Flash News
Powered by Blogger.

Popular Posts

Blog Archive

Popular Posts

Bala Chelimi

Editor:
Manikonda Veda Kumar

Executive Editor:

Gali Udaya Kumar
---- ----
Bala Chelimi
Chandram, 490, Street No.11,
Himayat Nagar, Hyderabad 500 029
www.balachelimi.com

Mail Instagram Pinterest RSS

నక్క-ముతాయిరాజు

చాలాకాలం క్రితం చైనాలో ముతాయి అనే ఒక పేదరైతు ఉండేవాడు. అతనికి ఒక చిన్న గుడిసె, కొద్దిపాటి పొలం మాత్రం ఉండేది. అతని పొలంలో ఒక దానిమ్మ చెట్టు ఉండేది. ఆ చెట్టు విరగ కాసినప్పుడు అతను సంతోషంతో గంతులు వేసేవాడు.
ఒకసారి అతని దానిమ్మచెట్టు బాగా కాసింది. ముతాయి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. అయితే అతని సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. రోజూ రెండు దానిమ్మ పండ్లు చెట్టునుంచి మాయమవసాగాయి. ముతాయికి ఏమీ అంతు పట్టలేదు. ఎలాగయినా సరే దానిమ్మ పళ్ళని ఎవరు కాజేస్తున్నారో తెలుసు కోవాలనుకున్నాడు. అందుకే రాత్రంతా మేలుకొని చెట్టు వైపే చూస్తూ కూర్చున్నాడు. దొంగను పట్టుకోవాలనుకున్నాడు. మరునాడు ఆ చెట్టు చుట్టూ జిగురు చల్లాడు. మామూలుగా పళ్ళను దొంగలించడానికి వచ్చిన నక్క కాళ్ళు జిగురుకు అతుక్కు పోయాయి. తనను చంపవద్దనీ, తనను వదిలేస్తే, అతనికి ఒక రాజకుమార్తెతో వివాహం జరిగేటట్లు చూస్తాననీ నక్క బతిమాలింది. ఒక వారం రోజుల్లో మాట నిలబెట్టుకోవాలని హెచ్చరించి ముతాయి నక్కను వదిలి పెట్టాడు.
 తరవాత ఆ నక్క ఒక చక్రవర్తి ధనాగారంలో జొరబడి కొన్ని ముత్యాలను దొంగిలించింది. మరునాడు ఆ చక్రవర్తి సభకు వెళ్ళింది. తను ముతాయి చక్రవర్తి బంటునని, ఆయన దగ్గర లెక్క లేనన్ని మణి మాణిక్యాలున్నాయని, వాటిని  వేరుచేయడానికి ఒక జల్లెడ కావాలని అడిగింది. చక్రవర్తి దానికి ఒక జల్లెడ ఇచ్చాడు. రెండు రోజుల తర్వాత నక్క తిరిగి చక్రవర్తి సభకు వెళ్ళింది. జల్లెడతో పని అయిపోయిందని చెబుతూ జల్లెడను, సభలో నేలమీద పెడుతూ, ఎనిమిది ముత్యాలను కావాలని వదిలేసింది. రాజసేవకులు జల్లెడను చక్రవర్తి చేతికి ఇచ్చినపుడు అందులో ఉన్న ఎనిమిది ముత్యాలు చక్రవర్తి ఒడిలో పడ్డాయి. ఆ ముత్యాలను చూసి  చక్రవర్తి ఆశ్చర్యపడ్డాడు. ముతాయి చక్రవర్తి వద్ద ఇలాంటి ముత్యాలు, రత్నాలు, మణులు లెక్కలేనన్ని ఉన్నాయని, జల్లెడలో ఉండి పోయిన ముత్యాలు చాలా చిన్నవి కావడం వల్ల వాటిని తను పట్టించుకోలేదని చక్రవర్తి ముందు నక్క దర్పం ఒలకబోసింది. ఆ ముత్యాలను చక్రవర్తికి కానుకగా ఇచ్చేసింది.
చక్రవర్తి నక్కను పక్కకు తీసుకువెళ్ళి రహస్యంగా మాట్లాడాడు. ''నేను ముసలి వాణ్ణయి పోతున్నాను. నా కూతురుకి ఇంకా పెళ్ళి కాలేదు. అదొక్కటే నా విచారం. నువ్వు మధ్యవర్తిగా ఉండి నా కూతురుకీ మీ ముతాయి చక్రవర్తికీ పెళ్ళి జరిపించు'' అన్నాడు. నక్క సంతోషంతో ఒప్పుకుంది. చక్రవర్తి కూతురుకి తమ ముతాయి చక్రవర్తి సరియైన జోడి అనీ, పెళ్ళి తప్పక కుదురుస్తాననీ చెప్పింది. అంతే కాదు ఒక వారం లోపలే తను వచ్చి వివాహ వేడుకలలో స్వయంగా పాల్గొంటానని చెప్పి వెళ్ళిపోయింది.
నక్క తెచ్చిన వార్త విని ముతాయి సంతోషంతో తలమునకల య్యాడు. వెంటనే విచారం కూడా అతన్ని ఆవరించింది. అతని దగ్గర రాజకుమార్తెకు ఇవ్వడానికి ఏ విలువైన కానుకలు లేవు. కనీసం పెళ్ళినాడు వేసుకోవడానికి కొత్త బట్టలైనా లేవు. చివరికి మంచి చెప్పులు కూడా లేవు. అయితే నక్క అతనికి ధైర్యం చెప్పింది. అంతా సవ్యంగా జరిగిపోతుందని ఒక వారం రోజులలోగా పెళ్ళికి వెళ్ళడానికి తయారుగా ఉండమనీ చెప్పి వెళ్ళిపోయింది.
వారం రోజుల తర్వాత నక్క ఒక కంబళి తీసుకుని ముతాయి దగ్గరికి వచ్చింది. ముతాయీ, నక్కా పెళ్ళికి బయలుదేరారు. చక్రవర్తి నగరం దగ్గరకు రాగానే నక్క, ముతాయిని అక్కడే ఉన్న ఒక సరస్సులో దూకమంది. నక్క చెప్పినట్లుగా ముతాయి సరస్సులో దూకాడు. చలిలో గజగజ వణుకుతూ ముతాయి సరస్సులోనుంచి బయటకు రాగానే, నక్క అతని చిరిగిన దుస్తులను విప్పించి దూరంగా విసిరేసి తను తెచ్చిన కంబళి అతని ఒంటిమీద కప్పింది. తరవాత ఇద్దరూ రాజధానికి వెళ్ళారు.

రాజసభలో కంబళి కప్పుకొని చలికి వణుకుతూ నిలుచుని ఉన్న ముతాయిని చూపిస్తూ ''మహారాజా, నేను, ముతాయి చక్రవర్తిని తీసుకు వచ్చాను.'' అని నక్క చక్రవర్తికి చెప్పింది. ''మాకు మార్గంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, పట్టుబట్టలు, విలువైన నగలు, వెలలేని మణులు నలభై ఒంటెలమీద పెట్టుకుని మేము పెళ్ళికి బయలుదేరాము. మీ నగరం అవతల ఉన్న నది మీద వంతెన దాటుతుంటే, మా ఒంటెల బరువుకు ఆ వంతెన కూలి అందరం నదిలో పడిపోయార. మా సామానులు, ఒంటెలు నదిలో కొట్టుకు పోయాయి. మేము మాత్రం ఎలాగో ప్రాణాలతో బయట పడ్డాం'' అంది.
నలభై ఒంటెల మీద విలువైన సామానులు నింపుకు వచ్చామని నక్క చెప్పిన వార్త చక్రవర్తిని తబ్బిబ్బు చేసింది. వెంటనే అతను దర్జీ వాళ్ళను పిలిపించి, ముతాయికి రాచఠీవికి తగినట్లు దుస్తులు కుట్టమని ఆదేశించాడు. ఆ రోజు సాయంత్రమే ముతాయికి, చక్రవర్తి కూతురుకి వైభవంగా పెళ్ళి జరిగిపోయింది. అంత సంతోషంలోనూ ముతాయి గుండెల్లో పుట్టెడు దిగులు నిండి ఉంది. చుట్టూ ఎవరూ లేకుండా చూసి నక్కతో తన బాధను చెప్పుకున్నాడు.
''పెళ్ళి చేసుకోవడం, అందరి చేతా చక్రవర్తి అనిపించుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. కానీ నా భార్య నా యింటికి వచ్చి నా పేదరికాన్ని చూసినప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు'' అన్నాడు.
నక్క అతని భయాలను కొట్టిపారేసి, అతనికి ధైర్యం చెప్పింది. మరునాడు విందు ముగిశాక, ముతాయి భార్యతో తన యింటికి బయలుదేరాడు. వారివెంట గుర్రాలు, గాడిదలు, బళ్ళు ఎన్నో ఉన్నాయి. ముతాయికి భయంతో ముచ్చెమటలు పోశాయి. సలహా కోసం నక్కను పిలిచాడు. కానీ నక్క ఎక్కడా కనిపించలేదు.

నక్క, ముతాయి బృందం కంటే చాలా ముందుగా పరిగెత్తుతూ వెళ్ళిపోయింది.అలా వెళ్ళిన నక్క ముప్పయి ఒంటెలమీద సామానులు వేసుకుని వస్తున్న వ్యాపారస్తుల బృందం ముందు ఆగింది. కళ్ళనిండా భయం నింపుకుని, ముతాయి బృందం వస్తున్న దిక్కుకేసి చూపిస్తూ-
''అటునుండి ఒక పెద్ద దొంగల ముఠా వస్తోంది. మీరు వెనక్కి తిరిగి పారిపోతే తప్ప మీ ప్రాణాలు మీకు దక్కవు'' అంది.
వ్యాపారస్తులు నక్క చూపించినవైపు చూశారు. గుర్రాల సకిలింపులు వినిపించాయి. గుర్రాల పరుగు వల్ల గాలిలో లేచిన ధూళి వారికి కనిపించింది. ఆ దొంగల ముఠానుంచి తప్పించుకొని పారిపోవడం సాధ్యం కాదని వారికి తెలిసిపోయింది. తమను ఎలాగయినా కాపాడమని నక్కను బతిమాలారు.
''మీరు ప్రాణాలతో బయటపడాలంటే ఒకే మార్గముంది. ఆ దొంగల గుంపు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరందరూ తలలు వంచుకుని, 'మేమంతా ముతాయి చక్రవర్తి సేవకులం' అనాలి. - అని నక్క వ్యాపారస్తులకు సలహా ఇచ్చింది. వాళ్ళు అలాగే అన్నారు. వ్యాపారస్తులు తనను చూసి 'మేమంతా ముతాయి చక్రవర్తి సేవకులం' అనడం ముతాయికి ఆశ్చర్యం కలిగించింది.

తరవాత నక్క ముందుకు పరుగెత్తి పశువుల కాపరులను కలుసుకుంది. దూసుకు వస్తున్న దొంగల గుంపు గురించి చెప్పింది. వాళ్ళు భయంతో గజగజ వణికిపోయారు. తమను కాపాడమని నక్కను వేడుకున్నారు. ''మీరు బతికి ఉండాలంటే ఒకటే ఉపాయముంది. ఆ దొంగల గుంపు మీ దగ్గరకు రాగానే 'మేమేంతా ముతాయి చక్రవర్తి గుర్రాలను, పశువులను కాస్తున్నాం' అని అరవండి. మీ ప్రాణాలకు ఢోకా ఉండదు.'' అంది. ముతాయి బృందం దగ్గరకు రాగానే వాళ్ళంతా నక్క చెప్పినట్టుగానే అరిచారు. ఇలా ముతాయి బృందం ముందుకు సాగుతున్నంత సేపు రైతులు, వ్యాపారస్తులు, బిచ్చగాళ్ళు ముతాయి చక్రవర్తికి జయజయ ధ్వానాలు పలికారు.

పాపం! రోజంతా పరిగెత్తిన నక్క ఆయాసంతో రొప్పుతోంది. అలా రొప్పుతున్న నక్కకు ముతాయి ఇంటికి సమీపంలోనే ఒక పర్వతంలో మలచబడిన రాజ భవనం కపిపించింది. ఆ రాజ భవనం ఒక దయ్యానిది. ఆ కాపలా భటులకు టోకరావేసి నక్క, ఆ దయ్యం పడుకునే గదిలోకి దూరింది. దయ్యం ఉన్న పరుపు మీదకు ఒక్క గెంతులో దూకి దయ్యాన్ని నేలపైకి లాగి వేసింది.
''దయ్యపు రాజా! నీ ప్రాణాల మీదకు ముంచుకు వచ్చింది. నీ భవనం బయట వందల మంది దొంగలు ఉన్నారు. వాళ్ళంతా గోడలు పగలగొట్టుకొని లోపలికి వస్తున్నారు. నిన్ను చంపి తీరు తామని వాళ్ళు శపథం పట్టారు. నువ్వు బతికి బయటపడాలంటే నీ పొయ్యి వెనుక గూటిలో దాక్కో'' అంది నక్క.
దయ్యం ఎలాగో పొగ గూటిలో ఇరుక్కుని కూచుంది. వెంటనే  నక్క పొయ్యి నిండా కట్టెలు పెట్టి పెద్ద మంట వేసింది. ఆ మంటలు దయ్యాన్ని కాల్చి వేయసాగాయి. తనను కాపాడమని దయ్యం బొబ్బలు పెట్టింది. నక్క ఆ పెడబొబ్బలు పట్టించుకోకుండా మంటను ఇంకా ఎక్కువ చేసింది. చివరికి ఆ దయ్యం మంటల్లో కాలిపోయి బూడిద అయింది. నక్క, బూడిద అయిన దయ్యాన్ని కిటికీలోంచి అవతలికి విసిరి వేసింది.
తరవాత నక్క, బయటికి వచ్చి దయ్యం చచ్చిపోయిందని, కొద్ది సేపట్లోనే కొత్త చక్రవర్తి వస్తున్నాడని కాపలా వాళ్ళతో చెప్పింది. రాజభవనం సేవకులందరు, రెండు వైపులా బారులు తీర్చి నిలబడి ముతాయి చక్రవర్తికి స్వాగతం చెప్పారు. ముతాయి, దయ్యపు రాజ్యానికి కొత్త చక్రవర్తి అయినాడు. నక్కను తన ముఖ్యమంత్రిగా చేసుకున్నాడు. ముతాయి చక్రవర్తి ప్రజలను కన్నబిడ్డల వలె పాలిస్తూ అందరిచేత మంచి అనిపించు కున్నాడు. ముతాయి చక్రవర్తి నక్కను అడగకుండా ఏ నిర్ణయం తీసుకునేవాడు కాదు.
పది సంవత్సరాల తరవాత నక్క చచ్చి పోయింది. ముతాయి చక్రవర్తి, తన ఆప్త మిత్రుడి జ్ఞాపకాలు ఎప్పటికి నిలిచిపోవాలనే ఉద్దేశంతో నక్క వెంట్రుకలతో ఒక టోపి తయారు చేయించాడు. ఆ టోపి ప్రజలందరికీ నచ్చింది. అందుకే ఇప్పటికీ అక్కడి ప్రజలు, నక్క చనిపోగానే దాని బొచ్చుతో టోపి తయారు చేస్తారు.
-సురేశ్‌ ఆత్మరామ్‌

0 comments:

Post a Comment