Flash News
Powered by Blogger.

Popular Posts

Blog Archive

Popular Posts

Bala Chelimi

Editor:
Manikonda Veda Kumar

Executive Editor:

Gali Udaya Kumar
---- ----
Bala Chelimi
Chandram, 490, Street No.11,
Himayat Nagar, Hyderabad 500 029
www.balachelimi.com

Mail Instagram Pinterest RSS

జంతు దర్బార్‌


నులి వెచ్చని కిరణాల తాకిడికి అడవి బద్దకంగా వళ్లు విరుచుకొని నిద్ర లేస్తోంది. బంగారు కాంతులు వెదజల్లే సూర్యుడి తొలి కిరణాల కాంతిలో గడ్డి పరకల మీద మంచు బిందువులు వింతగా మెరుస్తున్నాయి. పక్షులు కిలకిలా రావాలు చేస్తూ ఆకాశంలో హాయిగా తిరుగుతున్నాయి. అడవి అంతా ఒక మధురమైన సంగీతం! అడవిలోని చిన్నా,పెద్దా జంతువులన్నీ నిద్ర మత్తు వదిలించుకొని తమ పనులకు సిద్దమౌతున్నాయి. రంగురంగుల సీతాకోక చిలుకలు, తేనెటీగలు, కీటకాలు ఝంకారం చేస్తూ ఎగురుతున్నాయి.
రాత్రిపూట సంచరిస్తూ, నక్కినక్కి దాక్కుంటూ గడిపిన ప్రాణులు విశ్రాంతికి సిద్దమైతున్నాయి. ఈ పచ్చని ప్రపంచంలో అంతా సవ్యంగానే ఉంది.
అంతలో హఠాత్తుగా ఆ నిశ్శబ్ధాన్ని భగ్నం చేస్తూ అరుపులూ, కేకలూ ఆ ప్రాంతమంతా మారుమోగాయి. ఉద్రేకంతో ఊగిపోతూ ఒక మనిషి అక్కడకు వచ్చాడు. అతడి చేతిలో ఒక పెద్ద కర్ర ఉంది. అతడు ఎవరి కోసమో వెతుకుతున్నాడు. చెట్ల దగ్గర ఖాళీ ప్రదేశంలోకి వచ్చి అతడిలా అన్నాడు.
ఈ పచ్చడి అడవికి వేటకు వచ్చాను
చిరుతను కొట్టి చంపేందుకు ఈ కర్రను తెచ్చాను
నా మేకలు రెండిటిని చంపి తిన్నదది
ఆ చిరుత పని పడతాను, ఎక్కడున్నదది?
ఆ మనిషిని ఎన్నో కళ్లు గమనిస్తున్నాయి. కాని అతడికి కనిపించింది
మాత్రం పెద్ద, పొడవాటి తోకల కొండముచ్చుల గుంపు
మాత్రమే. చక్కగా చెట్టు కొమ్మలో కూర్చుని ఆకులూ, పళ్లూ
తింటున్నాయవి. అవి అలా తింటూనే ఆ మనిషి వంక ఆసక్తిగా
చూడసాగాయి. అతడు వాటిని చూసి ఇలా అన్నాడు-
ఎత్తయిన చెట్లమీద వున్న ఓ కోతుల్లారా!
చిరుత వస్తున్నపుడు నాకు కాస్త చెప్పరా
కొండముచ్చులు తోకలూపుకుంటూ కుతూహలంతో అతడి మాటలు విన్నాయి.
చిరుత పులి కోసం అన్వేషిస్తున్న వ్యక్తి!..... అది తమకూ లాభదాయకమే! ఆ ఆలోచన వచ్చిందే తడవుగా
ఓ యువ కొండముచ్చు ఇలా అంది......
మమ్ము పట్టి తినే చిరుత మా శత్రువు
మరి దాన్ని పడితే నీవు మా మిత్రువు!
ఆ కొండముచ్చు మాటలను బల పరుస్తూ జుట్టు తెల్లబడిపోయిన ఒక పెద్ద ఇలా అంది-
పొడవు తోకల మాజాతికి ఒకటే వణుకు
సింహం కన్నా చిరుత అంటే మాకు మహా బెదరు
అందనంత ఎత్తులో, కొమ్మల అంచుల్లో
మేము దాగి, దుమికినా, సులభంగా పట్టి తినేస్తాడు
తమందరికీ శత్రువైన చిరుతను చంపేస్తానని మనిషి అనడంతో కొండముచ్చుల గుంపు ఆనందం పట్టలేక గంతు లేయటం ప్రారంభించాయి. వాటి తాకిడికిచెట్లు ఊగి పోసాగాయి. ఆకులు అల్లల్లాడి పోసాగాయి.ఇదంతా చూసి ఒక వేప చెట్టు అన్ని మొక్కలూ, చెట్లను చూస్తూ ఇలా అంది.
అడవికి ప్రాణం పోసేది మనం
ఎందరికో ఇల్లూ, ఆహారం ఇచ్చేది మనం
నా లేలేత ఆకులే కదా కొండముచ్చుకు విందు భోజనం
కొండముచ్చు లెక్కువైతే నేను బోసి పోనా?
చిరుతే లేకపోతే నేను చిక్కిపోనా?
దాంతో వాదనలు ప్రారంభమయ్యాయి. అంతలో పొదల మధ్య నుంచి బుసలు శబ్దం వినిపించింది. నల్లటి,
పొడవైన పాము ఒకటి గడ్డి దుబ్బుల్లో నుంచి ముందుకు వచ్చింది. ఆ పాము మాట్లాడటం
మొదలు పెట్టగానే ఆ ప్రాంతమంతా తాత్కాలికంగా నిశ్శబ్ధం ఆవరించింది
పాము ఇలా అంది.
నాకు తెలుసు చిరుతంటే అందరికీ భయం
అయినా చిరుత క్షేమమే నాకు నయం
మా శత్రువైన నెమలికి చేస్తుంది అపకారం
అలా నా జాతికి చేస్తుంది ఉపకారం
దీనితో అంతటా గందరగోళం చెలరేగింది. ఎవరికివారు తమకుతోచిన వాదనలు చేయసాగారు. వాళ్ల వాద ప్రతివాదనలతో అడవి మారుమ్రోగిపోయింది.
ఇంతకి దోషి ఎవరూ? ఈ గొడవ అంతటికీ కారణం ఏమిటి?
ఇంతలో  చెట్టు పై కొమ్మల్లో నుంచి చిన్నగా గుర్రు పెట్టిన శబ్దం వినిపించింది. నిద్ర కళ్లను నులుముకొంటూ చిరుతపులి గట్టిగా గర్జిస్తూ ఇలా అంది-
భలే ఉన్నాయి మీ వాదనలు!
అవుననీ-కాదనీ రకరకాల దృక్పథాలు
నేనెలా జీవించాలని ఉందో అలాగే జీవిస్తాను
మరినేను చేసే దానిలో తప్పు ఉందంటే నేనొప్పుకోను
చిరుతే స్వయంగా మాట్లాడటంతో ఆ ఆరోపణలు చేసినవారంతా మిన్నకుండిపోయారు. ప్రతి ఒక్కరూ
తమ వాదనే సబబు అని అనుకోసాగారు. ఎదుటి వాళ్లదే తప్పంతా అనుకొంటూ తమను తాము సమర్థించుకొన్నారు.
హఠాత్తుగా గాలి అంతా ఘీంకార శబ్ధంతో మారుమ్రోగింది. అక్కడ ఏనుగు ప్రత్యక్షమైంది. అంతమంది అక్కడ గుమిగూడి వుండటాన్ని చూసి ఏనుగు ఆశ్చర్యపోయింది. కానీ అక్కడ చేరిన ప్రాణులన్నీ ఏనుగును చూసి ఆనందంగా నిట్టూర్చాయి. మొత్తానికి వారికి ఒక మధ్యవర్తి దొరికింది. చిరుతా, అన్ని జంతువులూ కలిసి ఇలా అన్నాయి-
అంతం లేకుండా వాదించుకొంటున్నాం
అది ఇదా తేల్చుకోలేకున్నాం
ఎవరు ఒప్పు, ఎవరు తప్పు
నువ్వు కాస్త తేల్చి చెప్పు
తొండాన్ని పైకి ఎత్తి పట్టి చెవులు రిక్కించి ఏనుగు వాళ్లు చెప్పేదంతా శ్రద్ధగా వింది. జంతువులన్నీ
నిశ్శబ్ధాన్ని పాటిస్తూ ఏనుగు ఇచ్చే తీర్పు కోసం ఎదురు చూడసాగాయి.
తరతరాల అనుభవసారాన్నంతా రంగరించి, ఏనుగు గంభీరంగా ఇలా పేర్కొంది.
జీవతమనే జాలంలో దారాలం మనం
ఒకరికి ఒకరం అందరికీ అవసరం,
ప్రకృతి ఒడిలో అందరం సమానం,
ఒకటే ఒక్క నియమం-ఐకమత్యమే బలం
 ఆ తెలివైన ఏనుగు స్పష్టంగా అలా చెప్పింది. ఇపుడు మీరు చెప్పండి -ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో!


చూడటానికి అడవులన్నీ ఒకేలా కనిపిస్తాయి. కానీ ప్రతి అడవిలోనూ వేర్వేరు రకాల మొక్కలూ, జంతువులూ ఉంటాయి. అటవీ వ్యవస్థలో ప్రతి మొక్కా, జంతువూ తమదైన ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఏదైనా ఒక మొక్కకు కానీ, జంతువుకు కానీ ఏమైనా జరిగితే, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాని ప్రభావం మరెన్నో ప్రాణులపై ఉంటుంది. ఎందుకూ పనికిరావని భావించే కొన్ని ప్రాణులు ప్రకృతిలో ఇతర జీవులతో ఎటువంటి సంబంధాలను కలిగివున్నాయో ఈ కథ తెలియజేస్తుంది.