బుల్లి బుల్లి స్టాంపులు
'స్టాంపుల సేకరణ' ఒకమంచిహాబీ, దేశవిదేశాల స్టాంపులు సేకరించటం వల్ల ఆయాదేశాల వన్య జీవులు, పక్షులు, కట్టాడాలు, నాయకులు, ప్రముఖ వ్యక్తులు, ఆచార వ్యవహారాలు మొదలైన విషయాల్ని గురించి తెలుస్తుంది. ఒక చిన్న స్టాంపు ఎన్నో విశేషాలు తెలియజేస్తుంది. వినోదంతో పాటు విజ్ఞానాన్ని పెంచే ఒక చక్కని హాబీ ఇది.
ప్రపంచంలో మొట్టమొదట ఒక ఇంగ్లీషు మహిళ 'స్టాంపుల సేకరణ' మొదలు పెట్టింది. ఆమె వద్ద దాదాపు 16,000 స్టాంపులుండేవి. ప్రపంచంలోని వివిధ దేశాల స్టాంపులు కొంటానని ఆమె 1814లో 'లండన్ టైమ్స్' అనే పత్రికలో ప్రకటన ఇచ్చింది.
స్టాంపు చరిత్ర:
19వ శతాబ్దం వరకు కూడా బ్రిటన్‌లో ఉత్తరాలు,పార్శిళ్ళు,పోస్టింగ్ అన్నీ అవకతవకలుగా ఉండేవి. పోస్టల్ రేట్లు ఒక తీరుగా ఉండేవికావు. ముందే డబ్బుకట్టి ఉత్తరాలు పంపేవారు. లేకపోతే ఉత్తరాలు అందుకున్నాకే వారు డబ్బు కట్టేవారు. రేట్లుకూడా దూరాన్ని బట్టి ఉండేవి. ఇదే సమయంలో 'రౌలండ్ హిల్' (1795-1879) అనే అతను ప్రతిపాదించిన రెండు సూచనలు బ్రిటిష్ ప్రభుత్వానికి నచ్చాయి. ఫలితంగా 1840 లో మొట్టమొదటి స్టాంపు వెలువడింది. దీన్ని మే 6, 1840 న ఉపయోగించడానికి వీలుగా మే 1వ తేదీన అమ్మకం ప్రారంభించారు. భారతదేశంలో 1854 లో విక్టోరియా మహారాణి మొట్టమొదటి సారిగా స్టాంపులు జారీచేసింది. వాటిపై విక్టోరియారాణి బొమ్మ ఉండేది.
అరుదైన, ఖరీదైన స్టాంపులు:
బ్రిటిష్‌లోని గయానాలో 1856 ఫిబ్రవరిలో విడుదలైన ఒక సెంట్ విలువగల స్టాంపు ప్రపంచంలోని ఒక అరుదైన, ఖరీదైన స్టాంపుగా గుర్తింపు పొందింది. ఇది విడుదలైన 17 సంవత్సరాలకు ఒక పాఠశాల బాలుడు ఈ స్టాంపును 10 షిల్లింగ్ (దాదాపు పదిరూపాయలకు) లకు స్టాంపులు సేకరించే వ్యక్తికి అమ్మాడు. ఈ స్టాంపు దేశ విదేశాలు తిరిగి ఇప్పుడు ఒక కోటి రూపాయల విలువ చేసే స్టాంపుగా అగ్రస్థానంలో ఉంది.
రకరకాల స్టాంపులు
స్టాంపులు రకరకాలుగా ప్రింటు చేస్తారు. జాతీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులు, జంతువులు, పక్షులు, ఆటలు, పిల్లలు, ఆ దేశపు చారిత్రాత్మక ప్రదేశాలు, కట్టడాలు ఇలా. . . ఇవే గాక అంతర్జాతీయ బాలికల దినోత్సవం, ఒలింపిక్‌గేమ్స్, ఏషియన్‌గేమ్స్, బాలల దినోత్సవం ఇలా ప్రత్యేక సందర్భాలలో కూడా స్టాంపులు వెలువడతాయి.
స్టాంపులలో జరిగే పొరపాట్లు:
స్టాంపుల ప్రింటింగ్‌లో ఒకొక్కసారి పొరపాట్లు జరుగుతాయి. స్టాంపులలో ఒకదానిపైన ఇంకోటి ప్రింట్‌కావడం, రంగులు ప్రింట్ కాకపోవడం, సగమే ప్రింటవడం, మధ్య డిజైన్ తలకిందులుగా పడటం, రేటు తప్పుగా పడటం ఇలాంటివి జరుగు తుంటాయి. ఇలాంటి స్టాంపులు, కొన్ని లక్షల రూపాయల విలువ చేస్తాయి.
స్టాంపుల విశేషాలు:
స్టాంపుల సేకరణనే 'ఫిలాటెలీ' అని కూడా అంటారు. ఇది 'ఫిలాన్' అనే గ్రీకు పదం నుంచి పుట్టింది.
- ప్రపంచపు పోస్టల్ యూనియన్ సేకరణ అక్టోబర్ 9,1874లో జెనీవాలో స్థాపించబడింది. ప్రతీ దేశంలో విడుదలైన ప్రతి స్టాంపు 400 కాపీలు జెనీవాకు చేరతాయి. 1926 లో నాసిక్ (మహారాష్ట్ర)లో ఇండియా సెక్యూరిటీ ప్రెన్ స్థాపించబడింది. అప్పటి నుంచి మనదేశపు స్టాంపులు అందులో ప్రింటు అవుతున్నాయి.
స్విట్జర్లండ్, జర్మనీ, డచ్, అమెరికా, లండన్‌లలో పోస్టల్ మ్యూజియంలు ఉన్నాయి.
0 comments:
Post a Comment