బాలల ఊహాశక్తిని పెంపొందింపజేసే రచనలు రచయితల నుండి రావాలని తెలంగాణ
సాహిత్య అకాడమీ చైర్మన్ డా. నందిని సిధారెడ్డి అన్నారు. బాలసాహిత్యం
ముందడుగు అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్
ఎడ్యుకేషన్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆక్స్ఫర్డ్ గ్రామర్
స్కూల్లో నిర్వహించిన 'బాలచెలిమి ముచ్చట్లు' 6వ కార్యక్రమానికి ఆయన ముఖ్య
అతిథిగా హాజరై మాట్లాడారు. సాంకేతిక పరికరాలు పిల్లల ఊహాశక్తిని, కల్పనా
సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్న ప్రస్తుత తరుణంలో బాలల రచయితలు పిల్లల్లో
అభిరుచుని పెంచి ఆసక్తి వైపు నడిపించే రచనలను విరివిగా చేయాలని ఆయన
సూచించారు. బాలల హృదయాలకు హత్తుకునే విధంగా సన్నిహితమైన అంశాలను ఎన్నుకొని
అందులోంచి ఊహాశక్తిని రచయితలు రాబట్టగలగాలని చెప్పారు. సాంకేతికతవైపు
వేగంగా ప్రపంచం పరుగులు పెడుతుంతే బాలల్ని కథలు, పాటలు వంటి వాటివైపు
నడిపించాలని ధ్యేయం రచయితలల్లో పెరగాలని అన్నారు. రచయితలు భాషను బాలల కోసం
మార్చుకోవాలని చెప్పారు. సరళతరమైన బాషలోనే పిల్లలకు మానసిక పర్యావరణాన్ని
కల్పించవచ్చని అన్నారు. భావనా శక్తి తగ్గిపోకుండా భాషను నైపుణ్యంతో బాల
సాహిత్యంలో ప్రయోగించాలని చెప్పారు. బాలల రచనలు చదివే పిల్లలకుఊహను
పెంపొందించుకునే వాతావరణం కల్పించగల్గితే లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు.


ప్రఖ్యాత రచయిత డా. కెబి.గోపాలం మాట్లాడుతూ పిల్లల్లోని మానసిక
స్థితిగతులను అంచనా వేసుకుంటూ అరుదైన అంశాలను సులభమైన శైలిలో అందించగలగాలని
సూచించారు. ఎంతో కష్టమైన విషయాన్ని ఇష్టమైన అంశంగా మార్చి
చెప్పగల్గినప్పుడు బాల సాహిత్యం వైపు పిల్లల ఆసక్తి మరలుతుందని అన్నారు.
పాఠశాల స్థాయి విద్యార్థులను మెప్పించే అంశాలను తీసుకున్నప్పుడు లోతైన
దృష్టికోణంతో రచన సాగాలని, భాష ఎప్పుడూ సులభమనిపించాలని చెప్పారు.
ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఓల్గా మాట్లాడుతూ బాలల రచనలకు సంబంధించిన భాషా
స్థాయిలను గమనించి వాటిని రచనలలో ఉపయోగించాలి. ఇప్పుడున్న సాంకేతిక
వ్యవస్థ వేగం అందుకున్న తరుణంలో పిల్లలను ఎక్కువగా ఆకట్టుకునే అంశాలను
రచయితలు ఎంపిక చేసుకోవాలి అని చెప్పారు. ప్రముఖ రచయిత్రి డా.రోహిణి చింతా
మాట్లాడుతూ మానసిక పరిణతిని పెంచగలిగే విషయాలను పిల్లలకు భావ చిత్రాలతో
చెప్పగలగాలని రచయితలకు సూచించారు. ఇష్టమనిపించే స్థితిని బాలల రచయితలు తమ
రచనల్లో వ్యక్తం చేస్తే సాహిత్యం ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రముఖ బాలల
రచయిత పైడిమర్రి రామకృష్ణ మాట్లాడుతూ.. పిల్లల్లో సహజంగా వచ్చే మార్పులను
భేరీజు వేసుకుంటూనే అభివృద్ధికి బాటలను చూపగల్గిన అంశాలతో రచనలు ఉండాలని
చెప్పారు. గతంతో పోలిస్తే బాల సాహిత్యం ఎప్పటికప్పుడు విస్తృతమవుతూ తమ
పరిధిని పెంచుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన
చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్ వేదకుమార్ మణికొండ మాట్లాడుతూ
బాల సాహిత్య రంగంలో నిష్ణాతులైన ప్రముఖులను ఆహ్వానించి ప్రతి నెలా
ఉపయోగకరమైన అంశంపై నిర్వహిస్తున్న సదస్సులో అనేక ప్రయోజనాత్మకమైన అంశాలు
వెలువడుతున్నాయని తెలిపారు. బాల చెలిమి ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రింట్,
ఎలక్ట్రానిక్ రూపాలలో సొసైటీ ద్వారా అందించేందుకు సంసిద్ధమయ్యామని
అన్నారు.
బాలల సంపూర్ణ వికాసమే లక్ష్యంగా బాలచెలిమి కార్యక్రమాలు కొనసాగుతాయని
తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ రచయితలు డా. వడ్డేపల్లి కృష్ణ,
భూపాల్‌రెడ్డి, డా. ఎస్.రఘు, అక్కినేని కుటుంబరావు, తిరునగరి శ్రీనివాస్,
శ్యాంసుందర్, ధనుంజయ్, బొట్ల పరమేశ్వర్, వరప్రసాద్‌రావు, సంపత్‌రెడ్డి,
శివశంకర్, కె. ప్రభాకర్, కో-ఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ సంతోష్ శివన్ దర్శకత్వం
హించిన 'మల్లి' హిందీ షార్ట్ ఫిల్మ్‌ను ఈ సందర్భంగా ప్రదర్శించారు.











