Flash News
Powered by Blogger.

Popular Posts

Blog Archive

Popular Posts

Bala Chelimi

Editor:
Manikonda Veda Kumar

Executive Editor:

Gali Udaya Kumar
---- ----
Bala Chelimi
Chandram, 490, Street No.11,
Himayat Nagar, Hyderabad 500 029
www.balachelimi.com

Mail Instagram Pinterest RSS

నేస్తం

'చెలిమి' అనే మాటకు అర్థం మీకు తెలుసునుగా! స్నేహం, దోస్తి, మైత్రి అనే మాటలు కూడా అదే అర్థమిస్తాయి. స్నేహం అంటే ఒకరిపైన ఒకరికి ప్రేమ ఉండడం. ఎప్పుడూ కలిసి మెలసి ఆడుకోవాలనీ, ఒకరికి కష్టం వస్తే మరొకరు సాయం చేయాలనీ అనుకోవడం - అది స్నేహం యొక్క అంతరార్థం.
అలాంటి గాఢ స్నేహితులను గురించి చిన్న కథ చెబుతాను. రమణ, రవి ఎంతో మంచి స్నేహితులు, ఇద్దరూ ఇరుగుపొరుగు ఇళ్ళల్లో ఉంటున్నారు. చిన్నప్పటినుంచి ఒకే బడిలో చడువుకుంటున్నారు. కలిసి బడికి వెళ్ళి పక్కపక్కనే కూర్చునేవారు. ఇద్దరికి మంచి మార్కులే వచ్చేవి.
ఒకరోజు బడి దగ్గర ఉన్న చెరువు గట్టున కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు. రమణా, రవీ బడికి వెళుతూ వాళ్ళని చూశారు.
'ఒరేయ్‌! చిన్న పిల్లలు నీళ్ళ దగ్గరికి వెడితే ప్రమాదం. వెళ్ళి పొమ్మని చెపుదాం.'' అని అన్నాడు రమణ రవితో.
''పోరా! మనకెందుకు మనం చెపితే వాళ్ళు వింటారా? పద పద, బడికి వేళయిపోతూంది.'' అన్నాడు రవి.
సరే, వీళ్ళు నాలుగడుగులు వేశారో లేదో పిల్లలు గొల్లున గోల చేయడం వినిపించింది. ఎవరో చిన్న పిల్ల నీళ్ళలో కాలు జారి పడనే పడింది. రవి, రమణ వెనక్కి పరిగెత్తుకొచ్చారు. రవి చప్పున చొక్కా విప్పి నీళ్ళలో దూకాడు. నీళ్ళల్లో పడిన పిల్ల కాళ్ళు తేలిపోతుండగా చెరువులోకి జారిపోతూంది. రవి ఆ పిల్ల గౌెను పట్టుకుని ఒడ్డుకు లాక్కుని వచ్చాడు.
ఆ పాప భయంతో వణికిపోతూంది. పెద్దవాళ్ళు కొందరు ఈ గొడవ విని గబగబా వచ్చారు. పిల్లని ఎత్తుకుని గట్టు మీద కూర్చో బెట్టారు. కళ్ళు తెరిచి దిక్కులు చూస్తున్నది. పాప తండ్రికి ఈ విషయం తెలిసింది. ఆయన అక్కడికి వచ్చాడు. తన బిడ్డను రక్షించినందుకు రవిని మెచ్చుకున్నాడు. రవి అమ్మానాన్న  కూడా జరిగింది విని పాపకు, రవికి కూడా ప్రమాదం తప్పినందుకు సంతోషించారు.
ఇదంతా పూర్తయి బడికి కొంచెం ఆలస్యంగా చేరారు మిత్రులిద్దరూ. అప్పటికే రవి చేసిన సాహసకార్యం అందరికీ తెలిసిపోయింది. ఆ సాయంత్రం ప్రత్యేకంగా ఒక మీటింగ్‌ పెట్టారు. పాప తల్లిదండ్రులు రవికి బహుమతిగా నూరు రూపాయలు ఇచ్చారు. హెడ్మాస్టరు ప్రశంసాపత్రం బహుకరించారు. సభ పూర్తి అయ్యే సమయానికి రమణ తను కూడా ఒక్క నిమిషం మాట్లాడతానని అనుమతి కోరాడు.
''పెద్దలందరికీ వందనాలు. రవి సాహసవంతుడు. మంచివాడు. కానీ అవసరం అయినపుడు మాట్లాడడు. ముందు చూపులేదు. అది ఒక్కటే లోపం.'' అనేసి వెళ్ళి కూర్చున్నాడు. ఈ మాటలకు పిల్లలు పెద్దలు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. రవికి అంత గౌరవం జరిగినందుకు ఈర్షతో ఇలా మాట్టాడాడు అనుకున్నారు.హెడ్మాస్టరు రమణని వేదిక మీదికి పిలిచి-
''అందరు రవిని మెచ్చుకుంటూ ఉంటే నువ్వు అలా అనడం ఏమీ బాగుండలేదు రమణా! ఇందుకు ఏదో కారణం ఉండాలి. ఏమిటిది?'' అన్నారు. రమణ ఉదయం తామిద్దరు చెరువు దగ్గర నడుస్తున్నప్పుడు జరిగిని సంభాషణ చెప్పాడు.
''ముందుగానే ఆ పిల్లల్ని దూరంగా పంపి ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదు'' అన్నాడు రమణ. సభలో ఉన్న వారందరు నిజమే అని అంగీకరించారు. పాప తండ్రి మాట్లాడటానికి లేచి నిలబడటంతో అందరూ నిశ్శబ్బమై పోయారు.
''రమణ, రవికి నిజమైన స్నేహితుడు. ఎందుకంటే అందరూ రవిని మెచ్చుకున్నాగానీ, మిత్రునిలోని లోపాన్ని చెప్పి సరిదిద్దుకోమని హెచ్చరించిన రమణ, రవి మేలుకోరినవాడు. రవి ఇంకా పైకి రావాలన్న అభిమానంతో ఆ చిన్నలోపం కూడా లేకుండా ఉండాలని కోరుకుంటున్నాడు. మిత్రుడంటే ఎప్పుడూ ప్రేమగా ఉండేవాడు మాత్రమే కాదు. లోపాలను కూడా ఎత్తిచూపి మంచి మార్గం చూపేవాడు కూడా. అయితే రమణ తానైనా కనీసం ఆ పిల్లలను నీటి వద్దకు పోవద్దని చెప్పవలసింది. ఏది ఏమైనా పాపకి తప్పిన ప్రమాదానికి నాకు సంతోషంగా ఉంది. రవి, రమణల చెలిమి మరింత పెరగాలని ఆశీర్వదిస్తున్నాను అన్నారు. అందరూ చప్పట్లు కొట్టారు.
-- తురగా జానకీరాణి.

0 comments:

Post a Comment