పూర్వం ఒక హరిదాసు నవాబు దర్శనం చేసుకుని, రసవత్తరంగా హరికథ చెప్పి నవాబును మెప్పించాడు. నవాబు వెంటనే హరిదాసు వంటినిండా మల్లెమాలలు చుట్టి ఏనుగుపై ఊరేగించి వెయ్యి వరహాలు బహుమానం ఇవ్వమని ఆజ్ఞాపించాడు. భటులు దాసును పక్క గది లోకి తీసుకువెళ్ళి మల్లెమాలలు వంటినిండా చుట్టారు. కాని దాసుకు బట్టతల ఉండటం వలన తలమీద మల్లెమాలలు జారి పోయాయి. భటులు రాజు వద్దకు వచ్చి ప్రభువు చెప్పినట్లు చేయలేకపోతున్నామని కారణం వివరించారు. తన మాటకు ఎదురు ఉండటం నవాబు సహించలేకపోయాడు. ''జారి పోతున్నాయి అనే సాకుతో బట్టతల మీద మల్లెమాలలు చుట్టడం మానేస్తారా? దాసుగారి గుండు మీద మేకులు కొట్టి మాలలు చుట్ట బెట్టండి.'' అని కోపంగా అన్నాడు. ఈ మాటలు విన్న దాసుగారు కిటికీలో నుంచి దూకి పారిపోయాడు. తల మీద మేకు కొట్టించుకోవడం అంటే ఎంతటి ధైర్యవంతుడికైనా సాధ్యమయ్యే పనికాదు. నేను చెప్పే గమ్మత్తు అచ్చంగా ఇటువంటిదికాదు.
తలమీద 10 సెం.మీ. మందం కలిగిన దేవదారు కర్రముక్క ఉంచి, ఆ కర్రలోకి 8 సెం.మీ. పొడవు ఉన్న మేకును సుత్తితో కొట్టి దిగగొట్టాలి. అమ్మో! ఆ అదురుకి బుర్ర ఉంటుందా అసలు? బుర్రకు అదురు తగల కుండా కర్ర దిమ్మలోకి మేకును దిగ్గొట్టే సులభ పద్ధతి ఒకటి ఉంది.
చాలా లావుగా ఉన్న గ్రంథాలు మూడు నాలుగు తెచ్చి తలమీద దొంతరగా పెట్టి, వాటి మీద కర్ర దిమ్మ పెట్టి అప్పుడు ఆ కర్రలోకి మేకు కొడితే అతి సులభంగా తలకి అదురు తగలకుండా పని జరిగిపోతుంది. దీనికి కారణం ఏమిటో తెలుసా?
వస్తువులన్నింటికీ ఒక విధమైన 'జడత్వం' ఉంది. అది ఎటువంటిదంటే స్థిరంగా ఉన్న వస్తువు కదలదు. అంతేకాదు. కదులుతున్న వస్తువు ఆగదు. ఈ సంగతి మొట్టమొదటిసారిగా ఐజాక్ న్యూటన్ ఊహించి తన గతిశాస్త్ర సూత్రాలలో ఒకటిగా పేర్కొన్నాడు. వస్తువు బరువు ఎక్కువైన కొద్దీ ఈ జడత్వం కూడా ఎక్కువ అవుతుంది. లావుపాటి పుస్తకాలకున్న జడత్వం వల్ల సుత్తి దెబ్బ మేకు మీద పడినపుడు మేకు కదులుతుందే గాని కింద ఉన్న పుస్తకాలు అంతగా కదలవు. కనుక తలకి అదురు అంతగా ఉండదు. అదీ సంగతి!
0 comments:
Post a Comment