అందమైన స్విట్జర్లెండును ఒక దుర్మార్గుడు పరిపాలించే వాడు ఆ దుర్మార్గుణ్ణి తొలగించి మంచి రాజ్యం ఏర్పరచాలని అనేకమంది దేశ భక్తులు ప్రయత్నించేవారు. అలాంటి దేశభక్తులలో ప్రముఖుడు విలియంటెల్.
విలియం టెల్ విలువిద్యలో నిపుణుడు. అతని కొక ముద్దుల చిన్నారి కొడుకుండేవాడు. టెల్‌ను పట్టుకోవాలని సైనికులు ఎంత ప్రయత్నించినా వారికి చిక్కలేదు. సైనికులు దేశమంతా వెదికారు. కనబడిన వారినల్లా అడిగారు. కొందరిని కొట్టారు. మరి కొందరిని ఖైదులో అనుకోకుండా వారికి టెల్ చిన్నారి కొడుకు తారస పడ్డాడు. ఆ బాబును తీసుకు పోయారు. ఆ బాబు సైనికాధికారి వద్ద ఉన్నట్లు దేశమంతటా చాటింపు వేయించారు. విలియం టెల్ వస్తే ఆ బాబును అప్పచెపుతామని కూడా ఆ చాటింపులో చెప్పించారు. విలియం టెల్ ధైర్యసాహసాలు కల వీరుడు. అందుచేత, ఏమాత్రం జంకకుండా సైనికుల వద్దకు వెళ్లాడు. అక్కడున్న బాబును ముద్దులాడాడు. ఆ దృశ్యం చూస్తున్న సైనికాధికారికి ఒక చిలిపి ఊహ వచ్చింది.
''టెల్ నేనొక చిన్న పరీక్ష పెడతాను. దానిలో నెగ్గితో నీ కొడుకును నీవు తీసుకు వెళ్ళవచ్చును'' అన్నాడా దుర్మార్గుడు ''ఏమిటా పరీక్ష?'' అని అడిగాడు టెల్.
''నీవు విలువిద్యలో గొప్పవాడివి కదా! అందులోనే నీకు పరీక్ష!'' అన్నాడు. ''విలువిద్యలో అయితే సరే! ఇంతకీ ఏమిటా పరీక్ష!'' అన్నాడు టెల్.
''ఏభై అడుగుల దూరంనుంచి ఏపిల్ పండును బాణం తో కొట్టాలి'' అని వికటంగా నవ్వాడా నియంత.
''ఇంతేనా! దీనికి నవ్వుతా వెందుకు?''అని చిరాకు పడ్డాడు టెల్.
''కొంచెం గమ్మత్తుంది . . . . ఆ ఏపిల్ పండు నీ కొడుకు తల మీద పెడతాము. అప్పుడు కొట్టాలి'' అని మళ్లీ నవ్వాడు.
విలియం టెల్ ఒక నిమిషం ఆలోచించి ''సరే!'' అన్నాడు.
బాబును ఒక చోట నించోబెట్టి అతని తలపై యాపిల్ పండుంచారు. సరిగ్గా ఏభై అడుగులు కొలిచారు. అక్కడ నించుని బాణం వదలాలన్నమాట.
విలియం టెల్ కొడుకువంక చూశాడు. ఒకసారి మధ్య ఉన్న దూరం ఎంతో చూసుకున్నాడు. గట్టిగా ఊపిరిపీల్చి వదిలాడు. తన అంబుల పొదలో నుంచి మంచి తిన్నని బాణాలు రెండు ఎంచుకున్నాడు.
ఒక బాణం విల్లుకు తగిలించి గురి చూశాడు. వింటితాడు వెనక్కి లాగి బాణం వదిలాడు. బాణం రయ్యిన వెళ్ళి ఏపిల్ పండును రెండు ముక్కలు చేసింది. అక్కడున్న వాళ్ళంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు.
టెల్ తన కొడుకు దగ్గరకు పరుగెత్తు కెళ్లాడు. ఎత్తుకుని ముద్దాడాడు. నెమ్మదిగా నడిపించి పిల్లవాణ్ణి గుర్రం వద్దకు తీసుకు వచ్చాడు.
అప్పుడా దుర్మార్గ సైనిక నియంత ''సరే! ఒక్క బాణంతో ఏపిల్‌ను కొట్టగలగిన నీవు రెండు బాణాలెందుకు తీసుకున్నావు'' అని అడిగాడు.
''ఒక బాణం గురి తప్పి బాబుకు చిన్న దెబ్బ తగిలినా రెండో బాణం నీ గుండెల్లోకి దూసుకుపోయేది'' అని సమాధానం చెప్పాడు.
''పట్టుకోండి. . . . పట్టుకోండి'' అని కేకలు వినబడిన మరుక్షణం కొడుకును తీసుకుని గుర్రం ఎక్కి మాయమయ్యాడు విలియం టెల్. (తరవాత స్విట్జర్లెండుకు స్వాతంత్య్రం వచ్చింది)
0 comments:
Post a Comment