

అగ్ని పర్వతాలు బద్ధలు కావటం, భూకంపాలు రావటం, సునామీ తీర ప్రాంతాలను ముంచెత్తటం వంటి ప్రకృతి ఉత్పాతాల గురించి మనం వింటూనే ఉన్నాం. మరి మనిషి చేసే పనుల వలన ఇంతే తీవ్రత ఉన్న ఎన్నో ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. సముద్రాల లోనికి మనం కావాలనో, ప్రమదావశాత్తూనో చమురును వదలటం ఇటువంటిదే. సముద్రంలో చమురు తెట్టలుతెట్టలుగా పైన పేరుకొంటే మనకేమవుతుంది? అని అందరూ అనుకొంటూ ఉంటారు. కాని ఇది వాస్తవం కాదు. ఒక్కసారి చమురు సముద్రపు నీటిలోకి చేరితే అది నీటి పైన పొరలాగా వ్యాప్తి చెందుతుంది. గాలి వీచే దిక్కుకు అనుగుణంగా ఈ చమురు పొర కూడా విస్తరిస్తుంది. దాంతో పైనుంచి పడే కాంతి తగ్గిపోయి, నీటి లోపల ఉండే వృక్ష జాతులలో కిరణ జన్య సంయోగ క్రియ జరగటం తగ్గుతుంది. నీటిలో నివసించే జంతుజాతులలో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయి. వాటి ఆహారంపైన ఈ చమురు పేరుకు ఉంటుంది కనుక వాటి జీర్ణ వ్యవస్థకూ ఇబ్బంది తప్పదు. జంతువుల శరీరంపైన చమురు పేరుకుని కొత్త సమస్యలను సృష్టిస్తుంది. అలాగే పక్షుల రెక్కలు, ఈకలలో నూనె చేరి అవి తగిన విధంగా ఎగరలేక పోతాయి. సముద్రం మధ్యలో పడిన చమురు అతి తక్కువ కాలంలోనే తీర ప్రాంతాలకు కొట్టుకువచ్చి తీర ప్రాంతాలూ కలుషితమవుతాయి.
భూమి మీద పడిన చమురు వాన నీటితో పాటు కొట్టుకు పోయి సముద్రాలలో కలవటం, భూమి పొరల్లోకి ఇంకి సముద్ర జలాల్లో కలవటం, సముద్రయానం ద్వారా చమురును ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ నీటిలో కలవటం వంటివి సముద్ర జలాల కాలుష్యానికి కారణంగా నిలుస్తున్నాయి.
ఒకసారి సముద్రం లోకి చమురు చేరిన తర్వాత, దానిని శుభ్రపర్చటం ఎంతో కష్టం. కొన్ని రకాల రసాయనాలను ఉపయోగించటం, చమురును సముద్రం మధ్యలోనే తగలబెట్టటం, కలుషితమైన నీటిని సేకరించి ప్రత్యేక విధానాల ద్వారా వడబోయటం వంటి పద్ధతులు ఉన్నప్పటికీ, ఎంతో కొంత హాని మాత్రం అప్పటికి జరిగిపోయే ఉంటుంది.
0 comments:
Post a Comment