Flash News
Powered by Blogger.

Popular Posts

Blog Archive

Popular Posts

Bala Chelimi

Editor:
Manikonda Veda Kumar

Executive Editor:

Gali Udaya Kumar
---- ----
Bala Chelimi
Chandram, 490, Street No.11,
Himayat Nagar, Hyderabad 500 029
www.balachelimi.com

Mail Instagram Pinterest RSS

బాల సాహిత్యం - ప్రభావం

వాస్తవాలను ప్రతిబింబించి.... బాలల మానసిక పరిణతిని పెంచే విలువలున్న రచనలు వచ్చినపుడే బాల సాహిత్యానికి పరిపూర్ణత, ప్రయోజకత్వం లభిస్తుంది. ప్రస్తుత సమాజంలో అలాంటి రచనలు రావాల్సిన అవసరం ఉందని... హిమాయత్‌ నగర్‌లోని ఆక్స్‌ఫొర్డ్‌ గ్రామర్‌ స్కూల్‌లో జరిగిన బాల చెలిమి ముచ్చట్లు కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు. చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీ ఆధ్వర్యంలో ప్రతి నెల రెండో శనివారం బాల చెలిమి ముచ్చట్లు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఐదోసారి జరిగిన బాల చెలిమి ముచ్చట్లలో... 'బాల సాహిత్యం- ప్రభావం' అంశంపై.. ప్రముఖ రచయితలు తమ మనోభావాలు, రచనా అనుభవాలను వ్యక్తపరిచారు. చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీ చైర్మన్‌ ఎం.వేదకుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీపీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
బాల చెలిమి ముచ్చట్లు కార్యక్రమం ప్రారంభించడానికి ముందు... పిల్లల కోసం ' ద రెడ్‌ బెలూన్‌', 'స్వచ్ఛ భారత్‌' లఘు చిత్రాలను ప్రదర్శించారు. స్వచ్ఛ భారత్‌ చిత్రాన్ని ప్రేమ్‌ దర్శకత్వం వహించారు. ఐక్యమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని, స్వచ్ఛ భారత్‌లాంటి కార్యక్రమాలపై పిల్లల్లో అవగాహన పెంచడానికే ఈ లఘు చిత్రాన్ని రూపొందించినట్టు... దర్శకుడు ప్రేమ్‌ తెలిపారు.
బాల సాహిత్యం-ప్రభావంపై జరిగిన చర్చలో.. ముఖ్య అతిథి ఘంటా చక్రపాణి ముందుగా ప్రసంగించారు. రచనలు శాస్త్రీయంగా ఉంటే... వాటిని చదివాక శాస్త్రీయంగా చూడగలిగే పరిస్థితి పిల్లల్లో ఉంటుందని చక్రపాణి అన్నారు.
ఘంటా చక్రపాణి, టీపీఎస్సీ చైర్మన్‌
వేదకుమార్‌ గారు గత 25 ఏళ్లుగా సమాజంతో మమేకమై ఒక పెద్ద వ్యవస్థ ద్వారా తనవంతు కార్యక్రమాలు చేపడుతున్నారు. 30 ఏళ్ల క్రితం పాఠశాలలు పెట్టినవాళ్లంతా ఇప్పుడు కార్పొరేట్‌ స్థాయికి ఎదిగి రియల్టర్లుగామారి, చట్టసభల్లో అడుగుపెట్టినవాళ్లున్నారు. కానీ వేదకుమార్‌ గారు మాత్రం ఇప్పటికి ప్రజలతో, మానవహక్కులతో అందరితో కలిసిమెలిసి మమేకమై ఉండే వ్యక్తి. మేము పిల్లలుగా ఉన్నపుడు బాల సాహిత్యంతో పరిచయం చాలా తక్కువ. అప్పట్లో ఎక్కడో పాన్‌ షాప్‌లలో వేలాడుతూ ఒకటి అరా చందమామ పుస్తకాలు కనిపించేవి. మా చిన్నపుడు ఊళ్లో చిరుత రామాయణం, చిందూ భాగవతం ఉండేది. ఇవికాకుండా ప్రతి ఏటా కాముని పండుగకు పాటలు పాడేవాళ్లం. అచ్చుకి, అచ్చులో లేనటువంటి మిగతా రచనలకు, కథలరూపంలోగాని మౌఖిక సాహిత్యంలోగాని విన్న పిల్లల్లో అద్భుతమైన రచనాశక్తి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి ఈ రోజు వార్తలు ఏమిటంటే చెప్పలేకపోవచ్చుకానీ... మీ ఊళ్లో ఉన్న సమస్యలు చెప్పమంటే అనర్గళంగా మాట్లాడతారు. ఎందుకంటే వారిలో కథా కౌశలం ఉంటుంది. పట్టణాల్లోని కాన్వెంట్‌ పిల్లలు అలా చెప్పలేరు.
ఏమనిషికైతే తన చుట్టూ ఉండే వాతావరణం గురించి ఆలోచించే అవసరం ఉంటుందో... ఆ మనిషి మెదడు వికసిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నవాళ్లకి లేదా మిగతా అన్ని రకాల వేదనలు, సమస్యలు అనుభవిస్తున్నవారికి కథా కౌశలం, రచనా శక్తి ఎక్కువగా ఉంటాయి. నేడు పట్టణాల్లో ఉండే మహిళల వద్దకు వెళ్లి మీరున్న పరిస్థితులపై పాటలు పాడమంటే పాడలేరుకానీ... అదే ఊళ్లో పొలం పనిచేసే మహిళలకు తమ పరిస్థితలపై అప్పటికప్పుడు పాటలు కట్టి పాడగల శక్తి ఉంటుంది.
చిన్నపుడు మా ఊళ్లో విద్యుత్‌ సౌకర్యం లేదు. దీంతో సినిమాలు చూసే అవకాశం లేదు.. మాలో ఎవరో ఒకరు సినిమా చూస్తే... ఆ సినిమా మొత్తం కథను స్కూలుకు వెళ్లేదారిలో ఫైటింగ్‌లతో సహా వివరించి చెప్పేవాడు. కానీ నేటి జనరేషన్‌ పిల్లల్లో కథా కౌశలం లేదు. సమాజంతో, కుటుంబంతో సంభాషించడం వల్ల అనేక విషయాలు, విషయ పరిజ్ఞానం తెలుస్తాయి. నేటి తరంలో ఉమ్మడి భావం అనే పరిస్థితి లేదు. ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ప్రపంచ సాహిత్యంలో మాదిరిగానే మనవద్ద కూడా పురాణాలు, మతాలకు సంబంధించిన కథలే ఉండేవి. ఆతర్వాతి కాలంలో జంతువుల కథలు, పంచతంత్ర కథలు వచ్చాయి. మనం ఎలాగైతే ఆలోచించే ధోరణిలో ఉన్నామో... పిల్లలను కూడా అదే కోణంలోకి తీసుకెళుతున్నాం. మనకు ఎలాగైతే పాప -పుణ్యాల కథలు, భయం- భక్తి భావం కలిగించే అలవాట్లు ఉన్నాయో... పిల్లలపై కూడా అదే రుద్దతున్నాం. నేటికీ మన గ్రామీణ ప్రాంతాల్లో కథలు, సంస్కృతి సజీవంగా ఉన్నాయి. ప్రతి అంశంలో నుంచి కథలు సృష్టించగల చతురత ఉంది. పిల్లల మేథోశక్తిని పెంచేలా బాల సాహిత్య రచనలు జరగాలి. మిగిలిన ప్రాంతాలకంటే మన ప్రాంతం ప్రత్యేకమైనది. మన తెలంగాణ కథలు బాల రచనల్లో రావాలి. పిల్లలకు అన్ని రకాలుగా జ్ఞానం అందించే పరిస్థితి ఉండాలి.
రమణ జెవి, చిత్రకారుడు
మనం ఒక విషయాన్ని గ్రహించి దాన్ని పదాల రూపంలో మళ్లీ చెప్పడం చేస్తుంటాం. అలాంటి ప్రత్యేకతలు మనిషిలో చాలా ఉంటాయి. పదాల రూపంలో విజ్ఞానాన్ని తీసుకొని వాటిని పరీక్షల రూపంలో తిరిగి చెప్పడమేకాకుండా.. మనలో ఉండే అనేక జ్ఞానేంద్రియాలకు పని కల్పించినపుడే సృజనాత్మకత బయటికి వస్తుందని నా అభిప్రాయం. చిన్నపుడు చూసిన బొమ్మలు, చదివిన కథలు ఒక కళాకారుడిగా నన్ను ఎంతగానో ప్రోత్సహించాయి. చిన్నపుడు నాకు స్కూల్‌ అంటే ఒక భయంకర వాతావరణం అనిపించేది. అక్షరాలు దిద్దాలంటే నచ్చేదికాదు. నా సీనియర్‌తో పలక వెనుక ఆంజనేయుడి బొమ్మను చెక్కించుకుని ... అక్షరాలు దిద్దుతున్నట్టుగా బొమ్మ దిద్దేవాడిని. అలా నాకు చాలా సంతోషం అనిపించేంది. అక్షరాల్లో లేని ప్రాణం ఆ రూపంలో కనిపించేది. ఇంటర్‌ తర్వాత నాకు చదువు అంటే ఆసక్తిలేదని ఇంట్లో చెప్పి... ఆర్టిస్ట్‌గా మారిపోయాను. పిల్లలకు సంబంధించిన ప్రచురణలు చాలా సున్నితంగా చేయాల్సినపని.
నాకు జిడ్డు కృష్ణమూర్తి అంటే ఇష్టం. ఆయన ప్రసంగాలు వినడానికి రిషీ వ్యాలీ వెళ్లేవాడిని. అప్పుడు నా బొమ్మలు కూడా ప్రదర్శించేవాడిని. అలా రిషీ వ్యాలీలో ఆర్ట్‌ టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. అప్పుడు పిల్లలను మరింత దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. వారు చాలా సున్నితంగా ఉంటారు. చాలా సున్నితత్వ హృదయం ఉంటేనే వారికి దగ్గర కాగలం. మన చుట్టూ ఉండే పరిస్థితులు, విద్యావిధానం మనల్ని ఒకరకమైన చట్రంలో బంధిస్తాయి. సామాజానికి అవన్నీ అవసరమే కావచ్చు. అదే సమయంలో మనలో ఉండే సృజనాత్మకతను తట్టిలేపాలి. అలా చేయడానికి కళలు, సాహిత్యం ఉపయోగపడతాయి. పిల్లల హృదయాలను తాకి, వారిలోని సృజనాత్మకతను వెలికితీసే రచనలు రావాలని కోరుకుంటున్నా.
ప్రముఖ రచయిత కందేపి రాణీ ప్రసాద్‌ మాట్లాడుతూ... పొడుపు కథలు, ఆట-పాటల ద్వారా పిల్లల్లో మానసిక పరిణితిని పెంచే కృషి చేస్తున్నట్టు తెలిపారు.
కందేపి రాణిప్రసాద్‌, ప్రముఖ రచయిత
బాలలు మన జాతీయ సంపద. వీరిని తీర్చిదిద్దితే మన దేశం ముందుకు పోతుందని భావిస్తున్నా. పిల్లలకు మంచి- చెడు విచక్షణ నేర్పించగలిగితే.. క్రమశిక్షగల పౌరులుగా తయారవుతారు. పిల్లల మనసు వెన్నలాంటిది. ఎలా మలుచుకోగలిగితే వారు అలా తయారువుతారు. వరి గింజలు నాటి సీతాఫలాలు పండమంటే పండవు. పిల్లలకు ఏవి నేర్పిస్తామో... ఆ ఫలితాలే లభిస్తాయి. కానీ వాళ్లకు మనం నేర్పించేది ఒకటి, ఆశించేది మరొకటి. అబద్ధం చెప్పొద్దని అంటాం... ఎదురింటివాళ్లు వస్తే.... ఇంట్లో గొడుగు లేదని చెప్పమంటాం... రెండు మనమే నేర్పిస్తాం. అలాంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పాలో వద్దో పిల్లలకు అర్థంకాదు. ర్యాంకులు, మార్కుల ప్రాతిపదికన పిల్లలను తెలివైనవాళ్లుగా లెక్కలేసుకుంటున్నాం. అలాంటివాళ్ల వల్ల ఉపయోగంలేదు. మానవత్యం ఉండి, పది మందికి సాయం చేయగల వాళ్లై ఉండాలి. అలాకానపుడు ఎంతపెద్ద పదవిలో ఉన్నా... సమాజానికి ఉపయోగపడరు. ఒకరకంగా చెప్పాలంటే... బాల సాహిత్యం రాసేవాళ్లు కూడా టీచర్ల లాంటి వాళ్లే. తల్లిదండ్రులు, గురువు, బాలసాహితీవేత్తలు మాత్రమే పిల్లల మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. కేవలం కథలు గేయాలు మాత్రమే బాలసాహిత్యం కాదు. స్కూలు పాఠాలను కూడా సాహిత్య రూపంలో అందిస్తే వారికి రెండు రకాలుగా ఉపయోగపడుతుందని భావిస్తున్నా. ఆ మార్గంలో నేను కొంత కృషి చేస్తున్నా. మావారు పిల్లల డాక్టర్‌... మా హిస్పిటల్‌లో గోడలపై పిల్లల కోసం పొడుపు కథలు రాయించాం. పిల్లల ఆసుపత్రి కాబట్టి... వారిలో ఆసక్తి పెంచేలా.. మానవ శరీర భాగాలకు సంబంధించిన పొడుపు కథలు అంటించాం. గుండె ఎలా పనిచేస్తుంది... మెదడు ఏమి చేస్తుంది... ఊపిరి తిత్తులు ఎలా పనిచేస్తాయి.... లాంటి దాదాపు 300 పొడువు కథలు, గేయాలు పెట్టాం. ఇంకా స్థలం సరిపోకపోవడంతో... మందులు రాసే చిట్టీలపై కూడా పొడుపు కథలు రాస్తున్నాం.
పొడుపు కథలతోపాటు బాల సాహితీ రచయితలు ఇచ్చే పుస్తకాలను చుదివేలా ఆసుపత్రిలో ఒక గది ఏర్పాటు చేశాం. పేషంట్‌తోపాటు వచ్చే ఇతర పిల్లలు, వారి తల్లిదండ్రుల్లో ఆసక్తిఉన్నవాళ్లు వాటిని చదువుకోవచ్చు. కొందరు పిల్లలు ఇంజెక్షన్లు వద్దని ఏడుస్తుంటారు. మా ఇంజెక్షన్‌ రూమ్‌కి ఒక పోస్టర్‌ అంటించాం. ఒక దెయ్యంలాంటి దాన్ని సిరంజి పొడిచి చంపేస్తూ ఉంటుంది. ఇక్కడ దెయ్యం అంటే వైరస్‌, లేదా బ్యాక్టీరియా. పక్కనే... కొన్ని లైన్లు రాసి పెట్టాం. ఇంజెక్షన్‌ అంటే భయపడకు.. ..పొడిచేది నీలోని బ్యాక్టీరియాను నిన్ను కాదు అని. అలా ప్రతీ రూమ్‌ వద్ద చిన్నచిన్న కవితలు, మంచిమాటలు పెట్టాం. బాల సాహిత్య రచయితలు రాసేవి థియరీ లాంటివి.. మేము ప్రాక్టికల్‌గా ప్రయోగాలు చేస్తూ ఫలితాలు సాధిస్తున్నాం. మా ఆసుపత్రిలోని ఒక ఫ్లోర్‌లో కార్ల పరిణామక్రమం, మరో ఫ్లోర్‌లో రాజ భవనాలు, మరో చోట అంతరించే దశలో ఉన్న జంతువులు, పక్షుల వివరాలతోపాటు వైద్య శాస్త్రంలో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల వివరాలు పెట్టాం... ఆసుపత్రిలోనే వేస్ట్‌ మెటీరియల్‌తో పిల్లలను ఆకట్టునేలా బొమ్మలు, చార్ట్‌లు 3 వేల వరకు తయారు చేశాం. బాల సాహిత్యం రచనలు... పిల్లల వరకు చేరేలా జరగాలన్నదే మా ప్రయత్నం.
పిల్లలకు వాస్తవిక ప్రపంచంతో ముడిపడిన కథలు, మానవీయ విలువలు పెంపొందించే కథలు అందించాల్సిన బాధ్యత రచయితలపై ఉందని... ప్రముఖ రచయిత దేవరాజ్‌ మహారాజ్‌ ... బాలచెలిమి ముచ్చట్లలో తన మనోభావాలను పంచుకున్నారు.
దేవరాజ్‌ మహారాజ్‌, ప్రముఖ రచయిత
బాల సాహిత్యంలో నేను ప్రత్యేకంగా రచనలు చేయలేదు. అయితే నేను రాసిన పుస్తకాల జాబితాలో ఐదారు పిల్లల పుస్తకాలు కూడా ఉన్నాయి. భూతాలు, దెయ్యాలు, దేవుడు అనేవి లేకుండా మానవీయ విలువలకు ప్రాధాన్యమిచ్చే ప్రపంచ జానపద కథల్లోంచి ఎన్నుకుని... వాటిని మళ్లీ తిరగ రాశాను. అలా పిల్లలకు సంబంధించిన కొన్ని కథలు వచ్చాయి. ఇక్కడ పిల్లలున్నారు కాబట్టి అలాంటి ఒక కథ చెప్తున్నా... తాబేలు- కుందేలు కథను తిప్పి రాస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. ఒకసారి తాబేలు - కుందేలు మళ్లీ కలుస్తాయి. పాత పోటీ మరచిపోయి మరోసారి పోటీ పెట్టుకుందామని అనుకుంటాయి. అయితే ఈ సారి మార్గం మార్చానని తాబేలు చెబుతుంది. కుందేలు సరే అంటుంది. ఇద్దరు కలిసి పరుగు మొదలు పెడతాయి. కుందేలు వేగంగా పరిగెత్తాక... నది అడ్డు వచ్చి ఆగిపోతుంది. నీటి ప్రవాహాన్ని దాటలేక అక్కడ కూర్చుంటుంది. చాలా సేపటి తర్వాత మెల్లగా తాబేలు అక్కడికి చేరుకుంటుంది. అప్పుడు తాబేలు, కుందేలుతో .... నీవు నదిదాటలేవు కాబట్టి నా వీపుపై ఎక్కు... కలిసి ముందు కెళదాం. దానికి బదులుగా... నేను వేగంగా నడవలేని చోట నన్ను నీ వీపుపై ఎక్కించుకో అని తాబేలు సలహా ఇస్తుంది. కలిసి ఐక్యమత్యంగానే విజయం సాధించవచ్చని అర్థమై కుందేలుకు జ్ఞాననోదయమవుతుంది.
అలా నది దాటాక... కుందేలు తనపై తాబేలుని ఎక్కించుకుని గమ్యస్థానం చేరుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో సామర్థ్యం ఉంటుంది. వాటన్నింటిని పంచుకుని ముందుకు వెళితే విజయం సాధించవచ్చని... ఇలా తిరగరాసిన కథ ద్వారా పిల్లలకు చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో బాలచెలిమి పత్రిక తీసుకుని రావడానికి వేదకుమార్‌ గారు చేస్తున్న సాహసోపేతమైన కృషిని అభినందిస్తున్నా. ఎందుకంటే యునెస్కో లెక్కల ప్రకారం అంతరించిపోతున్న భాషల జాబితాలో తెలుగు కూడా ఉంది. జనరేషన్స్‌ మారిపోతుండటంతో... తెలుగుకు ఆ దుస్థితి వచ్చింది. చిన్న పిల్లలకు మాతృభాషలో పాఠాలు చెబితే వారు తొందరగా గ్రహించగలుగుతారని ప్రశాంత్‌ చంద్ర రే అని కెమిస్ట్‌ చెప్పారు. పిల్లల స్వేచ్ఛను హరించకుండా పాఠాలు చెప్పాలని విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ... శాంతినికేతన్‌ ద్వారా రుజువు చేశారు. పట్టణాల్లో ఉండే పిల్లలు మార్కులు, ర్యాంకుల విషయాల్లో ముందుంటారు. కానీ... చెట్ల కింద ఆడుతూ పాడుతూ పెరిగిన గ్రామీణ పిల్లల వద్ద ఇంగిత జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. మన యాంత్రిక జీవితాల్లో పిల్లలకు కథలు చెప్పడానికి సమయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మన భాషలో పిల్లల కోసం పత్రిక ఉండాలి. తొటి మనుషులతో గుండెల నిండా మాట్లాడుకోవాలని తాపత్రయపడుతున్న వేదకుమార్‌ గారికి అభినందనలు. నేటి సమాజానికి ఇలాంటి ప్రయత్నం చాలా అసవరం. నేటి రచయితల్లో చాలా మంది బాల సాహిత్యం చదువుకునే పెరిగి పెద్దవాళ్లయ్యారు. స్మార్ట్‌ ఫోన్లతో కమ్యూనికేషన్‌ పెరిగినప్పటికీ... మనుషులంతా కలిసిలేరు. మనముందు తరాల వాళ్లు మనకు పరిశుభ్రమైన పర్యావరణాన్ని అందించారు. దాన్ని తర్వాతి తరాల వాళ్లకు ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం లేకపోతే, బాల సాహిత్యం వల్లే ఉపయోగం ఏముంది. పిల్లలకు వాస్తవాలు చెప్పాలి. వారిని మభ్యపెట్టే రచనలు చేయకూడదు. వందల ఏళ్ల క్రితం పాత సంప్రదాయాలను పిల్లలపై రుద్దకూడదు. బాల సాహిత్య రచనల్లోనూ పాత విధానాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టి కొత్త సాహిత్యాన్ని సృష్టించాలి. సమకాలీన సంక్లిష్ట జీవితంలోని సమస్యలు పిల్లలకు తెలిసే విధంగా కథలు రావాలి.
డా.ఎన్‌.రఘు, కోఠి మహిళా కాలేజీ తెలుగు విభాగం అధ్యక్షులు
పిల్లల హృదయాలని అంతర్గతంగా ఆలోచించగలిగినపుడు రచనల్లో ప్రత్యేకత వస్తుంది. పిల్లలస్థాయికి దిగి రాసే రచయితలు తమ అనుభవాలను అతి సరళంగా అందించగలిగినపుడే బాల సాహిత్యం లక్ష్యం నెరవేరుతుంది.
బాల సాహిత్య ప్రభావం అంశంపై... బాలచెలిమి ముచ్చట్లలో పాల్గొన్న రచయితలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, సాహితీవేత్తలకు వారు ఇచ్చిన సూచనలను... చిల్డ్ర్‌న్స్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీ చైర్మన్‌ ఎం.వేదకుమార్‌ అభినందిస్తూ స్వాగతించారు.
ఎం.వేదకుమార్‌, చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ చైర్మన్‌
బాల సాహిత్య రంగంలో నిష్ణాతులైన ప్రముఖులు పాల్గొంటున్న బాల చెలిమి ముచ్చట్లు కార్యక్రమూన్ని ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ రూపాల్లో అందించేందుకు సొసైటీ ద్వారా సిద్ధమవుతున్నాం. బాలల సంపూర్ణ వికాసమే లక్ష్యంగా బాల చెలిమి ముందుకెళుతుంది. ఇలాంటి చర్చలను కొనసాగిస్తుంటాం. బాల చెలిమి ముచ్చట్లకు వచ్చిన రచయితలకు,అతిథులకు ధన్యవాదాలు. అందరి సహకారంతో నాణ్యమైన సృజనాత్మక రచనలతో బాల చెలిమి పత్రికను తీసుకొస్తాం. రెడ్‌ బలూన్‌, స్వఛ్‌ భారత్‌ వంటి క్రియేటివ్‌ వర్క్స్‌ను చూపించాం. వీటి ద్వారా ఒక్క పిల్లవాడిని ఉత్తేజపరచగలిగినా అది విజయంగానే భావిస్తాం....
ఈ కార్యక్రమంలో రామానందతీర్థ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ కిశోర్‌ సాహితీవేత్తలు నారాయణ, శ్రీనివాస్‌, అనీల్‌, సునీత, లక్ష్మి శైలజ, ప్రభాకర్‌తోపాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.


0 comments:

Post a Comment