ సహా పిల్లల కథల పుస్తకాలు చదివే వాళ్లం. పిల్లల కోసం రాసిన రచనలు ఎంతో తీయగా ఉంటాయి. వాటిని ఆ ఆరోజుల్లో పెద్దవాళ్లు కూడా చదివే వాళ్లు. చిన్న పిల్లల రచనలు అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంటాయి. అందుకే పిల్లలు వీలైనంత వరకు తమ రచనా సామర్థ్యాన్ని పెంచుకోవాలి.
90 వ దశకంలో వచ్చిన బాల చెలిమి పత్రిక తొలినాటి పరిస్థితులను... మంచి పుస్తకం ప్రచురణకర్త కె. సురేష్ కార్యక్రమంలో వివరించారు. ఆ రోజుల్లో పిల్లల పుస్తకాల కోసం తాము ఎదుర్కొన్న సవాళ్లను తెలిపారు.
కె.సురేష్, మంచి పుస్తకం ప్రచురణకర్త
పిల్లల అంతర్జాతీయ పుస్తక దినోత్సవం రోజున... బాల చెలిమి పుస్తకం మరోసారి ఆవిష్కరించనున్నారు అనే విషయం... చాలా సంతోషంగా ఉంది. ఆ రోజుల్లో పిల్లల రచయితలను ఒకే వేదికపై తీసుకొచ్చి వేదకుమార్ గారు కార్యక్రమాలను నిర్వహించేవారు. పిల్లల పుస్తకం తీసుకునిరావాలంటే రచయితలతోపాటు చిత్రకారులను కూడా ఒకే దగ్గరకు తీసుకొచ్చి ఎంతగానో కృషి చేయాల్సి ఉంటుంది. బాల చెలిమిని మళ్లీ తీసుకునిరావడంతోపాటు బాల చెలిమి ముచ్చట్లు కూడా నిర్వహించడం సంతోషకరం. ఇతర భాషల్లో వచ్చినట్టుగా... తెలుగులో వైవిధ్యభరితమైన పిల్లల పుస్తకాలు రావడంలేదు. ఇలాంటి స్థితి నుంచి బయటికి రావడానికి బాల చెలిమి కృషి చేస్తుందని భావిస్తున్నా...
బాల చెలిమి పత్రిక ఈ జనరేషన్ వారి కోసం మళ్లీ తీసుకునిరావడంపై... బాలల పుస్తకాల రచయిత వి.ఆర్. శర్మ సంతోషం తెలిపారు. బాల చెలిమి పత్రికలో తమ రచనలు, సలహాలు, పఠనం ద్వారా అందరూ పిల్లలు, పెద్దలు పాల్గొనాలని ఆయన సూచించారు.
వి.ఆర్. శర్మ,, పిల్లల పుస్తకాల రచయిత
అంతర్జాతీయ పిల్లల పుస్తక దినోత్సవం సందర్భంగా... బాల చెలిమి పుస్తకం మళ్లీ రాబోతుండటం సంతోషంగా ఉంది. బాల చెలిమి పిల్లల వికాసానికి ఉపయోగపడే పత్రిక. పెద్దవాళ్లతోపాటు పిల్లలు రాసే కథలు కూడా పుస్తకంలో ఉంటాయి. పిల్లలు స్నేహం చేసుకోవడానికి వీలుగా.. పిల్లల చెలిమికి సంబంధించిన శీర్షికలుంటాయి. లేఖలు, గేయాలతో వారిలో అవగాహన, జ్ఞానాన్ని పెంచే శీర్షిలుంటాయి. బాల చెలిమిని మరింత మెరుగుపరచడానికి లేఖలు కూడా పిల్లలు రాయొచ్చు. పూర్తిగా తెలంగాణలో నిర్వహిస్తున్న పత్రికల్లో మొలక, బాలచెలిమి ఉన్నాయి. పిల్లలు తమ అభిప్రాయాలు తెలుపుకోవడానికి 'బాల చెలిమి ముచ్చట్లు' సరైన వేదిక. సరదగా ఉండే ముచ్చట్లతోపాటు మన వికాసానికి పనికొచ్చే ముచ్చట్లు పెట్టుకోవచ్చు. సాహిత్య విషయాలు, జ్ఞానం, పుస్తకానికి సంబంధించిన విషయాలు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. పిల్లలకు ఏమీ తెలియదు అనే భావన నుంచి అందరూ బయటికి రావాలి.. ..వాళ్లు అద్భుతాలు చేస్తున్నారు...
దేశం సాంకేతిక రంగం ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ... పుస్తకం పుస్తకమేనని కార్యక్రమంలో పాల్గొన్న బాల సాహితీ రచయితలు, వక్తలు తెలిపారు. త్వరలో రాబోతున్న బాల చెలిమి పత్రిక కోసం అందరూ ఆసక్తికరంగా వేచి చూస్తున్నామని అన్నారు.